Kagaz nagar
-
కొమరం భీం జిల్లా: కాగజ్ నగర్ పట్టణంలో పులి కలకలం
-
TS: మూడు జిల్లాలను వణికిస్తున్న మ్యాన్ ఈటర్స్
సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్: చలితో పాటు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను పెద్దపులి కూడా వణికిస్తోంది. పులి దాడిలో ఓ రైతు మృతి చనిపోవడంతో కలవరపాటుకి గురి చేస్తున్నాయి. పశువులపైనా దాడులు చేస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లోని ఎనిమిది మండలాల ప్రజలను పులుల కదలికలు జనాలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరోవైపు వాటిని ట్రేస్ చేసి పట్టుకునేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నం చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్లో టెన్షన్ టెన్షన్ నెలకొంది. గురువారం దాదాపు పన్నెండు గంటలపాటు పులి సంచారించిందన్న ప్రచారం.. ప్రజలను భయాందోళనకు గురి చేసింది. మరోవైపు ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లడంపై ఆంక్షలు విధించారు పోలీసులు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేస్తూ పహారా కాస్తున్నారు. బయటకి రావొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చివరి సారిగా పులి జాడ తెలియగా.. టౌన్ దాటి పెద్ద వాగు గుండా అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో అటవీ సమీప గ్రామాలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఖానాపూర్ శివారులో సిడాం భీము అనే వ్యక్తిని పులి దాడి చేసి చంపేసింది. ఆ పులే కాగజ్ నగర్లోనూ సంచరించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక.. కాలి ముద్రల ఆధారంగా పులి ఆనవాలును నిర్ధారించుకునే యత్నం చేస్తున్నారు. ఇక పులి సంచారంతో స్థానికులు భయం భయంగా గడిపారు. తలుపులు తీయడానికే జనం వణికిపోతున్నారు. మూడు జిల్లాలు, 8 మండలాలు, 18 గ్రామాలను ఇప్పుడు మ్యాన్ ఈటర్స్ వణికిస్తున్నాయి. తొలుత మ్యాన్ ఈటర్స్ కాదని అధికారులు ప్రకటించినా.. ఖానాపూర్ రైతు మరణంతో ఆ భయం రెట్టింపు అయ్యింది. మరోవైపు అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం లోకారి దారిలో పులి కలకలం రేగింది. రోడ్డు దాటుతూ వాహనదారులకు పులి కనిపించిందన్న ప్రచారంతో అక్కడా భయం నెలకొంది. మైక్‌ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని అటవీశాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. దహేగాం మండలం ఖర్జి గ్రామంలో పశువుల మందపై పులి పంజా విసిరినట్లు తెలుస్తోంది. భీంపూర్ , తాంసి , జైనథ్ మండలాల పరిదిలోని పెనుగంగ తీరం వెంట ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. తీవ్ర యత్నం అటవీ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తమ ప్రయత్నం గురించి అధికారులు వివరిస్తున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 మంది ప్రత్యేక అటవీశాఖ టీంతో ట్రాకింగ్ చేస్తున్నారు. 35 కెమెరాలు, 50 మంది టైగర్ ట్రాకర్స్ తో పులి సంచార ప్రాంతాల్లో అణువణువునా గాలిస్తున్నారు. ఖానాపూర్, గోవిందపూర్, చౌపన్ గూడ అటవీ ప్రాంతాలపై ప్రధానంగా దృష్టిసారించారు. కోల్‌బెల్ట్‌లోనూ ప్రచారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోనూ పులి సంచారం కలకలం రేపింది. దీంతో స్థానికులు, సింగరేణి కార్మికుల్లో భయాందోళన నెలకొంది. విషయం దృష్టికి రావడంతో.. శ్రీరాంపూర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పులి ఆనవాళ్లు కనిపించలేదని, ప్రజలు భయాందోళన చెందవద్దని ప్రజలకు భరోసా ఇస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇదీ చదవండి: దళితబంధులో ఎమ్మెల్యేల జోక్యమా? -
థర్మాకోల్ తెప్ప బోల్తా.. విద్యార్థులు సురక్షితం
కాగజ్‌నగర్ టౌన్: కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవాగులో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు థర్మాకోల్ తెప్ప బోల్తా పడింది. నలుగురు పాఠశాల విద్యార్థులు, ఇద్దరు కూలీలను తెప్పపై ఒడ్డుకు చేర్చుతుండగా ఒక్కసారిగా ఒకవైపు ఒరగడంతో వాగులో పడిపోయారు. కొందరు వాగులో నడుస్తూ తెప్పపై కూర్చోబెట్టి వాగు దాటిస్తుంటారు. ఇలా దాటిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. దాటిస్తున్న ముగ్గురు వ్యక్తులు పడిపోయిన వారిని వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చారు. బ్యాగులు, కూలీల సెల్ఫోన్లు వాగులో పడిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందవెల్లి పెద్దవాగుపై ఉన్న వంతెన ఇటీవలి భారీ వర్షాలకు కుంగిపోయింది. అధికారులు ఆ వంతెన మార్గాన్ని మూసివేయడంతో గత్యంతరం లేక ఇలా తెప్పలపై దాటుతున్నారు. తహసీల్దార్ ప్రమోద్ తెప్పలపై తరలింపును నిలిపి వేయించారు. -
పేరుకు ఊరి సర్పంచ్.. చేసేది గంజాయి సరఫరా
కాగజ్‌నగర్ రూరల్: ఆయనో పంచాయతీకి సర్పంచ్. గ్రామానికి ప్రథమ పౌరుడు కాస్త దారి తప్పాడు. గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని ఈస్గాం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను గురువారం పట్టుకున్నట్లు సీఐ రాజేంద్రప్రసాద్, ఎస్సై సందీప్‌కుమార్ తెలిపారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ.. 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక పట్టుబడ్డ వారిలో చిన్నమాలిని గ్రామ సర్పంచ్ సుర్పం భగవంత్‌రావు, ఈస్గాం గ్రామానికి చెందిన సౌమిత్ర సర్కార్ ఉన్నారు. వారు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేశారు. వారిద్దరూ రహస్య ప్రాంతం నుంచి ఈజ్గాం మార్కెట్‌కు గంజాయి తరలిస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, 300 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: ఎమ్మెల్యేగా 18 ఏళ్లు ఉండి ఈటల ఒక్క ఇల్లయినా కట్టిచ్చిండా? -
Tiger: దాగుడుమూతల పులి.. ఒక్కచోట ఉండదే..
సాక్షి, దహెగాం(ఆదిలాబాద్): పులి భయాందోళన సృష్టిస్తోంది. స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోని వ్యాఘ్రం నిత్యం వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతోంది. గత రెండు వారాలు కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఎక్కువగా తారసపడుతుంది. అడవిని వదిలి మైదాన ప్రాంతాల్లోకి వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది. స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం మరచిన పులి నిత్యం దహెగాం, పెంచికల్పేట్, బెజ్జూర్, సిర్పూర్(టి) మండలాల్లో సంచరిస్తుంది. పెద్దవాగు దాటి మైదాన ప్రాంతాల్లోకి వస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. గతేడాది నవంబర్, డిసెంబర్ మాసంలో జిల్లాలో ఇద్దరిని హతమార్చింది. అప్పటి నుంచి పులి ఉనికిని చాటుకుంటుంది. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి ఉమ్మడి జిల్లాలోని కవ్వాల్ టైగర్ జోన్‌కు నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ఈక్రమంలో కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో సంచరిస్తోంది. ఇక్కడ అడవులు నరకడం, దట్టమైన ప్రాంతం లేకపోవడంతో దారి తప్పుతున్న పులి నిత్యం మైదాన ప్రాంతాల్లోకి వస్తోంది. ఈక్రమంలోనే పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతోంది. పెరిగిన సంచారం.. ఇటీవల కాలంలో పులి సంచారం ఎక్కువగా పెరిగింది. దహెగాం మండలంలోని చెడ్వాయి అటవీ ప్రాంతం నుంచి ఆదివారం పెద్దవాగు దాటి ఐనం, పొలంపల్లి, పెసరికుంట, మంచిర్యాల జిల్లా భీమిని మండలం చినగుడిపేట శివారుకు వెళ్లింది. ఈక్రమంలో పత్తి చేలలో పనులు చేసుకుంటున్న రైతులు పులిని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం అందించడంతో అడుగుల ఆధారంగా ట్రేస్ చేసే పనిలో పడ్డారు. అలాగే ఆదివారం రాత్రి బెజ్జూర్ మండలం చిన్నసిద్దాపూర్ సమీపంలో పులి సంచరిస్తుండడంతో రమేశ్, నగేశ్ అనే వ్యక్తుల కంటపడింది. కేకలు వేయడంతో వెనుదిరిగింది. సిర్పూర్(టి) రేంజ్ పరిధిలో గత రెండు వారాలుగా పులి కదలికలు ఉన్నాయి. ఇటిక్యాల పహాడ్, నవేగాం, హుడ్కిలి, జక్కాపూర్, లక్ష్మీపూర్, భూపాలపట్నం, చింతకుంట, హీరాపూర్, కేశవపట్నం, లింబుగూడ, రావన్‌పల్లి గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచరించింది. ఈక్రమంలో తరచూ పశువులపై దాడులకు పాల్పడుతూ హతమార్చుతోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిక్కదు.. దొరకదు నిత్యం పశువులపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న పులి అధికారులకు మాత్రం చిక్కడం లేదు. గతేడాది నవంబరులో దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన సిడాం విగ్నేష్ అనే యువకుడిని పులి హతమార్చింది. అదే నెలలో పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన యువతిని పైతం పత్తి చేనులో చంపింది. దీంతో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి లేగదూడలను ఎరగా పెట్టారు. అయినా పులి బోన్ల వైపు రావడం లేదు. డివిజన్ పరిధిలో నాలుగు పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గతంలోనే ప్రకటించారు. అయితే ఎప్పుడు ఏ పులి వస్తుందో తెలియకుండా ఉంది. సరిహద్దుకు అవతలి వైపు అటవీ అధికారులు అధునాత సాంకేతికతో పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి అధికారుల సాయంతో పులిని బంధించేందుకు యత్నించినా దీనిపై అధికారులు అంతగా దృష్టి సారించడం లేదు పులి నుంచి అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించడం మినహా అధికారులు ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో మరో ప్రాణనష్టం సంభవించక ముందే పులిని పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రాకపోకలు.. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి కాగజ్‌నగర్ కారిడార్ మీదుగా రాకపోకలు సాగిస్తున్న పులి కవ్వాల్ అభయారణ్యంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. అందుకనుగుణంగా అటవీ అధికారులు భారీగా నిధులు ఖర్చు చేసినా పులి మాత్రం కవ్వాల్కు రావడం లేదు. మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న కాగజ్‌నగర్ డివిజన్‌లోనే నిత్యం సంచరిస్తుంది. మహారాష్ట్రలోని వీరూర్, దాబా రేంజ్ పరి«ధి నుంచి ఇటీవల పులి రాకపోకలు ఎక్కువయ్యాయి. సిర్పూర్(టి)– వీరూర్ అటవీప్రాంతాల గుండా పులి ఆనవాళ్లను అధికారులు ట్రేస్ చేశారు. చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
అత్తగారింటి ఎదుట అల్లుడి ఆత్మహత్యాయత్నం
కాగజ్‌నగర్‌రూరల్ : కట్నంగా ఇచ్చిన భూమిని పట్టా చేయనందుకు అల్లుడు ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంఘటన కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ కోయవాగు గ్రామంలో చోటు చేసుకుంది. కాగజ్‌నగర్‌రూరల్ ఇన్చార్జి ఎస్సై సిరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతగూడకు చెంది న చిట్యాల జలందర్ అదే గ్రామానికి చెందిన లక్ష్మి, పోచయ్యల కుమార్తెను ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో చింతగూడ గ్రామం శివారులోని 1.5ఎకరాల భూమిని వరకట్నంగా ఇచ్చారు. 8 సంవత్సరాలుగా అత్తమామలు అల్లుడికి కౌలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ భూమిని రూ.40వేలకు కుదువ పెట్టారు. విషయం తెలుసుకున్న అల్లుడు ఆ డబ్బులతో పాటు భూమిని తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో బాధితుడు తాగిన మైకంలో గురువారం రాత్రి అత్తమామ ఇంటిముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేందానికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తరలిం చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కాగజ్ నగర్ లో పిడుగుపాటు
కాగజ్ నగర్ (ఆదిలాబాద్) : పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిలా కాగజ్‌నగర్ మండలంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని వల్లకొండ పంచాయతీ పరిధిలోని సీతానగర్‌లో పిడుగుపడటంతో డి.మహేందర్‌కు చెందిన ఎద్దు మృతి చెందింది. సంఘటనా స్థలంలోనే వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న మహేందర్ భార్య కూడా పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం బాధితురాలు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.