చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి | Choutuppal Lingojigudem metla bavi renovated full details | Sakshi
Sakshi News home page

Lingojigudem: చారిత్రక దారి.. 300 ఏళ్ల మెట్లబావి

Published Tue, Feb 18 2025 7:34 PM | Last Updated on Tue, Feb 18 2025 8:15 PM

Choutuppal Lingojigudem metla bavi renovated full details

మరమ్మతుల తర్వాత అందంగా మారిన మెట్లబావి లోపలి భాగం

ఆ కాలంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం

చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో వెలుగులోకి..

తాగు, సాగు నీటికి వినియోగం.. స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాటు

విశ్రాంతితోపాటు దుస్తులు మార్చుకునేందుకు బావి మధ్యలో ప్రత్యేక గదులు 

మూడేళ్ల కిందట ఈ మెట్లబావిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం

స్పందించి మరమ్మతులకు ఆదేశించిన అప్పటి మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ 

ఆకర్షణీయంగా మారిన బావి పరిసరాలు

నాటి చారిత్రక కట్టడాలు నేటి తరానికి గొప్ప సంపద. గతాన్ని చూడని ఇప్పటి జనానికి అలనాటి నిర్మాణాలే సజీవ సాక్ష్యాలు. దశాబ్దాల కాలం నాటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఇప్పటికీ పటిష్టంగానే ఉండటం అప్పటి సాంకేతికతకు నిదర్శనం. యంత్రాలు, ఇతర నిర్మాణ పనిముట్ల గురించి తెలియని సమయంలో కేవలం మానవుల తెలివితో చేపట్టిన నిర్మాణాలు నేటి సాంకేతికత కంటే చాలా పటిష్టంగా ఉన్నా యి. అలాంటి వారసత్వ సంపద ఎక్కడ ఉన్నా గుర్తించి రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

రాజధానికి 52 కి.మీ. దూరంలో..
హైదరాబాద్‌కు (Hyderabad) సరిగ్గా 52 కి.మీ. దూరంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై విజయవాడ (Vijayawda) మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ (Choutuppal) మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం (Lingojigudem) గ్రామం ఉంది. ఈ గ్రామంలో జాతీయ రహదారి వెంట ప్రస్తుతం ఉన్న సాయిబాబా దేవాలయాన్ని గతంలో గోసాయిమఠంగా పిలిచేవారు. దశాబ్దాల కిందట ఈ మఠాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయం వెనుక భాగాన దిగుడుబావి (మెట్లబావి) ఉంది. ఆ దిగుడు బావిని 300 ఏళ్ల కిందట అప్పటి రాజులు నిర్మించారు. ఎంతో గొప్ప సాంకేతికతతో నిర్మించిన ఈ బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉండటంతో కొంత మేరకు నిర్మాణాలు దెబ్బతిన్నాయే తప్పిస్తే మిగతా కట్టడాలన్నీ యథావిధిగా ఉన్నాయి.  

రాజుల కాలంలో దిగుడుబావి నిర్మాణం
దిగుడుబావి (మెట్లబావి) గొప్ప చరిత్ర కలిగి ఉంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ విశ్రాంత మందిరాన్ని నిర్మించుకున్నారని, ఆ విశ్రాంత మందిరానికి అనుసంధానంగా అన్ని రకాల సౌకర్యాలతో ఈ దిగుడుబావిని నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. దిగుడుబావి పరిసరాల్లోని రాజు భూములు కాలక్రమేణా స్థానికులకు వచ్చాయి.  

పూర్తిగా రాళ్లతోనే..
ఈ దిగుడుబావిని పూర్తిగా రాళ్లతోనే నిర్మించారు. తూర్పున 6 అడుగుల వెడల్పు, దిగువకు 20 అడుగులు, ఉత్తరంలో 10 అడుగుల వెడల్పు ప్రకారం మొత్తంగా దిగువకు 60 అడుగుల మేర మెట్లు ఏర్పాటు చేశారు. మెట్ల మార్గాన్ని గ్రానైట్‌ రాళ్లతో అందంగా తీర్చిదిద్దారు. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతుతో ఈ బావిని నిర్మించారు. భూమి నుంచి 25 అడుగుల దిగువన బావిలో ప్రత్యేకంగా ఆర్చీల‌తో మూడు గదులు ఏర్పాటు చేశారు. బావిలో స్నానాలు చేశాక దుస్తులు మార్చుకునేందుకు ఈ గదులను నిర్మించారు. ఆ గదులు ప్రత్యేకంగా మహిళలు (నాటి రాణులు) వినియోగించేవిగా తెలుస్తోంది. పొలాలకు సాగునీరు, స్థానిక ప్రజానీకానికి తాగు నీరు అందించడంతో పాటు ప్రజలు స్నానాలు చేసేందుకు అనువుగా బావిని నిర్మించారు.  

గోసాయి మఠంగా ప్రత్యేక గుర్తింపు
చౌటుప్పల్‌ పట్టణ కేంద్రానికి తూర్పున 2 కిలో­మీటర్ల దూరంలో ఉన్న లింగోజిగూడెం గ్రామం ఒకప్పుడు గోసాయిమఠంగానే గుర్తింపు పొందింది. కొన్నేళ్ల కిందట గోసాయిదొర అనే వ్యక్తి హైదరాబాద్‌–విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారికి ఆనుకొని ప్రస్తుతం సాయిబాబా దేవాలయం ప్రాంతంలో మఠాన్ని ఏర్పాటు చేశాడు. పలు ప్రాంతాలకు ప్రయాణాలు చేసే బాటసారులు అలసిపోయిన సందర్భాల్లో విశ్రాంతి తీసుకోవడంతోపాటు అక్కడే విడిది చేసేందుకు అనువుగా అందులో వసతులు ఉండేవని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో ఆర్టీసీ బస్సులు కూడా గోసాయిమఠం స్టేజీ అంటేనే ఆగేవంటే ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయానికి ప్రస్తుతం రెండు ఎకరాలకుపైగా స్థలం అందుబాటులో ఉంది.

మెట్లబావి పరిరక్షణకు ముందుకొచ్చిన హెచ్‌ఎండీఏ
శతాబ్దాల కాలంనాటి మెట్లబావి గురించి సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. అందుకు సంబంధించి 2022, ఫిబ్రవరి 14న ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనానికి అప్పటి మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ స్పందించారు. వెంటనే మెట్లబావి విషయాన్ని తెలుసుకుని మరమ్మతులు చేయాలని హెచ్‌ఎండీఏ (HMDA) అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలా ఈ మెట్లబావిని సుందరీకరించారు. అనంతరం ఏప్రిల్‌ 14న దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ మెట్లబావి బాధ్యతలు హెచ్‌ఎండీఏ చూసుకుంటోంది. అయితే ఆ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చ‌ద‌వండి: రాజాబావి.. రాజ‌సం ఏదీ?

కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తాం  
పురాతన మెట్లబావి అభివృద్ధి అంశాన్ని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్తాం. పర్యాటక ప్రాంతంగా మారితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పురాతన కట్టడాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మూడొందల ఏళ్ల కిందట నిర్మించిన మెట్లబావి మా గ్రామంలో ఉండటం మాకెంతో గర్వకారణం. ప్రభుత్వం, మున్సిపల్‌ శాఖ నిరంతరం పర్యవేక్షించాలి.  
– రమనగోని శంకర్, మాజీ సర్పంచ్, లింగోజిగూడెం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement