ఆధ్యాత్మిక పల్లె.. కొలనుపాక | Kolanupaka is known as the Kashi of South India | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక పల్లె.. కొలనుపాక

Published Mon, Dec 30 2024 3:59 AM | Last Updated on Mon, Dec 30 2024 3:59 AM

Kolanupaka is known as the Kashi of South India

జైనుల ఆధ్యాత్మిక కేంద్రం.. సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం 

దక్షిణ కాశీగా వీరశైవ మఠాల ఆధ్యాత్మిక నగరిగా గుర్తింపు 

రాష్ట్రకూట, చాళుక్య, కందూరు చోళ, కాకతీయుల పాలనా కేంద్రం 

శైవ, బౌద్ధ, జైన, వైష్ణవాల ఘర్షణలో అస్థిత్వాన్ని కోల్పోయిన తీరు 

నేడు అచ్చమైన పల్లెటూరుగా మారిన వైనం 

యాదగిరిగుట్ట: స్వయంభూ సోమేశ్వరుడు కొలువైన క్షేత్రం. వీరశైవ పంచాచార్యులలో ఒకరైన రేవణ సిద్ధేశ్వరుని జన్మభూమి. శ్వేతాంబర జైనుల ఆధ్యాత్మిక కేంద్రం. దైవారాధనకు అందరూ అర్హులేనని చాటిన సమతా సందేశం. వీరశైవాన్ని దశదిశలా వ్యాప్తి చేసిన దక్షిణ కాశీ. అష్టాదశ కులాల వీరశైవ మఠాల ఆధ్యాత్మిక నగరి. రాష్ట్రకూట, చాళుక్య, కందూరు చోళ, కాకతీయుల పాలనా కేంద్రం. 

గత వైభవ ఘనకీర్తి పతాక.. కొలనుపాక. ఇది శతాబ్దాల కిందట ఓ సుందర నగరం. ఇప్పుడు అచ్చమైన పల్లెటూరు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు పట్టణానికి 6 కి.మీ. దూరంలో ఉంది. వెయ్యేళ్లకు పూర్వమే ఓ వెలుగు వెలిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగస్థలి. 

జైన వైభవానికి, వీరశైవ విజృంభణకు నిలువెత్తు సాక్ష్యం. కానీ శైవ, బౌద్ధ, జైన, వైష్ణవాల ఘర్షణలో తన అస్థిత్వాన్ని కోల్పోయింది. నాటి కులమఠాల ఆనవాళ్లు కొలనుపాక సామాజిక జీవితాన్ని మనకు కథలుగా చెబుతాయి. 

పంచముఖాలు.. ఐదు పీఠాలు 
రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కందూరు చోళుల ఉప రాజధానిగా తెలుగు నేలపై అర్ధభాగాన్ని శాసించినా కొలనుపాక ఏనాడూ చరిత్ర కెక్కలేదని పలువురు అంటున్నారు. విధ్వంసకారులు చారిత్రక కట్టడాలను ధ్వంసం చేసినట్లే.. చరిత్రకారుల నిర్లక్ష్యం సాంస్కృతిక వికాసానికి గొడ్డలి పెట్టుగా పరిణమించింది. 

వీరశైవ మత వ్యాప్తి కోసం శివుని పంచముఖాల నుంచి రేవణసిద్ధ (బాళెహొణ్నూరు పీఠం), మరులసిద్ధ (ఉజ్జయిని పీఠం), ఏకోరామ (కేదారనాథ్‌ పీఠం), మల్లికార్జున పండితారాధ్య (శ్రీశైల పీఠం), విశ్వారాధ్య (కాశీ పీఠం) ఉద్భవించినట్టు శైవాగమాలు పేర్కొంటున్నాయి. స్వయంభువులుగా భావించే ఈ శివాచార్యులను ‘వీరశైవ పంచాచార్యులు’గా కీర్తిస్తారు. 

పంచాచార్యులలో ప్రథముడైన రేవణసిద్ధ (రేణుకాచార్యులు) కొలనుపాకలో స్వయంభూ సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించినట్టు స్వయంభువాగమం చెబుతోంది. శైవాగమాలలోని వీరాగమ, సుప్రభేదాగమాలు రేణుకాచార్యులను ప్రస్తావించాయి. 

శైవం.. జైనం బహుళ ఆదరణ 
కొలనుపాకలో శైవం, జైనం బహుళ ఆదరణ పొందాయి. వేల సంవత్సరాలు ఈ రెండు మతాలు సహజీవనం చేశాయి. కొలనుపాకలో క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి సోమనాథ ఆలయం అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఇక్కడ జైనం ఎక్కువ. కొలనుపాకలో వెయ్యేళ్లకు పూర్వమే శ్వేతాంబర శాఖకు చెందిన ఆలయాన్ని నిర్మించారు. జైన ప్రాబల్యం ఉన్నా.. సోమేశ్వరుడు నిర్విఘ్నంగా పూజలందుకున్నాడు. 

చాళుక్యుల తర్వాత కాకతీయులు అధికారంలోకి వచ్చారు. కాకతీయులు తొలినాళ్లలో జైనాన్ని ఆదరించారు. చివరి కాకతీయులు మాత్రం శైవాన్ని ప్రోత్సహించారు. కొలనుపాకలో అప్పటికే వైష్ణవం కూడా ఉంది. పారమార జగద్దేవుడు నిర్మించిన వీరనారాయణ ఆలయం సుప్రసిద్ధం. తర్వాత వచ్చిన పాలకులు ఈ ఆలయాన్ని పట్టించుకోలేదు. కన్నడ దేశపు కాలచూరిని ఏలుతున్న బిజ్జలుని మంత్రి బసవన్న వీరశైవ వ్యాప్తికి కృషి చేశాడు. రేణుకాచార్యులు కొలనుపాకలో వీరశైవాన్ని అభివృద్ధి చేశాడు. 

వీరశైవం తెలుగు నేలపై రాజాదరణ పొందింది. కాకతీయల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి చేరింది. శైవాలయాలు, శైవపీఠాలు, శైవమఠాల నిర్మాణాలకు కాకతీయులు సహకరించారు. కొలనుపాకలోని కోటిలింగాల గుడి, ప్రతాపరుద్ర ఆలయం కాకతీయులు కట్టినవే.  

వీరశైవ విజృంభణ 
కాకతీయ గణపతి దేవుడి కాలానికి తెలుగు నేలపై శైవం ఆధిపత్యంలోకి వచి్చంది. రాణీరుద్రమదేవి పా­లనా కాలానికి వీరశైవం విజృంభించింది. శివుడు త­ప్ప ఎవరూ ఉండకూడదనే వాదన మొదలైంది. 11వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో శైవ, జైన మతాలు ఘర్షణ పడ్డాయి. కొలనుపాకలోని జైన ఆలయాల­ను, బసదులను వీరశైవులు ధ్వంసం చేశారు. జైన, వైష్ణవాలయాలను శివాలయాలుగా మార్చారు. 

కొ­న్ని ఆలయాల పేర్లు శాసనాలకే పరిమితం అయ్యా­యి. వీరశైవం ప్రబలిన తర్వాత ఆరాధ్య శైవం, వైష్ణ­వం వెనుకబడిపోయాయి. కాకతీయుల నిరాదరణ, వీరశైవుల విజృంభణతో కొలనుపాకలో జైనం క్షీణదశకు చేరుకుంది. రేవణ సిద్ధేశ్వరుల ప్రభావంతో కొలనుపాకలో అన్ని కులాల వారు వీరశైవంలో చేరారు. 

ప్రతి కులం ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంది. అష్టాదశ కులాల వారికి కొలనుపాకలో మఠాలున్నాయి. ప్రస్తుతం ఆ కుల మఠాల సంఖ్య 18 కంటే ఎక్కువే.  

శివుడొక్కడే.. 
కొలనుపాకలోని మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. వీటన్నింటిలో శివలింగం, నంది విగ్రహం మాత్రమే ఉంటాయి. మరో విగ్రహానికి కానీ, ఇంకో దేవుడికి కానీ ఇక్కడ స్థానం లేదు. ఈ మఠాల నిర్వహణ, పూజా విధానాల్లో ఎంతో సారూప్యం కనిపిస్తుంది. ప్రతి కుల మఠానికి ఒక గురువు, కులపెద్ద బాధ్యులుగా ఉంటాడు. 

మఠ గురువు, మఠ పెద్ద, సభ్యులైన వీరశైవులు ఇష్టలింగాన్ని ధరిస్తారు. నిత్యం మఠంలోని శివలింగాన్ని కడిగి, పత్రి, పుష్పాలతో పూజ చేసి, నైవేద్యం పెడతారు. ఆ తర్వాతే భోజనం చేస్తారు. మఠాలన్నిటికీ జంగమ దేవరలే గురువులు. ‘గురువు’అంటే విద్యా బోధన చేసేవాడని అర్థం. మత బోధన మఠం ప్రధాన బాధ్యత. 

వీరశైవం వైపుగా ఆకర్షితులైన నిమ్న కులాల వారికి వీరశైవ తత్తా్వన్ని, మోక్ష మార్గాన్ని బోధించేందుకు ఆ కులానికే చెందినవారికి ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. కొలనుపాకలోని కులమఠాలన్నీ రంభాపురి పీఠాన్ని అనుసరిస్తాయి. కుల మఠాలకు ఉన్నట్లుగా పెద్ద మఠానికి ప్రత్యేకమైన కట్టడం ఏమీ లేదు. పెద్ద మఠం గురువుని కులమఠాలన్నీ అనుసరిస్తాయి. 

కులానికో పురాణం.. 
కొలనుపాకలోని అన్ని కులాలకూ ప్రత్యేకమైన పురాణాలున్నాయి. మఠ గురువుల దగ్గర ఆ ప్రాచీన ప్రతు­లు ఉంటాయి. వీటిని పండుగ రోజుల్లో మా­త్రమే పఠిస్తారు. తమ కులం ఎలా పుట్టింది? ఎలా అభివృద్ధి చెందింది? తమదైన కుల పురాణాల్లో ప్ర­స్తా­వించారు. ఎవరికి వారు తమ కులం గొప్పదనే భా­వనతో ఈ గ్రంథాన్ని రాసుకున్నారు. మిగతా కు­లాలకు తమ కులమే మూలమనే ప్రతిపాదనా ఉంది. ఇలా ఎవరి కుల సాహిత్యం వారిదే. కాలక్రమంలో కొన్ని కుల చరిత్రలు అంతరించిపోయాయి. 

మఠానికో శివుడు 
అందరికీ శివుడే ఆరాధ్య దైవం. ఆ దేవుడిని కూడా తమ కులంవాడిని చేసుకోవడం మఠాల ప్రత్యేకత. కులమఠాల వాళ్లు ఎవరికి వారు.. తమ కులానికి అనుగుణంగా శివుడికి నామకరణం చేశారు. సురాభాండాన్ని తీసే గౌడవారు శివుడిని ‘సురాభాండేశ్వరుడు’అని పిలుచుకున్నారు. కోమట్లు ‘నగరేశ్వర స్వామి’అని కొలుస్తున్నారు. మేదర మఠంలోని శివుడిని ‘కేతేశ్వర స్వామి’గా వ్యవహరిస్తారు. అదే ఆదిదేవుడు మేరు మఠంలో ‘శంకర దాసమయ్య’అయ్యాడు. 

7 వేల గ్రామాలకు రాజధాని  
కొలనుపాక ఒకప్పుడు 7 వేల గ్రామాలకు రాజధాని. ఆ గ్రామ ప్రజలకు వీరశైవ తత్తా్వన్ని బోధించి, మోక్షమార్గాన్ని అనుసరించేలా చేయడం కుల గురువుల బాధ్యత. ఆచార్యుల బతుకుదెరువు, కులమఠంలోని సన్యాసుల పోషణ, శివ పూజల నిర్వహణ కోసం 7 వేల గ్రామాలవారు ధనం, ధాన్యం ఇచ్చేవా­రు. కాబట్టే, కులమఠాల్లో ధూపదీప నైవేద్యాల­కు లోటు రాలేదు. 

శివారాధన, వీరశైవ బోధన నిరా­టంకంగా కొనసాగింది. కాకతీయుల పతనం తర్వా­త ఓ వర్గం అధికారంలోకి వచ్చారు. దీంతో వీరశైవులకు కష్టాలొచ్చాయి. కొలనుపాక కుల మఠాలకు ఇచ్చే దానాలపై ఓ వర్గం పన్ను విధించినట్టు తమ తాతలు చెప్పేవారని పలువురు చెబుతున్నారు. 

దక్షిణ కాశీ 
కొలనుపాక దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కొలనుపాక సమీపంలో ‘కాశీ బుగ్గ’అనే నడబావి ఉంది. దానికి పక్కనే చిన్న శివాలయం కూడా ఉంది. శివ భక్తులు కాశీ బుగ్గలోని నీటిని అపర గంగగా భావిస్తారు. ఈ గుడిలోని శివుడిని అపర (కాశీ) విశ్వేశ్వరుడిగా కొలుస్తారు. కాశీ బుగ్గను దర్శించుకుంటే వారణాసిని దర్శించుకున్నట్లేనని శైవుల భావన. 

ఒకప్పుడు కుల మఠాల్లో జరిగే శివపార్వతుల కల్యాణ వేడుకను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన శివభక్తులు తమతమ కుల మఠాల్లో జాగారం చేసేవారు. తమ కుటుంబీకులు చనిపోతే దశదిన కర్మ తర్వాత కొలనుపాకకు వచ్చి కులమఠంలో నిద్ర చేసేవారు. తెల్లవారు కాశీ బుగ్గలో అస్థికలు కలిపిపోయేవారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement