South Kashi
-
నిత్య పూజలు అందుకుంటున్న కేతకీ పార్వతీ పరమేశ్వరులు
సంగారెడ్డి: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అంకురార్పణ, ధ్వజారోహణం, శిఖర పూజా కార్యక్రమాలతో జాతర ప్రారంభమైంది. గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వరులకు నిత్య పూజలతో పాటు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శశిధర్, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు రుద్రప్ప పాటిల్, నాయకులు సంతోష్ కుమార్ పాటిల్, రుద్రయ్య స్వామి, గాలప్ప పాటిల్, నరేందర్ రెడ్డి, దత్తు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఆకాశం నుంచి పడిన మంత్రపు పెట్టె.. రూ.50కోట్లంటూ.. -
పితృదేవతల ముక్తిక్షేత్రం
పాదగయ గయాసురుని పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాద గయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు. పిఠాపురం అసలు పేరు పీఠికాపురం. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది పదవ పీఠం. దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన చక్రంతో ఛిన్నాభిన్నం చేయగా ఆమె పిరుదులు (పీఠం) పడిన ప్రాంతం కనుక దీనిని పీఠికాపురం అన్నారు. కాలక్రమంలో ఇదే పిఠాపురంగా స్థిరపడింది. దీనికే దక్షిణ కాశీ అని, పాద గయ అని పేర్లు ఉన్నాయి. శ్రీ కుక్కుటేశ్వరస్వామి, శ్రీ దత్తాత్రేయస్వామి, అష్టాదశపీఠాలలో ఒకటైన శ్రీ పురుహూతిక అమ్మవారి పీఠం ఇక్కడే ఉన్నాయి కనుక పిఠాపురం తెలుగువారికి అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటున్నది. దక్షిణ కాశీకి వెళుతూ వ్యాసుడు ఈ క్షేత్రాన్ని దర్శించాడని కథనం. శ్రీనాథుడు తన పర్యటనల్లో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శించి సేవించాడని చారిత్రక ఆధారాలున్నాయి. పితృదేవతల ముక్తికి భాద్రపదమాసంలో ఈ క్షేత్రంలో పిండప్రదానాలు జరగడం కద్దు. చతుర్భుజ పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో ఉంటుంది. ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా అమ్మవారి మూర్తి చతుర్భుజగా అత్యద్భుత సౌందర్యరాశిగా... దర్శించిన వెంటనే భక్తిభావం ఉప్పొంగేలా ఉంటుంది. ఈమెకు పురుహూతిక అని పేరు. దానికి ఓ కథ ఉంది. పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేసి శాపకారణాన సహస్రాక్షుడవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవడానికి జగజ్జనని అయిన ఈ అమ్మవారి కోసం తపస్సు చేసి శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు (ఇంద్రుడు) ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయ్యింది. పాద గయ పిఠాపురంకు ‘పాద గయ’గా పేరు రావడానికి ఒక కథ ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షసుడు మహా విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండే వరం పొందాడు. దాని వల్ల మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై నేరుగా స్వర్గానికి రావడం మొదలుపెట్టారు. మరోవైపు గయాసురుడు భాగవోత్తముడు కనుక ఇంద్రపదవి అతనికి దక్కింది. దీనిని భరించలేని ఇంద్రుడు త్రిమూర్తులను వేడుకొనగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుణ్ణి చేరి ‘అయ్యా... తమది పుణ్యశరీరం. తమ దేహం మీద లోక కళ్యాణార్థం ఏడురోజుల పాటు యజ్ఞం చేయదలిచాము’ అన్నారు. అందుకు గయాసురుడు అంగీకరించాడు. అప్పుడు త్రిమూర్తులు ‘గయాసురా... ఏడు రోజుల లోపు నువ్వు కదిలినా లేచినా యజ్ఞసమాప్తి కొరకు అంటే యజ్ఞం అసంపూర్తిగా ముగించలేము కనుక నిన్ను సంహరిస్తాము’ అని అన్నారు. గయాసురుడు అందుకు అంగీకరించి తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. అతడి తల గయ (బిహార్), నాభి- నాభి గయ (ఒరిస్సా జాజ్‌పూర్), పాదాలు- పాదగయ (పిఠాపురం)లో ఉండేంతగా పెంచాడు. త్రిమూర్తులు ఆ శరీరం మీద యజ్ఞం ప్రారంభిస్తారు. ఆరురోజులు గడిచి ఏడవరోజు పూర్తి కావలసి ఉంటుంది. అప్పుడు శివుడు తెల్లవారక ముందే కోడి రూపం (కుక్కుటము) ధరించి కూస్తాడు. దాంతో ఏడోరోజు పూర్తయ్యిందని భావించి గయాసురుడు కదులుతాడు. అదే కారణాన సంహరింపబడతాడు. అతడి పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాద గయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు. ఆ కోరిక ఆమోదించబడింది కనుకనే మూడు గయలలో పిండప్రదానాలకు విశేష ఫలప్రదం కలిగింది. పాదగయలో గయాసురుని పాదాల చెంత పిండం వదిలితే అది నేరుగా పితృదేవతలకు చేరుతుందని నమ్మకం. గోదావరి పుష్కర కాలంలో ఒరిస్సా నుంచి ఓడ్రులు కనీసం ఇంటికి ఒకరైనా వచ్చి రాజమండ్రి గోదావరిలో స్నానం చేసి పిఠాపురంలోగల ఈ పాదగయలో పిండ ప్రదానం చేయటం తరాలుగా వస్తున్నది. కుక్కుటేశ్వరుడు గయాసుర సంహారం కోసం కుక్కుట రూపం ధరించిన శివుడు కుక్కుటేశ్వరుడుగా ఇక్కడ వెలిశాడు. శ్రీ స్వామి వారి దేవేరి శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్నది. ఈమెకు ఒకపక్క మయూర వాహనుడైన కుమారస్వామి, మరొకపక్క చతుర్భుజుడైన గణపతి మూర్తి వెలసి ఉండటం విశేషం. ఆ పుష్కరిణి పేరు ఏలా నది పిఠాపురం క్షేత్రంలో ఉన్న పుష్కరిణి విశేషమైనది. దీనిని ‘ఏలానది’ అని కూడా పిలుస్తారు. పూర్వం ఏలామహర్షి అప్సరసల మోహంలో పడి తపస్సు భగ్నం చేసుకుంటాడు. ప్రాయశ్చిత్తం కోసం ఈశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయనను మెప్పించి శివుని జటాజూటంలోని గంగ లో స్నానం చేసి తన పాపాన్ని తొలగించుకున్నాడు. ఈ సందర్భంగా తన పేరు మీద ఒక నది ప్రవహించే విధంగా వరమియ్యాలని శివునికోరి ఒక నదీపాయను తన వెంట తీసుకొని సాగ రంలో కలిపేందుకు బయలుదేరగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడికూత వినబడడంతో అక్కడ ఆగిపోయాడు. దీంతో ఆయన వెంట వచ్చిన నదీపాయ కూడా ఆగిపోయింది. అదే పాదగయ పుష్కరిణిగా ప్రసిద్ధి చెందిందని అంటారు. పంచమాధవ క్షేత్రం దేవేంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుణ్ణి సంహరించాక బ్రహ్మ హత్యాపాతకం నుంచి తప్పించుకోవడానికి ఐదు మాధవ క్షేత్రాలను స్థాపించాడు. ఆ ఐదు: ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో బిందుమాధవ క్షేత్రం, అలహాబాద్‌లోని ప్రయాగలో వేణుమాధవ క్షేత్రం, తమిళనాడులోని రామేశ్వరంలో సేతు మాధవక్షేత్రం, కేరళలోని తిరువనంతపురంలలో సుందరమాధవ క్షేత్రం, పిఠాపురంలో కుంతీమాధవ క్షేత్రం. వనవాస సమయంలో కుంతీదేవి పాండవుల క్షేమం కోసం మహావిష్ణువును ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి అనుగ్రహించడం వల్ల ఈస్వామికి కుంతీమాధవ స్వామిగా పేరొచ్చినట్లు కథనం. అలాగే కుంత అనే ఆయుధం కలిగి ఉండడం వల్ల కూడా కుంతీమాధవస్వామిగా పేరొందినట్లు చెబుతుంటారు. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్తాత్రేయుడి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు. ఆయన శక్తిపీఠాన్ని పూజించారు. ఆయన జన్మించిన గృహమే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం. శ్రీపాదవల్లభ జయంతి, దత్తాత్రేయ జయంతి తదితర ఉత్సవాల సమయంలో వేలాది సంఖ్యలో భక్తులు మహారాష్ర్ట, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. - వీవీవీ ప్రసాద్, సాక్షి, పిఠాపురం రవాణా సౌకర్యాలు పిఠాపురం తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నది. ఇక్కడకు అన్ని ప్రాంతాలనుంచి బస్సు, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి రైలు సౌకర్యం ఉంది. రైళ్లలో వచ్చే యాత్రికులు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోట రైల్వేజంక్షన్లో దిగి వాహనాలపై ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయం ఇక్కడకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి విమానాశ్రయం ఇక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. వసతి సౌకర్యాలు ఆలయం సమీపంలో వసతి గృహసముదాయాలు ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. వసతి సౌకర్యం కావాల్సిన వారు ఇతర వివరాలకు ఆలయం ఫోన్ నంబరు 08869-252477 ను సంప్రదించవచ్చు. -
అమృతం ఒలికిన చోటు...
పుష్పగిరి చారిత్రక స్థలి. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి.. విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన క్షేత్రం. శివ కేశవుల మధ్య అభేదానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రంలో శివుడు క్షేత్ర అధిపతిగా, విష్ణువు క్షేత్ర పాలకుడుగా కొలువుదీరి ఉండటం విశేషం. పుష్పగిరిలో ఒక్క రోజైనా ఉపవాసం వుండి దైవ దర్శనం చేసుకుంటే ఇహంలోనూ-పరంలోనూ సౌఖ్యం లభిస్తుందని, సూర్య గ్రహణ సమయంలో, అక్షయ తృతీయ రోజున(వైశాఖ శుద్ధ తదియ) సంకల్ప పూర్వకంగా పినాకినీలో స్నానం చేసి.. శివ కేశవులను దర్శిస్తే వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలం లభిస్తుందని పురాణోక్తి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచింది. కాశీ, గయ, ప్రయాగల సంగమం... పుష్పగిరి గ్రామానికి- కొండకు మధ్య ప్రవహిస్తున్న పవిత్ర పెన్నా నది కాశీలోని గంగా నది లాగా దక్షిణ దిశగా ప్రవహిస్తూ తూర్పు దిశగా అర్ధచంద్రాకారంలో సాగిపోతోంది. దీంతో ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ఖ్యాతి గడించింది. కాశీలో అద్వైత మత అవలంబ కులు, గయలో విశిష్టాద్వైత మత అవలంబకులు పిండ ప్రదానం చేయడం పరిపాటి. కానీ ఆ రెండు మతాల అవలంబకులు పుష్పగిరిలో పిండ ప్రదానం నిర్వహించడం విశేషం. పుష్పగిరిలో వెలసిన చెన్నకేశవాలయం మొదలు పుష్పేశ్వరుని ఆలయం వరకు ఉన్న పుణ్యస్థలికి గయ క్షేత్రమని పేరు. కాశీలో శివుడు, గయ-ప్రయాగలలో హరి క్షేత్ర పాలకులుగా అవతరించగా పుష్పగిరిలో హరి హరులిరువురూ కొలువు దీరి వుండడం ఇక్కడి విశేషం. ఇన్ని విశిష్టతలతో భాసిల్లుతున్న కారణంగా ఈ క్షేత్రం కాశీ, గయ, ప్రయాగల సంగమంగా ప్రఖ్యాతి గాంచింది. పంచ నదీ సంగమం పినాకినీ నది(పెన్నా), పాపాఘ్ని (గండేరు), కుముద్వతి (కుందు), వల్కల (వక్కిలేరు), మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పుష్పగిరి పంచ నదీ సంగమంగా వాసి కెక్కింది. దీంతో ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలూ హరించుకుపోతాయని భక్తులు విశ్వసిస్తారు. పురాణ ప్రాశస్త్యం వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లోని బ్రహ్మాండ పురాణం, వాయు పురాణాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది. స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. శ్రీ శైల మహా సంకల్పంలో ‘...ఏలేశ్వర, స్కంద సోమేశ్వర, ప్రసూనాచల సంగమేశ్వరాద్యుపద్వార శోభితే..’ అని చెప్పడాన్ని బట్టి పుష్పగిరి క్షేత్రమే శ్రీశైల నైరుతీ ద్వారమని తెలుస్తోంది. అంతేకాక ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది. పుష్పమే పుష్పగిరి కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత భార్యలు. శాప కారణంగా కద్రువకు వినత దాస్యం చేయాల్సి వచ్చింది. తల్లి పడుతున్న బాధలను చూసిన గరుత్మంతుడు ఆమె దాస్య విముక్తికి అమృతాన్ని తీసుకురావడానికి దేవ లోకానికి వెళతాడు. అమృత కలశాన్ని తీసుకొస్తుండగా ఇంద్రుడు వెంబడించి, వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అది గరుడుణ్ణి ఏమీ చేయలేకపోతుంది. వజ్రాయుధానికి తలవంపులు కలుగకుండా చూడాలని గరుత్మంతుణ్ణి ఇంద్రుడు కోరతాడు. ఇంద్రుని మాటలను మన్నించిన గరుడుడు తన తోకలోని ఒక ఈకను వదులుకోవడానికి ఒప్పుకుంటాడు. వజ్రాయుధం ఈకను లాగే సమయంలో కలశం తొణికి ఒక అమృత బిందువు భూలోకంలోని కాంపల్లె వద్ద వున్న సరస్సులో పడింది. ఒక రోజు ఒక వృద్ధ రైతు తన ముదుసలి దున్నలను కడగడానికి సరస్సులోకి దించగా అవి లేగ దున్నలుగా మారాయి. ఆశ్చర్యానికి లోనైన వృద్ధుడు తానూ సరస్సులోకి దిగగా కుర్రవానిగా మారాడు. వృద్ధుని భార్య సైతం సరస్సులో దిగగా యౌవనవతిగా మారింది. ఇది తెలుసుకున్న చుట్టుప్రక్కల వారందరూ సరస్సులో దిగి యౌవనవంతులుగా మారి, చావులే లేకుండా వుండసాగారు. విషయం తెలుసుకున్న త్రిమూర్తులు ఆజ్ఞాపించడంతో వాయు దేవుడు కొండ రాళ్లను తెచ్చి వేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. చివరకు హనుమంతుడు లక్ష్మీ దేవిని పూజించి పెద్ద కొండను తెచ్చి సరస్సులో వేశాడు. అమృత ప్రభావంతో ఆ కొండ నీటిలో పుష్పంలా తేలింది. దీంతో త్రిమూర్తులు తమ పాదాలతో దాన్ని అణగదొక్కారు. దానికి ఆనవాలుగా నేటికీ కొండపై పడమర భాగంలో రుద్ర పాదం, తూర్పున విష్ణు పాదం, ఉత్తరాన బ్రహ్మ పాదాలు వున్నాయి. నీటిపై పుష్పం వలె తేలియాడింది కావున నాటి నుండి కాంపల్లె గ్రామం ‘పుష్పగిరి’గా పేరుగాంచిందని ప్రచారంలో వుంది. అద్వైత పీఠం జగద్గురువు శ్రీఆది శంకరాచార్య స్వామి చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరి పీఠం ప్రఖ్యాతి గాంచింది. ఈ పీఠంలోని మహిమాన్విత స్ఫటిక లింగం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి. అన్ని అద్వైత పీఠాల్లోని స్ఫటిక లింగాల కంటే పెద్దదైన ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు జరుగుతాయి. విశిష్టమైన శ్రీ చక్రం వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వున్న శ్రీకామాక్షీదేవి ఆలయంలో అమ్మవారి ఎదుట ఎంతో విశిష్టమైన శ్రీచక్ర మేరువు వుంది. ఇచ్చటి అమ్మవారి ఎదుట బిందు, త్రికోణ, వసు కోణాలతో దాదాపు 27 అంగుళాల ఎత్తు వున్న మహామేరువు శ్రీచక్రం విజయనగర రాజ్య స్థాపక హరిహర, బుక్క రాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్ఠితం. పుష్పగిరి కొండపైన శ్రీ చెన్న కేశవ స్వామి, లక్ష్మీ దేవి, ఆంజనేయ స్వామి, సంతాన మల్లేశ్వర, సాక్షి మల్లేశ్వర, రుద్రపాదం, దుర్గ, ఇంద్ర నాథేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. - మోపూరి బాలకృష్ణారెడ్డి (సాక్షి ప్రతినిధి, కడప), - పుత్తా నవనీశ్వరరెడ్డి (రిపోర్టర్, వల్లూరు) చేరుకోవడం ఇలా! * వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది. * హైదరాబాదు, విజయవాడ పట్టణాల నుండి ప్రస్తుతం కడప విమానాశ్రయానికి విమాన సర్వీసులు అందుబాటులో వున్నాయి. * విమానాశ్రయం నుండి కేవలం 14 కి.మీ దూరంలో ఉంది పుష్పగిరి. * కడప-వల్లూరు మార్గంలో పుష్పగిరి వుంది. * కడప రైల్వే స్టేషన్ నుండి దాదాపు 18 కి. మీ దూరం వుంటుంది.