అమృతం ఒలికిన చోటు... | South Kashi as Puspagiri temple | Sakshi
Sakshi News home page

అమృతం ఒలికిన చోటు...

Published Wed, May 4 2016 9:25 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

అమృతం ఒలికిన చోటు...

అమృతం ఒలికిన చోటు...

పుష్పగిరి చారిత్రక స్థలి. శివ స్వరూపుడైన వైద్యనాథేశ్వరునికి.. విష్ణు స్వరూపుడైన చెన్న కేశవునికి నిలయమైన క్షేత్రం. శివ కేశవుల మధ్య అభేదానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ క్షేత్రంలో శివుడు క్షేత్ర అధిపతిగా, విష్ణువు క్షేత్ర పాలకుడుగా కొలువుదీరి ఉండటం విశేషం.
 పుష్పగిరిలో ఒక్క రోజైనా ఉపవాసం వుండి దైవ దర్శనం చేసుకుంటే ఇహంలోనూ-పరంలోనూ సౌఖ్యం లభిస్తుందని, సూర్య గ్రహణ సమయంలో, అక్షయ తృతీయ రోజున(వైశాఖ శుద్ధ తదియ) సంకల్ప పూర్వకంగా పినాకినీలో స్నానం చేసి..

శివ కేశవులను దర్శిస్తే వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలం లభిస్తుందని పురాణోక్తి. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లా వల్లూరు మండలంలో వెలసిన పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరి దక్షిణ కాశీగా ప్రఖ్యాతి గాంచింది.

 
కాశీ, గయ, ప్రయాగల సంగమం...
పుష్పగిరి గ్రామానికి- కొండకు మధ్య ప్రవహిస్తున్న పవిత్ర పెన్నా నది కాశీలోని గంగా నది లాగా దక్షిణ దిశగా ప్రవహిస్తూ తూర్పు దిశగా అర్ధచంద్రాకారంలో సాగిపోతోంది. దీంతో ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ఖ్యాతి గడించింది. కాశీలో అద్వైత మత అవలంబ కులు, గయలో విశిష్టాద్వైత మత అవలంబకులు పిండ ప్రదానం చేయడం పరిపాటి. కానీ ఆ రెండు మతాల అవలంబకులు పుష్పగిరిలో పిండ ప్రదానం నిర్వహించడం విశేషం.

పుష్పగిరిలో వెలసిన చెన్నకేశవాలయం మొదలు పుష్పేశ్వరుని ఆలయం వరకు ఉన్న పుణ్యస్థలికి గయ క్షేత్రమని పేరు. కాశీలో శివుడు, గయ-ప్రయాగలలో హరి క్షేత్ర పాలకులుగా అవతరించగా పుష్పగిరిలో హరి హరులిరువురూ కొలువు దీరి వుండడం ఇక్కడి విశేషం. ఇన్ని విశిష్టతలతో భాసిల్లుతున్న కారణంగా ఈ క్షేత్రం కాశీ, గయ, ప్రయాగల సంగమంగా ప్రఖ్యాతి గాంచింది.
 
పంచ నదీ సంగమం
పినాకినీ నది(పెన్నా), పాపాఘ్ని (గండేరు), కుముద్వతి (కుందు), వల్కల (వక్కిలేరు), మాండవి నదుల సంగమమై ప్రవహిస్తూ పుష్పగిరి పంచ నదీ సంగమంగా వాసి కెక్కింది. దీంతో ఇక్కడ స్నానాలాచరిస్తే సకల పాపాలూ హరించుకుపోతాయని భక్తులు విశ్వసిస్తారు.  
 
పురాణ ప్రాశస్త్యం
వ్యాస మహర్షి రచించిన 18 పురాణాల్లోని బ్రహ్మాండ పురాణం, వాయు పురాణాల్లో ఈ క్షేత్రం గురించి చెప్పబడింది. స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండం పుష్పగిరిని విశేషంగా పేర్కొంది. శ్రీ శైల మహా సంకల్పంలో ‘...ఏలేశ్వర, స్కంద సోమేశ్వర, ప్రసూనాచల సంగమేశ్వరాద్యుపద్వార శోభితే..’  అని చెప్పడాన్ని బట్టి  పుష్పగిరి క్షేత్రమే శ్రీశైల నైరుతీ ద్వారమని తెలుస్తోంది. అంతేకాక ఇందులో పుష్పగిరి క్షేత్రంగానే కాక తీర్థంగా కూడా కొనియాడబడింది.
 
పుష్పమే పుష్పగిరి
కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత భార్యలు. శాప కారణంగా కద్రువకు  వినత దాస్యం చేయాల్సి వచ్చింది. తల్లి పడుతున్న బాధలను చూసిన గరుత్మంతుడు ఆమె దాస్య విముక్తికి అమృతాన్ని తీసుకురావడానికి దేవ లోకానికి వెళతాడు. అమృత కలశాన్ని తీసుకొస్తుండగా ఇంద్రుడు వెంబడించి, వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అది గరుడుణ్ణి ఏమీ చేయలేకపోతుంది. వజ్రాయుధానికి తలవంపులు కలుగకుండా చూడాలని గరుత్మంతుణ్ణి ఇంద్రుడు కోరతాడు. ఇంద్రుని మాటలను మన్నించిన గరుడుడు తన తోకలోని ఒక ఈకను వదులుకోవడానికి ఒప్పుకుంటాడు.

వజ్రాయుధం ఈకను లాగే సమయంలో కలశం తొణికి ఒక అమృత బిందువు భూలోకంలోని కాంపల్లె వద్ద వున్న సరస్సులో పడింది. ఒక రోజు ఒక వృద్ధ రైతు తన ముదుసలి దున్నలను కడగడానికి సరస్సులోకి దించగా అవి లేగ దున్నలుగా మారాయి. ఆశ్చర్యానికి లోనైన వృద్ధుడు తానూ సరస్సులోకి దిగగా కుర్రవానిగా మారాడు. వృద్ధుని భార్య సైతం సరస్సులో దిగగా యౌవనవతిగా మారింది. ఇది తెలుసుకున్న చుట్టుప్రక్కల వారందరూ సరస్సులో దిగి యౌవనవంతులుగా మారి, చావులే లేకుండా వుండసాగారు.

విషయం తెలుసుకున్న త్రిమూర్తులు ఆజ్ఞాపించడంతో వాయు దేవుడు కొండ రాళ్లను తెచ్చి వేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. చివరకు హనుమంతుడు లక్ష్మీ దేవిని పూజించి పెద్ద కొండను తెచ్చి సరస్సులో వేశాడు. అమృత ప్రభావంతో ఆ కొండ నీటిలో పుష్పంలా తేలింది. దీంతో త్రిమూర్తులు తమ పాదాలతో దాన్ని అణగదొక్కారు. దానికి ఆనవాలుగా నేటికీ కొండపై పడమర భాగంలో రుద్ర పాదం, తూర్పున విష్ణు పాదం, ఉత్తరాన బ్రహ్మ పాదాలు వున్నాయి. నీటిపై పుష్పం వలె తేలియాడింది కావున నాటి నుండి కాంపల్లె గ్రామం ‘పుష్పగిరి’గా పేరుగాంచిందని ప్రచారంలో వుంది.
 
అద్వైత పీఠం
జగద్గురువు శ్రీఆది శంకరాచార్య స్వామి చేతుల మీదుగా దక్షిణాదిలో స్థాపించబడిన ఏకైక అద్వైత పీఠంగా పుష్పగిరి పీఠం ప్రఖ్యాతి గాంచింది. ఈ పీఠంలోని మహిమాన్విత స్ఫటిక లింగం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ చంద్రమౌళీశ్వరుని రూప స్ఫటిక లింగం కైలాసం నుండి నేరుగా ఇక్కడి పీఠంలో వెలసిందని ప్రతీతి. అన్ని అద్వైత పీఠాల్లోని స్ఫటిక లింగాల కంటే పెద్దదైన ఈ స్ఫటిక లింగానికి అనునిత్యం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజలు జరుగుతాయి.
 
విశిష్టమైన శ్రీ చక్రం
వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వున్న శ్రీకామాక్షీదేవి ఆలయంలో అమ్మవారి ఎదుట ఎంతో విశిష్టమైన శ్రీచక్ర మేరువు వుంది. ఇచ్చటి అమ్మవారి ఎదుట బిందు, త్రికోణ, వసు కోణాలతో దాదాపు 27 అంగుళాల ఎత్తు వున్న మహామేరువు శ్రీచక్రం విజయనగర రాజ్య స్థాపక హరిహర, బుక్క రాయలను ప్రేరేపించిన శ్రీ విద్యారణ్య స్వామి ప్రతిష్ఠితం. పుష్పగిరి కొండపైన శ్రీ చెన్న కేశవ స్వామి, లక్ష్మీ దేవి, ఆంజనేయ స్వామి, సంతాన మల్లేశ్వర, సాక్షి మల్లేశ్వర, రుద్రపాదం, దుర్గ, ఇంద్ర నాథేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు.
- మోపూరి బాలకృష్ణారెడ్డి (సాక్షి ప్రతినిధి, కడప),
- పుత్తా నవనీశ్వరరెడ్డి (రిపోర్టర్, వల్లూరు)

 
చేరుకోవడం ఇలా!
* వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రమైన కడప పట్టణానికి 18 కి. మీ దూరంలో పుష్పగిరి వుంది.
* హైదరాబాదు, విజయవాడ పట్టణాల నుండి ప్రస్తుతం కడప విమానాశ్రయానికి విమాన సర్వీసులు అందుబాటులో వున్నాయి.
* విమానాశ్రయం నుండి కేవలం 14 కి.మీ దూరంలో ఉంది పుష్పగిరి.
* కడప-వల్లూరు మార్గంలో పుష్పగిరి  వుంది.
* కడప రైల్వే స్టేషన్ నుండి దాదాపు 18 కి. మీ దూరం వుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement