పితృదేవతల ముక్తిక్షేత్రం
పాదగయ
గయాసురుని పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాద గయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు.
పిఠాపురం అసలు పేరు పీఠికాపురం. అష్టాదశ శక్తిపీఠాలలో ఇది పదవ పీఠం. దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన చక్రంతో ఛిన్నాభిన్నం చేయగా ఆమె పిరుదులు (పీఠం) పడిన ప్రాంతం కనుక దీనిని పీఠికాపురం అన్నారు. కాలక్రమంలో ఇదే పిఠాపురంగా స్థిరపడింది. దీనికే దక్షిణ కాశీ అని, పాద గయ అని పేర్లు ఉన్నాయి. శ్రీ కుక్కుటేశ్వరస్వామి, శ్రీ దత్తాత్రేయస్వామి, అష్టాదశపీఠాలలో ఒకటైన శ్రీ పురుహూతిక అమ్మవారి పీఠం ఇక్కడే ఉన్నాయి కనుక పిఠాపురం తెలుగువారికి అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటున్నది. దక్షిణ కాశీకి వెళుతూ వ్యాసుడు ఈ క్షేత్రాన్ని దర్శించాడని కథనం. శ్రీనాథుడు తన పర్యటనల్లో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శించి సేవించాడని చారిత్రక ఆధారాలున్నాయి. పితృదేవతల ముక్తికి భాద్రపదమాసంలో ఈ క్షేత్రంలో పిండప్రదానాలు జరగడం కద్దు.
చతుర్భుజ
పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం కుక్కుటేశ్వరస్వామి ఆలయంలో ఉంటుంది. ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా అమ్మవారి మూర్తి చతుర్భుజగా అత్యద్భుత సౌందర్యరాశిగా... దర్శించిన వెంటనే భక్తిభావం ఉప్పొంగేలా ఉంటుంది. ఈమెకు పురుహూతిక అని పేరు. దానికి ఓ కథ ఉంది. పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేసి శాపకారణాన సహస్రాక్షుడవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవడానికి జగజ్జనని అయిన ఈ అమ్మవారి కోసం తపస్సు చేసి శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు (ఇంద్రుడు) ఆరాధించిన దేవి గనుక ఈవిడ పురుహూతిక అయ్యింది.
పాద గయ
పిఠాపురంకు ‘పాద గయ’గా పేరు రావడానికి ఒక కథ ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షసుడు మహా విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండే వరం పొందాడు. దాని వల్ల మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై నేరుగా స్వర్గానికి రావడం మొదలుపెట్టారు. మరోవైపు గయాసురుడు భాగవోత్తముడు కనుక ఇంద్రపదవి అతనికి దక్కింది. దీనిని భరించలేని ఇంద్రుడు త్రిమూర్తులను వేడుకొనగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుణ్ణి చేరి ‘అయ్యా... తమది పుణ్యశరీరం. తమ దేహం మీద లోక కళ్యాణార్థం ఏడురోజుల పాటు యజ్ఞం చేయదలిచాము’ అన్నారు.
అందుకు గయాసురుడు అంగీకరించాడు. అప్పుడు త్రిమూర్తులు ‘గయాసురా... ఏడు రోజుల లోపు నువ్వు కదిలినా లేచినా యజ్ఞసమాప్తి కొరకు అంటే యజ్ఞం అసంపూర్తిగా ముగించలేము కనుక నిన్ను సంహరిస్తాము’ అని అన్నారు. గయాసురుడు అందుకు అంగీకరించి తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. అతడి తల గయ (బిహార్), నాభి- నాభి గయ (ఒరిస్సా జాజ్‌పూర్), పాదాలు- పాదగయ (పిఠాపురం)లో ఉండేంతగా పెంచాడు. త్రిమూర్తులు ఆ శరీరం మీద యజ్ఞం ప్రారంభిస్తారు.
ఆరురోజులు గడిచి ఏడవరోజు పూర్తి కావలసి ఉంటుంది. అప్పుడు శివుడు తెల్లవారక ముందే కోడి రూపం (కుక్కుటము) ధరించి కూస్తాడు. దాంతో ఏడోరోజు పూర్తయ్యిందని భావించి గయాసురుడు కదులుతాడు. అదే కారణాన సంహరింపబడతాడు. అతడి పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాద గయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు.
ఆ కోరిక ఆమోదించబడింది కనుకనే మూడు గయలలో పిండప్రదానాలకు విశేష ఫలప్రదం కలిగింది. పాదగయలో గయాసురుని పాదాల చెంత పిండం వదిలితే అది నేరుగా పితృదేవతలకు చేరుతుందని నమ్మకం. గోదావరి పుష్కర కాలంలో ఒరిస్సా నుంచి ఓడ్రులు కనీసం ఇంటికి ఒకరైనా వచ్చి రాజమండ్రి గోదావరిలో స్నానం చేసి పిఠాపురంలోగల ఈ పాదగయలో పిండ ప్రదానం చేయటం తరాలుగా వస్తున్నది.
కుక్కుటేశ్వరుడు
గయాసుర సంహారం కోసం కుక్కుట రూపం ధరించిన శివుడు కుక్కుటేశ్వరుడుగా ఇక్కడ వెలిశాడు. శ్రీ స్వామి వారి దేవేరి శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్నది. ఈమెకు ఒకపక్క మయూర వాహనుడైన కుమారస్వామి, మరొకపక్క చతుర్భుజుడైన గణపతి మూర్తి వెలసి ఉండటం విశేషం.
ఆ పుష్కరిణి పేరు ఏలా నది
పిఠాపురం క్షేత్రంలో ఉన్న పుష్కరిణి విశేషమైనది. దీనిని ‘ఏలానది’ అని కూడా పిలుస్తారు. పూర్వం ఏలామహర్షి అప్సరసల మోహంలో పడి తపస్సు భగ్నం చేసుకుంటాడు. ప్రాయశ్చిత్తం కోసం ఈశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయనను మెప్పించి శివుని జటాజూటంలోని గంగ లో స్నానం చేసి తన పాపాన్ని తొలగించుకున్నాడు. ఈ సందర్భంగా తన పేరు మీద ఒక నది ప్రవహించే విధంగా వరమియ్యాలని శివునికోరి ఒక నదీపాయను తన వెంట తీసుకొని సాగ రంలో కలిపేందుకు బయలుదేరగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడికూత వినబడడంతో అక్కడ ఆగిపోయాడు. దీంతో ఆయన వెంట వచ్చిన నదీపాయ కూడా ఆగిపోయింది. అదే పాదగయ పుష్కరిణిగా ప్రసిద్ధి చెందిందని అంటారు.
పంచమాధవ క్షేత్రం
దేవేంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుణ్ణి సంహరించాక బ్రహ్మ హత్యాపాతకం నుంచి తప్పించుకోవడానికి ఐదు మాధవ క్షేత్రాలను స్థాపించాడు. ఆ ఐదు: ఉత్తరప్రదేశ్‌లోని వారణాశిలో బిందుమాధవ క్షేత్రం, అలహాబాద్‌లోని ప్రయాగలో వేణుమాధవ క్షేత్రం, తమిళనాడులోని రామేశ్వరంలో సేతు మాధవక్షేత్రం, కేరళలోని తిరువనంతపురంలలో సుందరమాధవ క్షేత్రం, పిఠాపురంలో కుంతీమాధవ క్షేత్రం. వనవాస సమయంలో కుంతీదేవి పాండవుల క్షేమం కోసం మహావిష్ణువును ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి అనుగ్రహించడం వల్ల ఈస్వామికి కుంతీమాధవ స్వామిగా పేరొచ్చినట్లు కథనం. అలాగే కుంత అనే ఆయుధం కలిగి ఉండడం వల్ల కూడా కుంతీమాధవస్వామిగా పేరొందినట్లు చెబుతుంటారు.
శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం
దత్తాత్రేయుడి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు. ఆయన శక్తిపీఠాన్ని పూజించారు. ఆయన జన్మించిన గృహమే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం. శ్రీపాదవల్లభ జయంతి, దత్తాత్రేయ జయంతి తదితర ఉత్సవాల సమయంలో వేలాది సంఖ్యలో భక్తులు మహారాష్ర్ట, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా విశేష సంఖ్యలో హాజరవుతుంటారు.
- వీవీవీ ప్రసాద్, సాక్షి, పిఠాపురం
రవాణా సౌకర్యాలు
పిఠాపురం తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నది. ఇక్కడకు అన్ని ప్రాంతాలనుంచి బస్సు, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి రైలు సౌకర్యం ఉంది. రైళ్లలో వచ్చే యాత్రికులు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సామర్లకోట రైల్వేజంక్షన్‌లో దిగి వాహనాలపై ఇక్కడకు చేరుకోవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయం ఇక్కడకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి విమానాశ్రయం ఇక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వసతి సౌకర్యాలు
ఆలయం సమీపంలో వసతి గృహసముదాయాలు ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ గదులు అందుబాటులో ఉంటాయి. వసతి సౌకర్యం కావాల్సిన వారు ఇతర వివరాలకు ఆలయం ఫోన్ నంబరు 08869-252477 ను సంప్రదించవచ్చు.