ఆంధ్రుల ఔన్నత్యాన్ని చాటిన ప్రాచీన మహానగరాలలో ఇంద్రపురి
విష్ణుకుండినుల రాజధానిగా పాలన
శిథిలావస్థలో అపురూప కట్టడాలు
రామన్నపేట: ఆంధ్రుల ఔన్నత్యాన్ని చాటిన ప్రాచీన మహానగరాలలో ఇంద్రపురి ఒకటి. విష్ణుకుండినులు ఇంద్రపురిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. నాడు ఇంద్రపురిగా వెలుగొందిన నగరాన్ని.. నేడు ఇంద్రపాలనగరంగా పిలుస్తున్నారు.
యాదాద్రి భవనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో చిట్యాల–భువనగిరి రోడ్డును ఆనుకొని ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) ఉంది. ఇంద్రపాలనగర పరిసరాల్లో బయటపడిన తామ్ర శాసనం, శిలాశాసనం ద్వారా గ్రామచరిత్ర వెలుగులోకి వచ్చింది.
ఇంద్రపాలనగరం రాజధానిగా..
ఆంధ్రదేశ చరిత్రలో గొప్ప పరిపాలకులుగా పేరొందిన రాజవంశీయుల్లో విష్ణుకుండినులు ఒకరు. శాలంకాయనుల వంశీయుల అనంతరం విష్ణుకుండినుల రాజ్యస్థాపకుడైన మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ) ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని పాలన ప్రారంభించాడు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాలనను ప్రారంభించి కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాలను ఆక్రమించారు. 5, 6 శతాబ్దాల్లో విష్ణుకుండినులు.. ప్రజారంజకంగా పరిపాలించారు.
ఆ రోజుల్లో తమ రాజ్యానికి దక్షిణ, పశ్చిమోత్తరాల్లో శక్తివంతులైన వాకాటక వంశీయుల రాజకుమార్తెను విష్ణుకుండినుల రాజు మాధవవర్మ వివాహమాడి.. వారితో సత్సంబంధాలను కొనసాగించినట్లు చర్రిత చెబుతోంది. తామ్ర శాసనాల ద్వారా.. విష్ణుకుండినులకు దక్షిణాపధపతి, త్రికూట మలయాధిన వంటి బిరుదులు ఉన్నాయని తెలుస్తోంది. మూసీ నదిని ఆనుకొని సువిశాలమైన ఇంద్రపాలగుట్ట ఉంది.
గుట్టపై గిరిదుర్గంపై విష్ణుకుండినుల కాలంలో కట్టిన కోట ఉంది. కోటకు 12 బురుజులు ఉన్నాయి. కోటకు దగ్గరలోని కోనేరును ఏనుగుల బావి అంటారు. అక్కడగల పెద్దపెద్ద మట్టి ఇటుకలు, రాళ్లు, పునాదులు, పెద్దగోడలు, శిథిలమైన గదుల బట్టీ.. రాజభవనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు స్తంభాల మంటపం ఉంది. గుట్టపైన ఎల్లమ్మగుడి, పరశురాముడి పాదాలు ఉన్నాయి.
సహజసిద్ధమైన శివాలయం
గుట్టపైన సహజసిద్ధమైన శివాలయం ఉంది. ఒకరాతి గుండుపై మరో రాతిగుండు నిలిచి ప్రకృతి సిద్ధమైన దేవాలయంగా రూపు దిద్దుకుంది. రెండు అడుగుల శివలింగాన్ని నల్లరాతితో మలిచారు. శివాలయ పరిసరాల్లోని శిలాశాసనాలు శిథిలమయ్యాయి. గుట్ట నుంచి మూసీనదిలోకి దిగేదారిలో పరుపు బండపై శివలింగాలను చెక్కారు.
శిథిలమైన పంచలింగేశ్వరాలయం
ఇంద్రపాలనగరం చెరువుకు సమీపంలో రాతితో నిర్మించిన పంచలింగేశ్వరాలయం ఉంది. గోపురం మాత్రం ఇటుక, సున్నంతో నిర్మితమైంది. ఇందులో 5 ఆలయాలు, 40 స్తంభాలున్న గర్భగుడి ఉంది. ఆలయానికి ఎదురుగా రెండంతస్తుల మండపం ఉంది. ఆలయం పూర్తిగా శిథిలమైంది. ఆలయం పూర్వీకుల శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.
ప్రజల కల్పతరువు పెద్దచెరువు
ఇంద్రపాలనగరంలో సుమారు 1,200 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన చెరువు ఉంది. దీనిని పెద్దచెరువు అని పిలుస్తారు. మూసీనదిపై నెమలి కాలువ వద్ద నిర్మించిన కత్వనుంచి ఆసిఫ్‌నహర్ కాలువ ద్వారా చెరువులోకి నీరు వస్తుంది. పెద్దచెరువు తూముల నుంచి ఆసిఫ్‌నహర్ కాలువ దిగువకు నీటిని వదులుతారు.
చెరువు ద్వారా సుమారు 800 ఎకరాల పొలాలకు నేరుగా సాగునీరు అందుతుంది. ఎగువన గల వేలాది ఎకరాలు చెరువు నీటితోనే సాగవుతున్నాయి. 500కు పైగా మత్స్య కార్మికుల కుటుంబాలు చేపల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఇది చిట్యాల–భువనగిరి రోడ్డును ఆనుకొని ఉంటుంది. చెరువుకట్ట సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
ప్రజల ఇలవేల్పు ఇంద్రపాల ముత్యాలమ్మ
గ్రామప్రజల ఇలవేల్పు ఇంద్రపాల ముత్యాలమ్మతల్లి. పంచలింగేశ్వర ఆలయ సమీపంలో ముత్యాల మ్మ తల్లి దేవాలయం ఉంది. ఆలయానికి నిత్యం భ క్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. బోనాలు సమర్పిస్తుంటారు. ఇతర ప్రాంతాల్లో నివసించే వారు ఏ టా ఒకసారైనా దర్శనానికి వస్తుంటారు. గ్రామప్రజ లు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు.
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
ఇంద్రపాలనగరం చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం. విష్ణుకుండినుల కాలంనాటి కట్టడాలు, శాసనాలు దేవాలయాలు జీర్ణోద్ధరణ దశకు చేరుకున్నాయి. చారిత్రక సంపదను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ప్రధాన రహదారిని ఆనుకున్నందున సందర్శకులు అధికంగా వస్తే.. ఇంద్రపాల నగరానికి పూర్వవైభవం వస్తుంది. – తవుటం భిక్షపతి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment