Tummalagudem
-
నిన్నటి ఇంద్రపురి.. నేటి ఇంద్రపాలనగరి
రామన్నపేట: ఆంధ్రుల ఔన్నత్యాన్ని చాటిన ప్రాచీన మహానగరాలలో ఇంద్రపురి (Indrapuri) ఒకటి. విష్ణుకుండినులు ఇంద్రపురిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. నాడు ఇంద్రపురిగా వెలుగొందిన నగరాన్ని.. నేడు ఇంద్రపాలనగరంగా పిలుస్తున్నారు. యాదాద్రి భవనగిరి జిల్లా రామన్నపేట (Ramannapeta) మండల కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలో చిట్యాల–భువనగిరి రోడ్డును ఆనుకొని ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) ఉంది. ఇంద్రపాలనగర పరిసరాల్లో బయటపడిన తామ్ర శాసనం, శిలాశాసనం ద్వారా గ్రామచరిత్ర వెలుగులోకి వచ్చింది. ఇంద్రపాలనగరం రాజధానిగా.. ఆంధ్రదేశ చరిత్రలో గొప్ప పరిపాలకులుగా పేరొందిన రాజవంశీయుల్లో విష్ణుకుండినులు ఒకరు. శాలంకాయనుల వంశీయుల అనంతరం విష్ణుకుండినుల రాజ్యస్థాపకుడైన మహారాజేంద్రవర్మ (ఇంద్రవర్మ) ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని పాలన ప్రారంభించాడు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాలనను ప్రారంభించి కృష్ణా, గోదావరి మధ్య ప్రాంతాలను ఆక్రమించారు. 5, 6 శతాబ్దాల్లో విష్ణుకుండినులు.. ప్రజారంజకంగా పరిపాలించారు. ఆ రోజుల్లో తమ రాజ్యానికి దక్షిణ, పశ్చిమోత్తరాల్లో శక్తివంతులైన వాకాటక వంశీయుల రాజకుమార్తెను విష్ణుకుండినుల రాజు మాధవవర్మ వివాహమాడి.. వారితో సత్సంబంధాలను కొనసాగించినట్లు చర్రిత చెబుతోంది. తామ్ర శాసనాల ద్వారా.. విష్ణుకుండినులకు దక్షిణాపధపతి, త్రికూట మలయాధిన వంటి బిరుదులు ఉన్నాయని తెలుస్తోంది. మూసీ నదిని ఆనుకొని సువిశాలమైన ఇంద్రపాలగుట్ట ఉంది.గుట్టపై గిరిదుర్గంపై విష్ణుకుండినుల కాలంలో కట్టిన కోట ఉంది. కోటకు 12 బురుజులు ఉన్నాయి. కోటకు దగ్గరలోని కోనేరును ఏనుగుల బావి అంటారు. అక్కడగల పెద్దపెద్ద మట్టి ఇటుకలు, రాళ్లు, పునాదులు, పెద్దగోడలు, శిథిలమైన గదుల బట్టీ.. రాజభవనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండు స్తంభాల మంటపం ఉంది. గుట్టపైన ఎల్లమ్మగుడి, పరశురాముడి పాదాలు ఉన్నాయి. సహజసిద్ధమైన శివాలయం గుట్టపైన సహజసిద్ధమైన శివాలయం ఉంది. ఒకరాతి గుండుపై మరో రాతిగుండు నిలిచి ప్రకృతి సిద్ధమైన దేవాలయంగా రూపు దిద్దుకుంది. రెండు అడుగుల శివలింగాన్ని నల్లరాతితో మలిచారు. శివాలయ పరిసరాల్లోని శిలాశాసనాలు శిథిలమయ్యాయి. గుట్ట నుంచి మూసీనదిలోకి దిగేదారిలో పరుపు బండపై శివలింగాలను చెక్కారు. శిథిలమైన పంచలింగేశ్వరాలయం ఇంద్రపాలనగరం చెరువుకు సమీపంలో రాతితో నిర్మించిన పంచలింగేశ్వరాలయం ఉంది. గోపురం మాత్రం ఇటుక, సున్నంతో నిర్మితమైంది. ఇందులో 5 ఆలయాలు, 40 స్తంభాలున్న గర్భగుడి ఉంది. ఆలయానికి ఎదురుగా రెండంతస్తుల మండపం ఉంది. ఆలయం పూర్తిగా శిథిలమైంది. ఆలయం పూర్వీకుల శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రజల కల్పతరువు పెద్దచెరువు ఇంద్రపాలనగరంలో సుమారు 1,200 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన చెరువు ఉంది. దీనిని పెద్దచెరువు అని పిలుస్తారు. మూసీనదిపై నెమలి కాలువ వద్ద నిర్మించిన కత్వనుంచి ఆసిఫ్‌నహర్ కాలువ ద్వారా చెరువులోకి నీరు వస్తుంది. పెద్దచెరువు తూముల నుంచి ఆసిఫ్‌నహర్ కాలువ దిగువకు నీటిని వదులుతారు. చదవండి: గజేంద్ర మోక్షం ఆధారంగా ఆలయం.. ఎక్కడుందంటే?చెరువు ద్వారా సుమారు 800 ఎకరాల పొలాలకు నేరుగా సాగునీరు అందుతుంది. ఎగువన గల వేలాది ఎకరాలు చెరువు నీటితోనే సాగవుతున్నాయి. 500కు పైగా మత్స్య కార్మికుల కుటుంబాలు చేపల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. ఇది చిట్యాల–భువనగిరి రోడ్డును ఆనుకొని ఉంటుంది. చెరువుకట్ట సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ప్రజల ఇలవేల్పు ఇంద్రపాల ముత్యాలమ్మగ్రామప్రజల ఇలవేల్పు ఇంద్రపాల ముత్యాలమ్మతల్లి. పంచలింగేశ్వర ఆలయ సమీపంలో ముత్యాల మ్మ తల్లి దేవాలయం ఉంది. ఆలయానికి నిత్యం భ క్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. బోనాలు సమర్పిస్తుంటారు. ఇతర ప్రాంతాల్లో నివసించే వారు ఏ టా ఒకసారైనా దర్శనానికి వస్తుంటారు. గ్రామప్రజ లు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి ఇంద్రపాలనగరం చారిత్రక నేపథ్యం కలిగిన గ్రామం. విష్ణుకుండినుల కాలంనాటి కట్టడాలు, శాసనాలు దేవాలయాలు జీర్ణోద్ధరణ దశకు చేరుకున్నాయి. చారిత్రక సంపదను కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ప్రధాన రహదారిని ఆనుకున్నందున సందర్శకులు అధికంగా వస్తే.. ఇంద్రపాల నగరానికి పూర్వవైభవం వస్తుంది. – తవుటం భిక్షపతి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు -
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
15 గిరిజన కుటుంబాల వెలి
బొడ్రాయికి డబ్బులు ఇవ్వకపోవడమే కారణం మాట్లాడినా.. నీళ్లిచ్చినా 10 వేలు జరిమానా పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీ పరిధిలోని తుమ్మలగూడెం లో 15 గిరిజన కుటుంబాలను కులపెద్దలు వెలి వేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం ఆయా కుటుంబాలు డబ్బు లివ్వకపోవడంతో కుల పెద్దలు ఈ మేరకు నెల క్రితం నిర్ణయం తీసుకోగా... అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మండలంలోని తుమ్మలగూడెంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. గతనెల 23న గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం గ్రామంలోని గిరిజన కుటుంబాలు ఒక్కో ఇంటికి రూ. ఆరు వేల చొప్పున చందాగా ఇవ్వాలని కుల పెద్దలు నిర్ణయించారు. అయితే, క్రైస్తవమతం స్వీకరించిన 15 గిరిజన కుటుంబాలు చందాలివ్వలేమని చెప్పారుు. దీంతో ఆ కుటుంబాలకు చెందిన కుంజా రాందాసు, కుంజా లక్ష్మి, ఈసం రాజేశ్వరి, కుంజా రాములమ్మ, కుంజా పద్మ, జబ్బా యశోద, కుంజా నాగలక్ష్మి, ఎనుగు గురవమ్మ, ఈసం శివకృష్ణలతో పాటు మరికొందరిని గ్రామ పెద్దలు వెలి వేశారు. వారితో ఎవరు మాట్లాడినా, వారిని శుభకార్యాలకు పిలిచినా, వాళ్ల ఇళ్లకు వెళ్లినా, వారికి నీళ్లు ఇచ్చినా, పనిలోకి పిలిచినా రూ. 10 వేల జరిమానా విధిస్తామని పెద్దలు తేల్చిచెప్పారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తాం గ్రామస్తుల్లో కొందరిని వెలి వేయడం అత్యంత హేయమైన చర్య. గురువారం తుమ్మల గూడేన్ని సందర్శిస్తాం. గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. - వి.రాఘవరెడ్డి, తహసీల్దార్ చంటి బిడ్డనూ ఎత్తుకోవడం లేదు బొడ్రాయికి చందాలివ్వలేదని.. అభం శుభం తెలియని చిన్నారిని చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఎత్తుకోవడం లేదు. ఎత్తుకుంటే జరిమానా విధిస్తారని అందరూ భయపడుతున్నారు. - యశోద నీళ్లకు కూడా రానివ్వడం లేదు బొడ్రాయికి చందాలివ్వలేదని క్రిస్టియన్ మతం తీసుకున్న మమ్మల్ని వెలి వేశారు. నీళ్ల కోసం వెళితే రావొద్దంటున్నారు. బంధువుల ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. - ఈసం రాజేశ్వరి