15 గిరిజన కుటుంబాల వెలి
బొడ్రాయికి డబ్బులు ఇవ్వకపోవడమే కారణం మాట్లాడినా.. నీళ్లిచ్చినా 10 వేలు జరిమానా
పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీ పరిధిలోని తుమ్మలగూడెం లో 15 గిరిజన కుటుంబాలను కులపెద్దలు వెలి వేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం ఆయా కుటుంబాలు డబ్బు లివ్వకపోవడంతో కుల పెద్దలు ఈ మేరకు నెల క్రితం నిర్ణయం తీసుకోగా... అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మండలంలోని తుమ్మలగూడెంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి.
గతనెల 23న గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం గ్రామంలోని గిరిజన కుటుంబాలు ఒక్కో ఇంటికి రూ. ఆరు వేల చొప్పున చందాగా ఇవ్వాలని కుల పెద్దలు నిర్ణయించారు. అయితే, క్రైస్తవమతం స్వీకరించిన 15 గిరిజన కుటుంబాలు చందాలివ్వలేమని చెప్పారుు. దీంతో ఆ కుటుంబాలకు చెందిన కుంజా రాందాసు, కుంజా లక్ష్మి, ఈసం రాజేశ్వరి, కుంజా రాములమ్మ, కుంజా పద్మ, జబ్బా యశోద, కుంజా నాగలక్ష్మి, ఎనుగు గురవమ్మ, ఈసం శివకృష్ణలతో పాటు మరికొందరిని గ్రామ పెద్దలు వెలి వేశారు. వారితో ఎవరు మాట్లాడినా, వారిని శుభకార్యాలకు పిలిచినా, వాళ్ల ఇళ్లకు వెళ్లినా, వారికి నీళ్లు ఇచ్చినా, పనిలోకి పిలిచినా రూ. 10 వేల జరిమానా విధిస్తామని పెద్దలు తేల్చిచెప్పారు.
కౌన్సెలింగ్ నిర్వహిస్తాం
గ్రామస్తుల్లో కొందరిని వెలి వేయడం అత్యంత హేయమైన చర్య. గురువారం తుమ్మల గూడేన్ని సందర్శిస్తాం. గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం.
- వి.రాఘవరెడ్డి, తహసీల్దార్
చంటి బిడ్డనూ ఎత్తుకోవడం లేదు
బొడ్రాయికి చందాలివ్వలేదని.. అభం శుభం తెలియని చిన్నారిని చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఎత్తుకోవడం లేదు. ఎత్తుకుంటే జరిమానా విధిస్తారని అందరూ భయపడుతున్నారు. - యశోద
నీళ్లకు కూడా రానివ్వడం లేదు
బొడ్రాయికి చందాలివ్వలేదని క్రిస్టియన్ మతం తీసుకున్న మమ్మల్ని వెలి వేశారు. నీళ్ల కోసం వెళితే రావొద్దంటున్నారు. బంధువుల ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. - ఈసం రాజేశ్వరి