భద్రాద్రి: రెండు నెలల క్రితం వివాహమైంది. బతుకుదెరువు కోసం భాగ్యనగరం వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు చెట్టును ఢీకొని నవ వధువు మృతి చెందింది. భర్త, అత్త, మామలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం కుందారం సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన అంబడి ప్రశాంత్‌కు ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెం గ్రామానికి చెందిన సింధూజ(23)తో గత జూన్ 8న వివాహం జరిగింది. కారు నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రశాంత్ బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి క్యాబ్ నడుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల భార్యతోపాటు తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగమణి తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లి, అద్దెకు ఇల్లు తీసుకుని వచ్చాడు.
మంగళవారం రాత్రి ఉల్వనూరులో ఇంటికి తాళంవేసి నలుగురూ కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పాలకుర్తిరోడ్‌లోని కుందారం సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో సింధూజ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ప్రశాంత్, అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
వివాహమై రెండు నెలలు కాకముందే..
ప్రశాంత్, సింధూజకు వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తిగా నిండలేదు. ఇక్కడ బతుకుదెరువు లేకపోడంతో హైదరాబాద్ వెళ్లి కారు క్యాబ్ నడుపుకునేందకు కుటుంబం అంతా బయల్దేరారు. అవసరమైన నిత్యావసర వస్తువులు బియ్యం, ఉప్పు, కారం, పచ్చళ్లు, కుట్టు మిషన్ వంటి సామగ్రి వెంట తీసుకెళ్తున్నారు.
ప్రమాదస్థలిలో నిత్యావసర వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్న తీరు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. వివాహం జరిగిన రెండు నెలలు కాకముందే సింధూజ మృతిచెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఉల్వనూరు, ముత్తగూడెం గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment