
సాక్షి, హైదరాబాద్: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన అందరిని కలిచి వేసిందని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత(సీఎల్పీ) లీడర్ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొడుకు రాఘవ బెదిరింపులు తట్టుకోలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ధ్వజమెత్తారు. రామకృష్ణ తన ఆవేదనను సెల్ఫీ రూపంలో వివరించాడని పేర్కొన్నారు. గతంలోనే ఓ వ్యక్తి వనమా రాఘవ పేరు రాసి చనిపోయాడని గుర్తు చేశారు. ఆ రోజే వనమా రాఘవపై చర్యలు తీసుకుంటే ఈ రోజు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొని ఉండేది కాదన్నారు.
ఇంత దారుణానికి కారణమైన రాఘవను ఇంతవరకు అరెస్టు చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. వనమా రాఘవపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ప్రజల మానప్రాణాలు కాపాడటం అధికారం యంత్రాంగం బాధ్యతనని పేర్కొన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్న దోషులను ప్రభుత్వం రక్షిస్తోందని మండిపడ్డారు.
చదవండి: ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను..