vanama venkateswar rao
-
'వనమా.. జలగం'ల మధ్య ‘సుప్రీం’ తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గత మూడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు నేడు తెర పడనుంది. ‘కొత్తగూడెం’ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల మధ్య నడుస్తున్న కేసులో మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన వనమా 2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావులు పోటీ చేశారు. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావుపై వనమా వెంకటేశ్వరావు 4,139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత వనమా గెలుపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 2019లో జలగం కేసు దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో వనమా తప్పుడు వివరాలు సమర్పించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగేళ్లపాటు విచారణ కొనసాగిన కేసులో 2023 జూలై 25న తీర్పు వచ్చింది. వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెబల్‌గా జలగం.. కొత్తగూడెం ఎమ్మెల్యే అనర్హత కేసులో ఇరువర్గాలు సుప్రీం కోర్టులో కౌంటర్లు దాఖలు చేశారయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో తీర్పును అక్టోబరు 31కి న్యాయస్థానం రిజర్వ్ చేసి ఉంచింది. నేడు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు వనమా వెంకటేశ్వరావుకు ప్రతికూలంగా వస్తే, పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జోరుగా కొనసాగుతోంది. మరోవైపు జలగం వెంకట్రావు అభ్యంతరాలను న్యాయస్థానం తోసి పుచ్చితే, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జలగం మద్దతుదారులు బీఆర్ఎస్ రెబల్‌గా జలగం కొత్తగూడెం బరిలో ఉండటం ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ మీద కొత్తగూడెం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వనమాకు అండగా కేసీఆర్ హైకోర్టు తీర్పు వెలువడ్డాక విపత్కర పరిస్థితుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ప్రగతి భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకుని పార్టీ తరఫున అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. దీంతో అప్పటివరకు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో కొనసాగుతూ వస్తోన్న గ్రూపు రాజకీయాలు సద్దుమణిగాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రత్యేకంగా నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. సీఎం కేసీఆర్ తిరిగి వనమాకే టికెట్ కేటాయించడంతోపాటు బీ ఫామ్‌ను అందించారు. కేసీఆర్ ప్రోత్సాహంతో వనమా ఇప్పటికే ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ ‘ఇవే తనకు చివరి ఎన్నికలు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. అంటూ కోరుతున్నారు. 5న కొత్తగూడెంలో సీఎం హాజరయ్యే బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి చదవండి: ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శలు -
సుప్రీంకోర్టులో వనమాకు ఊరట
న్యూఢిల్లీ: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ, రెండోస్థానంలోని జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ వనమా దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది. వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మారినందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని జలగం తరఫు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరగలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. వనమా విచారణకు హాజరుకాకపోవడం, ఆయా ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రాల వివరాలు, ఒక భార్య ఉన్నారా లేదా ఇద్దరు భార్యలు ఉన్నారా తదితర అంశాలన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతను కొనసాగించాలని దామా శేషాద్రినాయుడు కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం ప్రతివాదులు జలగం వెంకట్రావు, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అదనపు ఆధారాలు సమర్పించడానికి పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరీన్ రావెల్‌కు అనుమతించింది. ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలన్న ధర్మాసనం రిజాయిండర్కు మరో రెండు వారాలు గడువు ఇచ్చింది. చదవండి: సాత్నాల వాగులో రిమ్స్ పీజీ వైద్యుడి గల్లంతు.. మృతదేహం లభ్యం -
మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
-
వనమా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు.. జలగం వెంకట్ రావు
-
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదన్న హై కోర్టు
-
జలగం కారు దిగుతాడా ..?
-
వనమా రాఘవకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
కొత్తగూడెం టౌన్: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా పాత పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ–2 నిందితుడిగా రిమాండ్‌లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్రరావుకు హైకోర్టులోనూ చుక్కెదురైంది. గతంలో రెండు సార్లు రాఘవ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించిన విషయం విదితమే. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా అక్కడా బెయిల్ తిరస్కరించారు. రాఘవ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముం దని, మరో పది కేసుల్లోనూ ఆయనపై విచా రణ జరుగుతున్నందున బెయిల్ ఇవ్వొద్దనే ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి అంగీకరించారు. బెయిల్ నిరాకరించి, తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న నాగరామకృష్ణ తల్లి సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి మాధవికి మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే, రాఘవకు బెయిల్ నిరాకరిస్తూ గురువారం సాయంత్రమే తీర్పు వెలువడినా, ఉత్తర్వులు శుక్రవారం అందాయి. -
భద్రాచలం జైలుకు వనమా రాఘవ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేంద్రరావు (రాఘవ) కటకటాల్లోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి రాఘవపై ఐపీసీ సెక్షన్లు 302, 306, 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఎదుట హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించడంతో.. వెంటనే భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య.. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రాఘవను పాల్వంచలోని ఏఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకుని.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాయి. శనివారం తెల్లవారుజాము నుంచే వనమా బాధితులు, ప్రజలు, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాఘవను ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు పాల్వంచ నుంచి కొత్తగూడేనికి పోలీసు వాహనంలో తీసుకొస్తున్న క్రమంలో.. కొత్తగూడెం శివారులోని బ్రిడ్జి వద్ద బీజేపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. రాఘవను ఎన్కౌంటర్ చేయాలని, కోర్టుకు తీసుకెళ్లి సమయం వృథా చేయొద్దని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరగగా.. పోలీ సులు, బీజేపీ శ్రేణులను చెదరగొట్టి ముందు కు కదిలారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాక.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భద్రాచలం సబ్‌జైలు అధికారులకు అప్ప గించారు. రాఘవకు దుస్తులతో కూడిన సంచీని ఇచ్చారు. తొలిరోజు మొదటి బ్యారక్‌లో ఇతర ఖైదీలతో పాటే రాఘవను ఉంచినట్టు జైలువర్గాలు తెలిపాయి. బాధితులు ముందుకు రావాలి రాఘవను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చే ముందు ఏఎస్పీ రోహిత్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 7న కారు (నెక్సాన్– టీఎస్28ఎల్ 0001)లో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రాఘవేంద్రరావు, అతడి అనుచరులు గిరీష్, మురళీకృష్ణను దమ్మపేటలోని మందలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రాఘవపై మరో 12 కేసులున్నాయని, వాటిపైనా దర్యాప్తు చేపట్టామని, బాధితులెవరైనా ముందుకొస్తే వారి ఫిర్యాదులనూ పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఎనిమిది మందిపై కేసు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భార్య, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన మండిగ నాగరామకృష్ణ (40)ను ఏ1గా చూపారు. ఏ2గా వనమా రాఘవేంద్రరావు, ఏ3గా రామకృష్ణ తల్లి సూర్యవతి, ఏ4గా అక్క మాధవి, తర్వాతి నిందితులుగా రాఘవకు సహకరించిన అనుచరులు ముక్తిని గిరీష్, దావా శ్రీని వాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలను చేర్చారు. ఇందులో రాఘవ, గిరీష్, మురళీకృష్ణలను అరెస్టు చేశామని, మిగతావారు పరారీలో ఉన్నారని చెప్పారు. రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క మాధవి శుక్రవారం వరకు మీడియాతో మాట్లాడగా.. వారు పరారీలో ఉన్నట్టు చూపడం గమనార్హం. క్యాంపు కార్యాలయంలోనే రాసలీలలు? కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి మహిళా ప్రజాప్రతినిధితో అత్యంత సన్నిహితంగా ఉండే రాఘవ.. ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఆమెతో గడిపారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసిన కొందరిని రాఘవ మచ్చిక చేసుకున్నారని సమాచారం. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. పోలీసులతో టచ్‌లోనే రాఘవ? ఐదు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రాఘవ.. గతంలో పాల్వంచలో పనిచేసిన కొం దరు పోలీసు అధికారులతో టచ్‌లోనే ఉన్న ట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారి సూచ నల ప్రకారమే.. రాఘవ వివిధ ప్రాంతాలు, సిమ్‌కార్డులు మారుస్తూ ఆచూకీ తెలియ కుండా జాగ్రత్తపడినట్టు ఓ పోలీసు అధికారి తెలి పారు. అయితే రాఘవ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవు తుండటంతో.. అతడికి సహకరించిన పోలీసులను ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించారని సమాచారం. ఈ క్రమంలో వారు ఇచ్చిన సమాచారంతోనే రాఘవను, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా.. ఈనెల 3న అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవ.. శుక్రవారం దాకా కూడా గిరీశ్‌కు చెందిన నెక్సాన్ (టీఎస్28ఎల్ 0001) కారులోనే తిరిగినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మహబూబాబాద్, వరంగల్‌తోపాటు ఖమ్మం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం. -
టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
-
టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెన్షన్
హైదరాబాద్: ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాఘవను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమా రాఘవేంద్రరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. వనమా అరాచకాలను చెబుతూ రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు రామకృష్ణ. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఏ భర్తకూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే వనమా రాఘవను సస్పెండ్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. -
వనమా రాఘవేందర్ అరెస్టుపై హైడ్రామా!
సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్రావు అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. కొత్తగూడెం పోలీసులు గురువా రం మధ్యాహ్నం రాఘవేందర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యేనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించారని, విచారణ నిమిత్తం రాఘవేందర్‌ను పోలీసులు కొత్తగూడెం తీసుకెళ్లారనే ప్రచారం సాగింది. కానీ రాత్రి వరకు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడి యాతో మాట్లాడిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్.. రాఘవేందర్ కోసం తెలంగాణ, ఏపీలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఆయన గత నేరచరిత్రనూ వెలికితీసి పాత కేసులకు సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఒకవేళ రాఘవేందర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేసినా గట్టిగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. కాగా, వీలైనంత త్వర లో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేసులో కీలకంగా కారు ఇదిలాఉంటే.. రామకృష్ణకు చెందిన కారు (ఏపీ 28 బీ2889) ఈ కేసును కీలక మలుపు తిప్పింది. భార్య, ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రామకృష్ణ.. తన కారులోనే ఆత్మహత్యకు కారణాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఫోన్‌ను అదే కారులో పెట్టారు. ఇటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు రామకృష్ణ కారు నుంచే లభ్యమైంది. ఫోన్, సూసైడ్ నోట్ తన తల్లి, సోదరికి చిక్కుతుందనుకున్నారో లేక మంటల్లో కాలి సాక్ష్యాలు పోలీసులకు దొరకవనుకున్నారో తెలియదు గానీ.. ఫోన్, సూసైడ్ నోట్‌ను కారులోనే ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
వనమా రాఘవ అరెస్ట్
-
వనమా రాఘవపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: భట్టి విక్రమార్క
-
నా కొడుకును పోలీసులకు అప్పగిస్తా: ఎమ్మెల్యే వనమా
సాక్షి, హైదరాబాద్: తన కొడుకు వనమా రాఘవపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు. రాఘవను నియోజకవర్గానికి, పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాఘవ విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. వనమా రాఘవను పోలీసులకు అప్పగించేందుకు సహకరిస్తానని తెలిపారు. పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకును అప్పగిస్తానని వెల్లడించారు. కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవపై తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. భార్య గురించి ఏ భర్త వినకూడని మాటలు రాఘవేందర్ నోటి నుంచి విన్నానంటూ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం తాజాగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం వనమా రాఘవ పరారీలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో వనమా రాఘవకు ఉచ్చు బిగుసుకుంటుండటంతో కొడుకు నిర్వాకంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తాజాగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. చదవండి: సంచలనం రేకెత్తిస్తున్న రామకృష్ణ సెల్ఫీ వీడియో.. -
అధికార పార్టీ ఎమ్మెల్యే రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?
సాక్షి, హైదరాబాద్: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన అందరిని కలిచి వేసిందని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత(సీఎల్పీ) లీడర్ భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు రాఘవ బెదిరింపులు తట్టుకోలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ధ్వజమెత్తారు. రామకృష్ణ తన ఆవేదనను సెల్ఫీ రూపంలో వివరించాడని పేర్కొన్నారు. గతంలోనే ఓ వ్యక్తి వనమా రాఘవ పేరు రాసి చనిపోయాడని గుర్తు చేశారు. ఆ రోజే వనమా రాఘవపై చర్యలు తీసుకుంటే ఈ రోజు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొని ఉండేది కాదన్నారు. ఇంత దారుణానికి కారణమైన రాఘవను ఇంతవరకు అరెస్టు చేయలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. వనమా రాఘవపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు రెచ్చిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ప్రజల మానప్రాణాలు కాపాడటం అధికారం యంత్రాంగం బాధ్యతనని పేర్కొన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్న దోషులను ప్రభుత్వం రక్షిస్తోందని మండిపడ్డారు. చదవండి: ఏ భర్తకూడా వినకూడని మాటలు విన్నాను.. -
‘జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడు’
-
‘జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడు’
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచలో కుటుంబం సజీవదహనం చేసుకున్న మండిగ రామకృష్ణ నివాసాన్ని మంగళవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. ఈ కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్‌ను కఠినంగా శిక్షించాలని, రాఘవ ఎన్ని దురాగతాలు చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. సంబంధిత వార్త: కుటుంబం ఆత్మహత్య కేసు.. సూసైడ్ నోట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారుడి పేరు? కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రామకృష్ణ కూతురిని చూసి చలించిపోయామని అన్నారు. జంతువుల కంటే హీనంగా వనమా రాఘవ ప్రవర్తిస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. వనమా రాఘవను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే షూట్ చేయాలని పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు. గతంలో ఎస్ఐ జ్యోతి, మలిపెద్ది వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు కారణం వనమా రాఘవ అని అన్నారు. పోలీసుల ఈ కేసు విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు. -
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై కేసు
సింగరేణి (కొత్తగూడెం): అటవీ శాఖాధికారుల విధులను ఆటంక పరిచారనే అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం కేసులు నమోదయ్యాయి. వనమాతోపాటు ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, పలువురు నాయకులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు అటవీ అధికారులు కందకాలు తవ్వారు. ఆ భూములకు పట్టాలు ఉన్నాయంటూ పలువురు సాగుదారులు అడ్డుకున్నారు . ఈ విషయాన్ని గిరిజనులు ఎమ్మెల్యే వనమా దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఘటన స్థలానికి చేరుకుని అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్పీ.రావు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీను, ఖానాముద్దీన్, లింబియాపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ వివరించారు. -
టార్గెట్ వందకు.. ఒకే అడుగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభలో టీఆర్ఎస్ బలం వందకు చేరువయింది. ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలతో కలిపి ‘గులాబీ’ ఎమ్మెల్యేలు 99 మంది అయ్యారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పక్షాన 88 మంది గెలుపొందగా, ఒక ఇండిపెండెంట్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తుపై గెలిచిన ఒక ఎమ్మెల్యే వెంటనే టీఆర్ఎస్లో చేరారు. రేగా కాంతారావు, ఆత్రం సక్కులతో మొదలైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసల సంఖ్య వనమాతో 8కి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో మొత్తం 99 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నట్టయింది. మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నేడో, రేపో తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరేందుకు సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అసెంబ్లీలో టీఆర్ఎస్ సెంచరీ పూర్తి కానుంది. ఫాంహౌజ్‌కు వనమా వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు శుక్రవారమే ప్రచారం జరిగింది. కానీ.. వనమా ధ్రువీకరించలేదు. ఉన్నట్టుండి ఆదివారం ఆయన ఎర్రవెల్లిలోని సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళ్లారు. అక్కడ సీఎంను కలిసిన అనంతరం తాను టీఆర్ఎస్లో త్వరలోనే చేరుతానని ప్రకటించారు. కాగా, వనమాకు మంత్రివర్గంలో బెర్తు లభించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా టీఆర్ఎస్లో జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్గంలో ఖమ్మం జిల్లాకు, మున్నూరు కాపు కులస్తులకు ప్రాతినిధ్యం లేదు. వనమాకు ఐదుసార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉంది. కేసీఆర్‌పై విశ్వాసంతోనే! : వనమా ‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళిక బద్ధంగా, చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తున్నారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని పదిలక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. ఎంతోకాలంగా ఉన్న కొత్తగూడెం జిల్లా డిమాండ్‌ను కేసీఆర్ నెరవేర్చారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం, కొత్త రహదారుల నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసింది. కేసీఆర్ నాయకత్వాన్ని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో బలపరిచారు. అత్యధిక మెజార్టీతో గెలిపించి రెండోసారి కూడా అధికారం అప్పగించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కొత్తగూడెం నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి నాకు ముఖ్యం. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయనపై విశ్వాసంతోనే టీఆర్ఎస్లో చేరుతున్నాను. నియోజకవర్గ ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను, శ్రేయోభిలాషులను సంప్రదించాకే అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను’అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆదివారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. -
పీఏసీ చైర్మన్‌గా వనమా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీకి లభించే ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్‌కు చెం దిన సీనియర్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన వనమా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత ఎక్కువ సార్లు గెలుపొందిన ముగ్గు రు ఎమ్మెల్యేల్లో సీనియర్ ఈయన. సీఎల్పీ నేతగా ఎస్సీ నాయకుడిని ఎంపిక చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా ఓసీ వర్గానికి చెందిన ఉత్తమ్ ఉండటంతో పీఏసీ చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయిస్తారని, ఆ కోటాలో బీసీల్లో సీనియర్ ఎమ్మెల్యే అయి న వనమాను ఈ పదవికి ఎంపిక చేస్తారని టీపీసీ సీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వా త కాంగ్రెస్ తరఫున ఎక్కువ సార్లు గెలిచిన సీని యర్ ఎమ్మెల్యేలకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం సాంప్రదాయంగా వస్తుంది. దీనిలో భాగంగా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచిన పి.కిష్టారెడ్డిని పీఏసీ చైర్మన్‌గా నియమిం చింది. అప్పటికే ఐదుసార్లు గెలిచిన రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నప్పటికీ ఈయన కంటే 13 ఏళ్ల ముందు ఎమ్మెల్యే అయిన కిష్టారెడ్డిని పీఏసీ చైర్మన్‌గా నియమించారు. ఆ తర్వాత కిష్టారెడ్డి చనిపోవడంతో రాంరెడ్డి వెంకటరెడ్డిని పీఏసీ చైర్మన్‌గా నియమిం చారు. వెంకటరెడ్డి కూడా అదే టర్మ్‌లో చనిపోవడంతో 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియర్ అయిన జె.గీతను ఆ పదవికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఐదుసార్లు గెలిచిన ఉత్తమ్‌ని ఈసారి పీఏసీ చైర్మన్ పదవికి ఎంపిక చేయాల్సి ఉం టుంది. ఉత్తమ్ ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాది. దీంతో ఈసారి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో సీనియర్లకు అవకాశం వచ్చింది. వీరిలో 4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో వనమా, సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. సబితా, శ్రీధర్‌బాబు పీఏసీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. వీరి కంటే సీనియర్ ఎమ్మెల్యే కావడంతో వనమాను పీఏసీ చైర్మన్‌గా నియమించే అవకాశముందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉపనేతగా రాజ్‌గోపాల్‌రెడ్డి.. సీఎల్పీ నాయకుడిగా భట్టి విక్రమార్క ను పార్టీ అధిష్టానం నిర్ణయించడంతో అసెం బ్లీలోని ఇతర పదవులపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఉపనేతలుగా ఎవరిని నియమిస్తారన్నది చర్చనీయాంశమైంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఉపనేత పదవి ఖరారైనట్టు తెలుస్తోం ది. ఆయనతో పాటు ఎస్టీ మహిళా కోటాలో సీతక్క, సీనియర్ ఎమ్మెల్యేగా సబిత, గండ్ర వెంకటరమణారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. సీఎల్పీ కార్యదర్శి, విప్ పదవులకు పార్టీ తరఫున పొడెం వీరయ్య, చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, జగ్గారెడ్డి, సుధీర్‌రెడ్డిలతో పాటు హరిప్రియా నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. -
కాంగ్రెస్ గెలుపునకు కృషి చేయాలి
సాక్షి,కొత్తగూడెం రూరల్: కొత్తగూడెంలో కాంగ్రెస్ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం పాల్వంచ, కొత్తగూడేనికి చెందిన టీఆర్ఎస్కు చెందిన యువతి, యువకులు వికలాంగులు భారీగా కాంగ్రెస్‌లో చేరారు. చేరిన వారికి వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవేంద్రరావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వనించారు. ఉదయ్ భాస్కర్ నాయకత్వంలో రామవరం, వనందాస్ గడ్డ, పునుకుల గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు, రత్నానాయక్ నాయకత్వంలో సుజాతనగర్ మండలంలోని సర్వారం గ్రామ పంచాయితీ గొపతండాకు చెందిన 50 కుటుంబాలు, పాత పాల్వంచ, బాబుక్యాంప్‌లో మల్లికార్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అభివృద్ధి జరగాలంటే చేతిగుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉద్యమనేత వలీబాబా, తూము చౌదరి, వాసిరెడ్డి మురళి, కనుకుంట్ల శ్రీను, యెర్రా కామేష్ తదితరులు పాల్గొన్నారు. రామాటాకీస్ ఏరియాలో.. పట్టణంలోని 16వ వార్డు రామాటాకీస్ ఏరియాలో ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్ధి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తు గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సత్యనారాయణ సింగ్, యూత్ బొందుగుల శ్రీదర్, విల్సన్‌బాబు, సయ్యద్ అహ్మద్, బొందుగుల జ్యోతి, సిర్ల ఉన్నారు. కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం పట్టణ పరిధిలోని 33వ వార్డులో కాంగ్రెస్ జిల్లా నాయకుడు రక్మాంగధర్ బండారి ఆధ్వర్యంలో వనమా వెంకటేశ్వరరావు విజయం కోరుతూ గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గోపు రవీందర్, రాజు, తిరుపతి, మహ్మద్ జాన్, మణికంఠ, మోఘనాధ్, రషీ, రాజు, దిపక్, నవీన్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. సీతంపేట గ్రామ పంచాయతీలో.. సుజాతనగర్: ప్రజాకూటమి బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరావు గెలుపును కాంక్షిస్తూ బుధవారం రాత్రి సీతంపేట గ్రామ పంచాయతీలో నాయకులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ బోడా హరినాయక్ మాట్లాడుతూ.. వనమా గెలుపున ఎవరూ ఆపలేరన్నారు. నాయకులు గుగులోత్ హరిదాస్, మత్రు, సక్రు, కృష్ణ, సురేష్ తదతరులు పాల్గొన్నారు. వనమా మనువరాళ్ల ప్రచారం పాల్వంచ: పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్, గాంధీనగర్, కేసీఆర్ నగర్, సోనియా నగర్, రాజీవ్ నగర్ కాలనీల్లో వనమా మనువరాళ్లు డాక్టర్ అలేఖ్య, హర్షిణి, మనీషా గురువారం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నేతాజీ, వసంత కుమార్, రేగళ్ల శ్రీను, జ్యోతి, శారద, రాంబాబు, సత్యం, ఆనంద్, కోటి, అక్బర్, వీరన్న, గణేష్, రాము, ప్రవీణ్, మహేష్, సురేష్, త్రిదేవ్, నిహాంత్ పాల్గొన్నారు. -
నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..అదే సందర్భంలో శాశ్వత శత్రువులూ కారనే నానుడికి కొత్తగూడెం నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు సత్యనారాయణ (చిన్ని) పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వీరందరిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు ఇక్కడినుంచి విజేతగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో వనమా వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎడవల్లి కృష్ణ, కూటమి నుంచి కూనంనేని సాంబశివరావులు ఓట్లను సాధించారు. ఈసారి మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉండటంతో అన్ని పార్టీలూ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ, మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా నిలిచిన కూనంనేని సాంబశివరావులు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకు సహకరించాల్సి వచ్చింది. మొదట టికెట్లు రాకపోవడంతో చాలా నిరుత్సాహం చెందినప్పటికీ..మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు వనమాకు మద్దతు ఇస్తున్నారు. కలిసిపనిచేసేందుకు స్నేహహస్తం చాటారు. -
పొత్తులతో బీసీలకు అన్యాయం చేస్తారా:వనమా
సాక్షి, హైదరాబాద్: పొత్తుల పేరుతో బీసీలకు అన్యాయం చేస్తారా అని కాంగ్రెస్ అదిష్టానాన్ని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు పరోక్షంగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విలేకరులతో వనమా మాట్లాడుతూ..మాజీ మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న తాను కూడా టికెట్ కోసం వేచి చూడాలా అని అడిగారు. కొత్తగూడెం టికెట్ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే టీఆర్ఎస్ను గెలిపించినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అభ్యర్థితో లాలూచీ పడే గత ఎన్నికల్లో డిపాజిట్ రాక ఐదో స్థానం నిలిచిన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం పట్టుబడుతున్నారని అన్నారు. తనకు కొత్తగూడెం టికెట్ ఇస్తే 30 వేల మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిపిన సర్వేల్లో కూడా 80 శాతం తనకే గెలుపు అవకాశాలున్నాయని చెప్పారు. కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మంలలో ఒక సీటు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు పరిధిలో రెండు స్ధానాలు బీసీలకు ఇస్తామన్న కాంగ్రెస్ అధిష్టానం తన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తన లాంటి సీనియర్లకే టికెట్ వస్తుందా రాదా అన్న స్పష్టత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. టికెట్ రాకపోయినా కొత్తగూడెం ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. -
కూటమి విజయం ఖాయం
పాల్వంచరూరల్/సుజాతనగర్: వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయ మని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వర్రావు అన్నారు. త్యా గాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని, దానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శనివారం సుజాతనగర్ నుంచి కొత్తగూడెం మీదుగా పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి వరకు 3000 మోటార్‌సైకిళ్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని అన్నారు. పోడు రైతులకు పట్టాలు, భూములను పంపిణీ చేస్తామంటూ రాజకీయ ఉనికి కోసం టీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడిస్తేనే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అ న్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉం టానని, తాను ఇక్కడే పుట్టా నని. తుదిశ్వాస వరకు ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చారు. గెలిచే అభ్య«ర్థులకే టికెట్ ఇవ్వాలని రాహుల్‌గాంధీ నిర్ణయించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తొలుత నాయకులగూడెం గ్రామంలోని అయ్యప్ప ఆలయం వద్ద కార్యకర్తలు వనమాకు ఘన స్వాగతం పలికారు. జై వనమా, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు జి.వి.భద్రం, మహిపతి రామలింగం, కొత్వాల శ్రీనివాసరావు, వనమా రాఘవేంద్రరావు, ఎస్వీఆర్కె. అచార్యులు, వనమా రామకృష్ణ, ఎంఏ రజాక్, కాసుల వెంకట్, అన్వర్, విజయ్,మురళి, రంజిత్, నందనాయక్, జెడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతిరావు, కాసుల ఉమారాణి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వీరయ్య, రెడ్డెం తులసిరెడ్డి, ఎంపీటీసీలు కట్టా నరసింహరావు, సువాలి, మోతి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల నామినేషన్లు
జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజవకర్గాలకు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైరాలో బాణోత్ మదన్‌లాల్, అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందులో డాక్టర్ రవిబాబు నాయక్, సత్తుపల్లిలో డాక్టర్ మట్టా దయానంద్ నామినేషన్ వేశారు. కొత్తగూడెంలో వనమా... కొత్తగూడెం, న్యూస్‌లైన్: కొత్తగూడెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో డి.అమయ్‌కుమార్‌కు నామినేషన్ పత్రం ఇచ్చారు. డమ్మీ అభ్యర్థిగా వనమా సతీమణి వనమా పద్మావతి నామినేషన్ వేశారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఐఎన్టీయూసీ నాయకులు జివి.భద్రం, న్యాయవాది పలివెల సాంబశివరావు పాల్గొన్నారు. వనమా పద్మావతి నామినేషన్ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్, నాయకులు కున్సోత్ ధర్మ తదితరులు పాల్గొన్నారు. వైరాలో మదన్‌లాల్... వైరా, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరా అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా బాణోత్ మదన్‌లాల్ బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి పోరిక మోహన్‌లాల్ స్వీకరించి, మదన్‌లాల్‌తో ప్రమాణం చేయించారు. భారీగా ర్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ అభ్యర్థిగా బాణోత్ మదన్‌లాల్ బుధవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా, స్థానిక శాంతినగర్ నుంచి పాత బస్టాండ్, క్రాస్ రోడ్, తల్లాడ రోడ్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ సాగింది. వైరా, కొణిజర్ల, ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రధానంగా పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు పాల్గొన్నారు. ర్యాలీ అగ్రభాగాన వాహనంలో పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ కళాజాతా క ళాకారులు ఆలపించిన గీతాలు, చేసిన నృత్యాలు, డప్పుల చప్పుడు ఆకట్టుకున్నాయి. అశ్వారావుపేటలో తాటి వెంకటేశ్వర్లు... అశ్వారావుపేట, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ సీపీ అశ్వారావుపేట నియోజకవర్గ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మధ్యాహ్నం పార్టీ కార్యాల యం నుంచి ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం, ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల ముఖ్య నాయకులు జూపల్లి రమేష్‌బాబు, కొల్లి రవికిరణ్, జూపల్లి ఉపేందర్‌బాబు, బత్తుల అంజి, శ్రీనివాస్ గౌడ్, పుష్పాల చందర్రావు, రాయి రవీందర్, కొడగండ్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.