సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేంద్రరావు (రాఘవ) కటకటాల్లోకి వెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి రాఘవపై ఐపీసీ సెక్షన్లు 302, 306, 307 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముద్దసాని నీలిమ ఎదుట హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ రాఘవకు 14 రోజులు రిమాండ్ విధించడంతో.. వెంటనే భద్రాచలం సబ్ జైలుకు తరలించారు.
తీవ్ర ఉత్కంఠ మధ్య..
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రాఘవను పాల్వంచలోని ఏఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని పోలీసు బలగాలు తమ అధీనంలోకి తీసుకుని.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాయి. శనివారం తెల్లవారుజాము నుంచే వనమా బాధితులు, ప్రజలు, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఏసీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
రాఘవను ఉరితీయాలని, లేదంటే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చేందుకు పాల్వంచ నుంచి కొత్తగూడేనికి పోలీసు వాహనంలో తీసుకొస్తున్న క్రమంలో.. కొత్తగూడెం శివారులోని బ్రిడ్జి వద్ద బీజేపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. రాఘవను ఎన్‌కౌంటర్ చేయాలని, కోర్టుకు తీసుకెళ్లి సమయం వృథా చేయొద్దని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరగగా.. పోలీ సులు, బీజేపీ శ్రేణులను చెదరగొట్టి ముందు కు కదిలారు. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చాక.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భద్రాచలం సబ్‌జైలు అధికారులకు అప్ప గించారు. రాఘవకు దుస్తులతో కూడిన సంచీని ఇచ్చారు. తొలిరోజు మొదటి బ్యారక్‌లో ఇతర ఖైదీలతో పాటే రాఘవను ఉంచినట్టు జైలువర్గాలు తెలిపాయి.
బాధితులు ముందుకు రావాలి
రాఘవను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చే ముందు ఏఎస్పీ రోహిత్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 7న కారు (నెక్సాన్– టీఎస్28ఎల్ 0001)లో ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రాఘవేంద్రరావు, అతడి అనుచరులు గిరీష్, మురళీకృష్ణను దమ్మపేటలోని మందలపల్లి క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. రాఘవపై మరో 12 కేసులున్నాయని, వాటిపైనా దర్యాప్తు చేపట్టామని, బాధితులెవరైనా ముందుకొస్తే వారి ఫిర్యాదులనూ పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు.
ఎనిమిది మందిపై కేసు
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకోవడంతోపాటు భార్య, ఇద్దరు పిల్లల చావుకు కారణమైన మండిగ నాగరామకృష్ణ (40)ను ఏ1గా చూపారు. ఏ2గా వనమా రాఘవేంద్రరావు, ఏ3గా రామకృష్ణ తల్లి సూర్యవతి, ఏ4గా అక్క మాధవి, తర్వాతి నిందితులుగా రాఘవకు సహకరించిన అనుచరులు ముక్తిని గిరీష్, దావా శ్రీని వాస్, రమాకాంత్, కొమ్ము మురళీకృష్ణలను చేర్చారు.
ఇందులో రాఘవ, గిరీష్, మురళీకృష్ణలను అరెస్టు చేశామని, మిగతావారు పరారీలో ఉన్నారని చెప్పారు. రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క మాధవి శుక్రవారం వరకు మీడియాతో మాట్లాడగా.. వారు పరారీలో ఉన్నట్టు చూపడం గమనార్హం.
క్యాంపు కార్యాలయంలోనే రాసలీలలు?
కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని ఓ మండల స్థాయి మహిళా ప్రజాప్రతినిధితో అత్యంత సన్నిహితంగా ఉండే రాఘవ.. ఇటీవల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే ఆమెతో గడిపారనే ప్రచారం టీఆర్‌ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ విషయం తెలిసిన కొందరిని రాఘవ మచ్చిక చేసుకున్నారని సమాచారం. ఈ విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.
పోలీసులతో టచ్‌లోనే రాఘవ?
ఐదు రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్న రాఘవ.. గతంలో పాల్వంచలో పనిచేసిన కొం దరు పోలీసు అధికారులతో టచ్‌లోనే ఉన్న ట్టు విశ్వసనీయంగా తెలిసింది. వారి సూచ నల ప్రకారమే.. రాఘవ వివిధ ప్రాంతాలు, సిమ్‌కార్డులు మారుస్తూ ఆచూకీ తెలియ కుండా జాగ్రత్తపడినట్టు ఓ పోలీసు అధికారి తెలి పారు. అయితే రాఘవ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవు తుండటంతో.. అతడికి సహకరించిన పోలీసులను ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించారని సమాచారం.
ఈ క్రమంలో వారు ఇచ్చిన సమాచారంతోనే రాఘవను, అతడి అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కాగా.. ఈనెల 3న అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవ.. శుక్రవారం దాకా కూడా గిరీశ్‌కు చెందిన నెక్సాన్ (టీఎస్28ఎల్ 0001) కారులోనే తిరిగినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో మహబూబాబాద్, వరంగల్‌తోపాటు ఖమ్మం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment