రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు.
పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం.
ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్‌మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య !
ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్‌మెన్ పోలీసులు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment