MLA Vanama Venkateswara Rao Filed Petition AT Supreme Court - Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. అనర్హత వేటుపై స్టే

Published Mon, Aug 7 2023 11:49 AM | Last Updated on Tue, Aug 8 2023 8:31 AM

MLA Vanama Venkateswara Rao Filed Petition AT Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ, రెండోస్థానంలోని జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీనిని సవాల్‌ చేస్తూ వనమా దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ దీపాంకర్‌దత్తాలతో కూడిన ధర్మాసనం విచారించింది.

వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీ మారినందున రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని జలగం తరఫు సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రినాయుడు కోరారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరగలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. వనమా విచారణకు హాజరుకాకపోవడం, ఆయా ఎన్నికల్లో సమర్పించిన ప్రమాణపత్రాల వివరాలు, ఒక భార్య ఉన్నారా లేదా ఇద్దరు భార్యలు ఉన్నారా తదితర అంశాలన్నీ పరిశీలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నందున వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతను కొనసాగించాలని దామా శేషాద్రినాయుడు కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన ధర్మాసనం ప్రతివాదులు జలగం వెంకట్రావు, తదితరులకు నోటీసులు జారీ చేసింది. అదనపు ఆధారాలు సమర్పించడానికి పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది హరీన్‌ రావెల్‌కు అనుమతించింది. ప్రతివాదులు రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలన్న ధర్మాసనం రిజాయిండర్‌కు మరో రెండు వారాలు గడువు ఇచ్చింది.      
చదవండి: సాత్నాల వాగులో రిమ్స్‌ పీజీ వైద్యుడి గల్లంతు.. మృతదేహం లభ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement