సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్‌రావు అరెస్టుపై హైడ్రామా కొనసాగుతోంది. కొత్తగూడెం పోలీసులు గురువా రం మధ్యాహ్నం రాఘవేందర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యేనే తన కుమారుడిని పోలీసులకు అప్పగించారని, విచారణ నిమిత్తం రాఘవేందర్‌ను పోలీసులు కొత్తగూడెం తీసుకెళ్లారనే ప్రచారం సాగింది. కానీ రాత్రి వరకు జిల్లా పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు.
గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడి యాతో మాట్లాడిన పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్.. రాఘవేందర్ కోసం తెలంగాణ, ఏపీలో ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఆయన గత నేరచరిత్రనూ వెలికితీసి పాత కేసులకు సంబంధించి స్టేట్‌మెంట్లు రికార్డ్ చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రౌడీషీట్ తెరుస్తామని వెల్లడించారు. ఒకవేళ రాఘవేందర్ బెయిల్ పిటిషన్ దాఖలుచేసినా గట్టిగా కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ చెప్పారు. కాగా, వీలైనంత త్వర లో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
కేసులో కీలకంగా కారు
ఇదిలాఉంటే.. రామకృష్ణకు చెందిన కారు (ఏపీ 28 బీ2889) ఈ కేసును కీలక మలుపు తిప్పింది. భార్య, ఇద్దరు పిల్లలతో సహా తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రామకృష్ణ.. తన కారులోనే ఆత్మహత్యకు కారణాలపై సెల్ఫీ వీడియో చిత్రీకరించారు. అనంతరం ఫోన్‌ను అదే కారులో పెట్టారు. ఇటు సూసైడ్ నోట్ కూడా పోలీసులకు రామకృష్ణ కారు నుంచే లభ్యమైంది. ఫోన్, సూసైడ్ నోట్ తన తల్లి, సోదరికి చిక్కుతుందనుకున్నారో లేక మంటల్లో కాలి సాక్ష్యాలు పోలీసులకు దొరకవనుకున్నారో తెలియదు గానీ.. ఫోన్, సూసైడ్ నోట్‌ను కారులోనే ఉంచి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment