
సింగరేణి (కొత్తగూడెం): అటవీ శాఖాధికారుల విధులను ఆటంక పరిచారనే అభియోగంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసులు నమోదయ్యాయి. వనమాతోపాటు ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, పలువురు నాయకులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ టి.కరుణాకర్ తెలిపారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్ వద్ద అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు అటవీ అధికారులు కందకాలు తవ్వారు. ఆ భూములకు పట్టాలు ఉన్నాయంటూ పలువురు సాగుదారులు అడ్డుకున్నారు
. ఈ విషయాన్ని గిరిజనులు ఎమ్మెల్యే వనమా దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఘటన స్థలానికి చేరుకుని అటవీ అధికారులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారంటూ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంఆర్‌పీ.రావు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు ఆయన తనయుడు వనమా రాఘవేంద్రరావు, మాజీ ఎంపీటీసీ పూనెం శ్రీను, ఖానాముద్దీన్, లింబియాపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ వివరించారు.