సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..అదే సందర్భంలో శాశ్వత శత్రువులూ కారనే నానుడికి కొత్తగూడెం నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు సత్యనారాయణ (చిన్ని) పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వీరందరిపై టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు ఇక్కడినుంచి విజేతగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో వనమా వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎడవల్లి కృష్ణ, కూటమి నుంచి కూనంనేని సాంబశివరావులు ఓట్లను సాధించారు.
ఈసారి మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉండటంతో అన్ని పార్టీలూ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ, మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా నిలిచిన కూనంనేని సాంబశివరావులు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకు సహకరించాల్సి వచ్చింది. మొదట టికెట్లు రాకపోవడంతో చాలా నిరుత్సాహం చెందినప్పటికీ..మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు వనమాకు మద్దతు ఇస్తున్నారు. కలిసిపనిచేసేందుకు స్నేహహస్తం చాటారు.
Comments
Please login to add a commentAdd a comment