kothhagudem
-
రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ప్రతి కార్మికుడు, ఉద్యోగి రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సేఫ్టీ జీఎం రాజీవ్‌కుమార్ కార్మికులను ఆదేశించారు. మంగళవారం ఏరియాలోని వర్క్ షాప్‌లో 51వ రక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణిలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, అందుకు కారణం ఉద్యోగులు రక్షణ సూత్రాలను పాటించటమేనని అన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ కమిటీకి డీవైజీఎం ప్రసాద్, ఏజీ ఎం కిషోర్‌గంగా స్వాగతం పలికారు. అనంతరం తనిఖీ కమిటీ వర్క్‌షాప్‌లోని వివిధ యంత్రాలు, పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం రాఘవేంద్రరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేజీ తివారీ, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీరజాక్, ఏజీఎంలు మోహన్‌రావు, పి.శ్రీనివాస్, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు రవి, కె.బ్రహ్మాచారి, వర్క్‌షాప్ ఇంజనీర్లు అనిల్, ఉపేందర్, వీరస్వామి, సంపత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పిట్ సెక్రటరీ, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..అదే సందర్భంలో శాశ్వత శత్రువులూ కారనే నానుడికి కొత్తగూడెం నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు సత్యనారాయణ (చిన్ని) పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వీరందరిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు ఇక్కడినుంచి విజేతగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో వనమా వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎడవల్లి కృష్ణ, కూటమి నుంచి కూనంనేని సాంబశివరావులు ఓట్లను సాధించారు. ఈసారి మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉండటంతో అన్ని పార్టీలూ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ, మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా నిలిచిన కూనంనేని సాంబశివరావులు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకు సహకరించాల్సి వచ్చింది. మొదట టికెట్లు రాకపోవడంతో చాలా నిరుత్సాహం చెందినప్పటికీ..మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు వనమాకు మద్దతు ఇస్తున్నారు. కలిసిపనిచేసేందుకు స్నేహహస్తం చాటారు. -
టిప్పర్ ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతి
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్ ఢీకొని రెండేళ్ల పాప మృతి చెందింది. జిల్లాలోని ఇల్లెందు మండలంలోని పొలారంలో టిప్పర్ ఢీకొని రెండేళ్ల పాప చనిపోయింది.. ఇంటి ముందు ఆడుకుంటున్న వినీత(2) అనే చిన్నారిని ప్రమాదవశాత్తూ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
మున్సిపల్ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం మంగళవారం ప్రారంభమైంది. బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవని, ప్రాధాన్యతా అంశాలను విస్మరించారని మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మీడియాను అనుమతించలేదు. ఎలాగైనా సరే, బడ్జెట్‌ను ఆమోదింపజేయాలని పాలకవర్గం పట్టుదలతో ఉంది. కాగా, తమను సమావేశంలోకి అనుమతించకపోవటంపై మీడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్దతుగా వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులు కార్యాలయం ఎదుట బైఠాయించారు.