koneru satyanarayana
-
అరగంటలో అన్ని సాంగ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీప్రసాద్
‘‘ఏ సినిమాని కూడా నేను నటునిగా చూడను.. ఒక ప్రేక్షకునిగా చూస్తాను. నేను కూడా మీలో(ఆడియన్స్) ఒక్కణ్ణే. ఓ ప్రేక్షకునిగా నాకు ‘ఖిలాడీ’ నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో రవితేజ అన్నారు. రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. వందశాతం కష్టాన్నే నమ్ముతాను. అయితే ఒకటి లేదా రెండు శాతం నాకు లక్ ఉండి ఉంటుంది.. ఆ మాత్రం లక్ కూడా లేకపోతే ఇక్కడి వరకు రాలేను. రమేష్ వర్మకి జాతకం, అదృష్టం శాతాలను పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరు ఉంటే కోనేరు సత్యానారాయణగారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మీనాక్షి, డింపుల్ హయతి భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్ అవుతారనే నమ్మకం ఉంది. నేను ‘ఖిలాడీ’ ఒప్పుకోవడానికి ఒక కారణం రచయిత శ్రీకాంత్ విస్సా, మరోకారణం సత్యనారాయణగారు. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆ క్రెడిట్ జీకే విష్ణుగారికి వెళ్తుంది’’ అన్నారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ ఖిలాడీ’ ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. కానీ 11న రిలీజ్ చేద్దామని ఐదు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాం. ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, బాలకృష్ణగార్లను ఆహ్వానించాం.. వారు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ‘ఖిలాడీ’తో రవితేజ వందశాతం పాన్ఇండియా హీరో అయిపోయారు. ఈ మూవీ చూస్తే రాజమౌళిగారి సినిమాలా అనిపించింది. రమేశ్ వర్మతో ఈ చిత్రం చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు. డైరెక్టర్ రమేష్ వర్మ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పిన 15 నిమిషాలకే సినిమా చేద్దామని చెప్పిన రవితేజకు థ్యాంక్స్. అరగంటలో అన్ని సాంగ్స్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. డింపుల్, మీనాక్షిలకు సమానమైన క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్నగ్యాప్ తర్వాత రవితేజగారితో వర్క్ చేశాను.‘ఖిలాడి’ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్స్ బాబీ, నక్కిన త్రినాథరావు, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటి అనసూయ పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డైరెక్టర్‌కు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక మంచి సక్సెస్ అయితే డైరెక్టర్స్‌కి హీరోలు, నిర్మాతల నుంచి బహుమతులు వస్తుంటాయి. కానీ రిలీజ్‌కు ముందే ఖిలాడి డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. మాస్‌రాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమా ఖిలాడి. ఫిబ్రవరి11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ విజయంపై ఇప్పటికే మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ రమేశ్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. కోటిన్నర రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
రాక్షసుడుని హిందీలో రీమేక్ చేయబోతున్నా
‘‘గత ఏడాది నా పుట్టినరోజుకి ‘రాక్షసుడు’ సినిమా హిట్‌తో ఉన్నా.. ఈ ఏడాది ఏం లేదు. కరోనా పరిస్థితులు లేకపోయుంటే కచ్చితంగా మరో హిట్‌తో ఉండేవాణ్ణి’’ అని దర్శకుడు రమేశ్ వర్మ పెన్మెత్స అన్నారు. ‘ఒక ఊరిలో, రైడ్, వీర, అబ్బాయితో అమ్మాయి, రాక్షసుడు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేశ్ వర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు. ►ఈ లాక్డౌన్లో ఇంట్లో కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాను. అయితే పని అనేది తప్పని సరి కావడంతో 10 రోజులుగా ఆఫీసుకు వెళుతున్నా. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ప్లాన్ చేయాలి కదా. ‘రాక్షసుడు’ సినిమా విడుదల తర్వాత నాకు నాలుగైదు అవకాశాలు వచ్చాయి. కానీ రవితేజగారితో చేయాలనుకోవడంతో ఆగాను. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు కూడా తొందరేం లేదు కంఫర్టబుల్‌గా చేద్దామన్నారు. తమిళ్లో హిట్ అయిన ఓ సినిమా రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ ఆ కథ కంటే ఇప్పుడు చేయబోయే సినిమా కథ రవితేజగారికి చాలా బాగుందని దీంతో ముందుకు వెళుతున్నాం. సెట్స్‌పైకి వెళ్లేందుకు బౌండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసిపెట్టుకున్నాం. ఇంతలో కరోనా వచ్చేసింది. ప్రస్తుతం చిన్న సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ పెద్ద చిత్రాలేవీ షూటింగ్స్ ప్రారంభించలేదు. అందరూ మొదలు పెడితే మేం కూడా సిద్ధమే. ►‘రాక్షసుడు’ హిందీ రీమేక్ హక్కులను కోనేరు సత్యనారాయణగారే తీసుకున్నారు. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహించాలన్నారాయన. రీమేక్‌లో నటించేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు. కానీ మేం ఎవర్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. రవితేజగారి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్లో ‘రాక్షసుడు’ రీమేక్ చేస్తా. ►నిర్మాతగా ‘7’ నా తొలి సినిమా. చిన్న చిత్రంగా తీద్దామనుకున్నాం. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదరడంతో పెద్ద సినిమా అయింది.. బడ్జెట్ కూడా పెరిగింది. దీంతో నా స్నేహితులు కూడా ప్రొడక్షన్లో భాగమయ్యారు. ఈ చిత్రం వల్ల నష్టంలేదు.. సేఫ్ ప్రాజెక్ట్.. నెట్ ఫ్లిక్స్‌లో ఇప్పటికీ ఆదరణ బాగుంది. ఆ సినిమా హిందీలో చేస్తే బాగుంటుందని నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఓ ప్రతిపాదన కూడా పెట్టారు. భవిష్యత్‌లో సినిమాలు నిర్మించాలా? వద్దా అన్నది నిర్ణయించుకోలేదు.. అవకాశాల్ని బట్టి వెళతా. -
ఆగలేదు
రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్లో ఈ సినిమా నిర్మిస్తామని నిర్మాత కోనేరు సత్యనారాయణ ఆ మధ్య ప్రకటించారు. అయితే లాక్డౌన్ కారణంగా సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆగాయి. దాంతో ఈ సినిమా ఆగిందనే వార్తలు మొదలయ్యాయి. అందులో నిజం లేదన్నారు కోనేరు సత్యనారాయణ. ‘‘ఈ సినిమాపై వస్తున్న వదంతులను నమ్మవద్దు. లాక్డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేస్తాం. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండే ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తాం’’ అన్నారు. -
కాంబినేషన్ కుదిరిందా?
‘రాక్షసుడు’ సినిమా సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు దర్శకుడు రమేష్ వర్మ. ఈ ఉత్సాహంలోనే తన నెక్ట్స్ సినిమా కోసం హీరో రవితేజకు కథ వినిపించారట. కథ నచ్చడంతో రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారట. ‘రాక్షసుడు’ సినిమాను కూడా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన సంగతి తెలిసిందే. గతంలో రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘వీర’ (2011) అనే చిత్రం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాదాపు 8 ఏళ్ల తర్వాత రవితేజ, రమేష్ కాంబినేషన్ కలవనుందన్న మాట. మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమాతో బిజీగా ఉన్నారు రవితేజ. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 20న విడుదల కానుంది. -
మా నమ్మకం నిజమైంది
‘‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించిన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మరో రెండు వారాల వరకూ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ‘ఏ స్టూడియోస్ బ్యానర్’పై తొలి చిత్రంగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. ఒరిజినల్ కంటెంట్‌లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్లు చేశాం’’ అన్నారు రమేష్ వర్మ. ‘‘ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కెరీర్లకు మంచి సినిమా ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి సినిమానే ‘రాక్షసుడు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్. -
కమలానికి ‘కొత్త’జోష్..!
సాక్షి, కొత్తగూడెంఅర్బన్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జిల్లాలోనూ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు కేడర్‌ను పెంచుకుంటూనే మరోవైపు జిల్లాలోని ఇతర పార్టీల నాయకులను బీజేపీలోకి చేర్చుకుంటోంది. దీంతో పార్టీ బలం మరింతగా పెరిగే అవకాశం ఉంది. సీనియర్ నాయకులతోపాటు ఇతర కేడర్ సైతం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని), ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య ఆదివారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నడ్డాతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వీరిరువురి చేరికతో జిల్లాలో బీజేపీకి కొంత బలం పెరిగిందని చెప్పవచ్చు. రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి జిల్లాలోనూ కేడర్‌ను పెంచుకోవడంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్కు రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ తామే గట్టి పోటీ అని చెప్పేందుకు చేరికలను ప్రోత్సహిస్తోంది. కిందిస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు మరిన్ని చేరికలను కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది. జిల్లాలో ఎలాగైనా బలమైన పార్టీగా ఎదిగేందుకు రాష్ట్ర పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. ఊకె అబ్బయ్య, కోనేరు సత్యనారాయణ ఆ పార్టీలో చేరడంతో జిల్లా పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కాగా ఈ ఇద్దరూ గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కొనసాగిన పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డారు. దీంతో రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న, కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపారు. వీరితోపాటు పలు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరు నాయకుల ఆధ్వర్యంలో భారీగా చేరికలు ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో టీడీపీ ఖాళీ..! తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి కోనేరు కుటుంబం ఆ పార్టీని అంటిపెట్టుకునే ఉంది. ప్రస్తుతం కోనేరు సత్యనారాయణ(చిన్ని) భారతీయ జనతా పార్టీలో చేరడంతో భద్రాద్రి జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయినట్టేనని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి ఆ పార్టీకి ప్రతినిద్యం వహించే నాయకుడు లేరని చెపుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు, ద్వితీయ స్థాయి క్యాడర్, పట్టణ, మండల స్థాయి నాయకులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. -
రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది
‘‘తెలుగు రాష్ట్రాల్లో ‘రాక్షసుడు’ సినిమా పేరు మార్మోగుతోంది. కొన్ని థియేటర్స్ కూడా పెంచాం. అనుకున్న ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్ నామా ఈ నెల 2న ఈ సినిమాని విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ–‘‘రాక్షసుడు’ బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. సాయిశ్రీనివాస్ ఇదివరకు హీరోయిజం ఉన్న సినిమాలు చేశారు. ‘రాక్షసుడు’ లో హీరో పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. రమేష్ వర్మ నా పేరును నిలబెట్టాడని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాను లెక్కలు వేసుకుని తీయలేదు. మంచి సినిమా తీశారని అందరూ ప్రశంసిస్తుంటే సంతృప్తిగా ఉంది. చేసే పనిలో మనం ఆనందం వెతుక్కుంటే డబ్బు దానంతటదే వస్తుంది’’ అన్నారు. ‘‘రాక్షసన్’కి ‘రాక్షసుడు’ పర్ఫెక్ట్ రీమేక్. రమేష్‌వర్మ సిన్సియర్‌గా తీశారు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘రాక్షసన్’ లాంటి సినిమాను ధైర్యంగా తెలుగులో రీమేక్ చేశారు రమేష్‌గారు. సాయి ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలి. ఈ సినిమా వందరోజుల వేడుకలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు నటి అమలా పాల్. ‘‘కొన్ని సినిమాలు కమర్షియల్‌గా హిట్ సాధిస్తాయి. మరికొన్ని విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంటాయి. మా సినిమాకు ఆ రెండూ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి శ్రీనివాస్. ‘ ‘తొలివారంలో ‘రాక్షసుడు’ చిత్రం దాదాపు 32కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సెకండ్వీక్లోనూ మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. బయ్యర్స్ హ్యాపీ’’ అన్నారు అభిషేక్ నామా. ‘‘సాయితో నేను బాగా నటింపజేశానని అందరూ అంటున్నారు.. కానీ సాయి అంత బాగా నటించాడు’’ అన్నారు రమేష్‌వర్మ. ‘‘సత్యనారాయణగారిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు నిర్మాత భరత్ చౌదరి. నిర్మాత మల్టీడైమెన్షన్ వాసు, కెమెరామేన్ వెంకట్ పాల్గొన్నారు. -
కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను
‘‘40 ఏళ్లుగా కేఎల్ యూనివర్శిటీలు నడిపిస్తున్నాం. హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్ కూడా ప్రారంభించాం. మా అబ్బాయి హవీష్ చేసిన ‘జీనియస్’కు నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాను. కానీ నిర్మాణంలో ఇన్వాల్వ్ కాలేదు. పూర్తిస్థాయి ప్రొడక్షన్లోకి వద్దామనుకొని ‘ఏ స్టూడియోస్’ బ్యానర్ స్థాపించాం’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రాక్షసుడు’. కేఎల్యు సంస్థల చైర్మన్ కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ చెప్పిన విశేషాలు. ► తమిళంలో ‘రాక్షసన్’ రిలీజ్ అయిన వారంలోనే చూశాను. గ్రిప్పింగ్‌గా ఉంది. మా అబ్బాయితో రీమేక్ చేయాలనుకున్నాను. అప్పటికే మావాడు థ్రిల్లర్ జానర్లో ‘7’ సినిమా చేస్తున్నాడు. దాంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బావుంటాడనుకున్నాం. సాయి శ్రీనివాస్ చాలా బాగా చేశాడు. ► ‘ఒరిజినల్లో ఉన్నదానికి ఒక్క సీన్ కూడా మార్చకుండా తీయండి’ అని దర్శకుడితో అన్నాను. ఉన్నది ఉన్నట్టు తీయడం కూడా కష్టమే! రమేష్ వర్మ చాలా కష్టపడ్డాడు. సినిమాను ఎలా తీయాలనుకున్నామో అలానే తీశాం. ► నా చిత్రాల్లో మెసేజ్ ఉండాల నుకుంటాను. ‘జీనియస్’లో హీరోలను, క్రికెటర్స్‌ను అభిమానించండి.. ఆరాధిం చొద్దని చెప్పాం. ‘రాక్షసుడు’లో ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం. ► కాలేజీలో ఒక పని చేయాలంటే చాలామంది ఉంటారు. ఒకరికి చెబితే పని అయిపోతుంది. షూటింగ్‌లోనూ అదే అప్లై చేశాను. సినిమా బిజినెస్ పూర్తయింది. థియేట్రికల్ రైట్స్ అభిషేక్ పిక్చర్స్ వాళ్లకి ఇచ్చేశాం. నెక్ట్స్ 2, 3 సినిమాలు అనుకుంటున్నాం. వాటిలో హవీష్‌తో ఓ సినిమా ఉంటుంది. ► ఎంటర్టైన్మెంట్ యూనివర్శిటీ స్థాపించాలనుకుంటున్నాను. ఆ యూనివర్శిటీలో సినిమా, టీవీ, యానిమేషన్, గ్రాఫిక్స్ అన్నీ నేర్చుకునేలా ఏర్పాటు చేస్తాం. -
జిల్లాలో టీడీపీ ఖాళీ ?
సాక్షి, కొత్తగూడెం : మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మరో రెండు వారాల్లో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిసేందుకు చిన్ని వెళ్లారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న కోనేరు చిన్నిని వేదికపైకి పిలిచినా ఆయన స్టేజీ ఎక్కలేదు. బీజేపీలో చేరే విషయంలో మరోసారి ఆలోచించి.. వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తానని ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. ఏది ఏమైనా కోనేరు సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అయినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ హవా తగ్గిపోవడంతో జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గతంలోనే టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు సత్యనారాయణ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను కాంగ్రెస్‌కు కేటాయించారు. దీంతో మనస్తాపానికి గురైన కోనేరు.. అప్పుడే మరో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం బలంగా సాగింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చిన్నిని ప్రత్యేకంగా అమరావతికి పిలిపించి బుజ్జగించారు. ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తే టీటీడీ బోర్డులోకి తీసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. కానీ అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఆపార్టీ ప్రాబల్యం తగ్గడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో పార్టీని చూసుకోక తప్పడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్ని టీడీపీని వీడితే ఇక జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైనట్టేనని, జిల్లాలో ఆ పార్టీకి నాయకత్వం వహించేవారు ఇక లేనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..అదే సందర్భంలో శాశ్వత శత్రువులూ కారనే నానుడికి కొత్తగూడెం నియోజకవర్గం నిదర్శనంగా నిలుస్తోంది. 2014 ఎన్నికల్లో మహాకూటమి తరఫున సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు సత్యనారాయణ (చిన్ని) పోటీలో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వనమా వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. వీరందరిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు ఇక్కడినుంచి విజేతగా నిలిచారు. తర్వాతి స్థానాల్లో వనమా వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ఎడవల్లి కృష్ణ, కూటమి నుంచి కూనంనేని సాంబశివరావులు ఓట్లను సాధించారు. ఈసారి మహాకూటమిలో కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితి ఉండటంతో అన్ని పార్టీలూ మహాకూటమి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించబడిన వనమా వెంకటేశ్వరరావుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో గత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోనేరు సత్యనారాయణ, మహాకూటమి సీపీఐ అభ్యర్థిగా నిలిచిన కూనంనేని సాంబశివరావులు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వనమా వెంకటేశ్వరరావుకు సహకరించాల్సి వచ్చింది. మొదట టికెట్లు రాకపోవడంతో చాలా నిరుత్సాహం చెందినప్పటికీ..మహాకూటమి ఐక్యతను కాపాడేందుకు వనమాకు మద్దతు ఇస్తున్నారు. కలిసిపనిచేసేందుకు స్నేహహస్తం చాటారు. -
డబుల్ ధమాకా
రమేశ్ వర్మ నిర్మాణ సారథ్యంలో ఏ స్టూడియోస్ పతాకంపై కె.ఎల్. యూనీవర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణ ‘ఏరువాక, 16 ఫ్లస్’ చిత్రాలను నిర్మిస్తున్నట్లు తన పుట్టినరోజు (అక్టోబర్ 20) సందర్భంగా వెల్లడించారు. ‘‘రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న క్యూట్ లవ్‌స్టోరీ ‘ఏరువాక’. రెండు యువ జంటల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. రమేశ్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు కెమెరామేన్. యుక్తవయసులో ఉన్న ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు కలిసి చేసే ఓ ప్రయాణ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘16 ఫ్లస్’. రమేశ్ వర్మ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు చిత్రాలకూ చేతన్ భరద్వాజ్ స్వరకర్త. ఇవి కాకుండా ఇద్దరు స్టార్ హీరోలతో చేయబోయే సినిమాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు కోనేరు సత్యనారాయణ. -
టీడీపీ నేత కోనేరు దీక్ష భగ్నం
కొత్తగూడెం: పెండింగ్‌లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా కొత్తగూడెం బస్టాండు సెంటర్లో టీడీపీ నేత కోనేరు సత్యనారాయణ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దీక్షా స్థలిని ఒక్కసారిగా చుట్టుముట్టిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
మంచి సినిమా తీస్తే... విజయం గ్యారెంటీ : కోనేరు సత్యనారాయణ
‘‘తొలి చిత్రం ‘నువ్విలా’, మలి చిత్రం ‘జీని యస్’తో మంచి నటుడనిపించుకున్న హవీష్ ఈ చిత్రంలో అన్ని రకాల రసాలూ పలికించి, భేష్ అనిపించుకున్నాడు. హవీష్‌కి ఇంకా మంచి సినిమాలు రావాలి’’ అని దర్శకుడు బి. గోపాల్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత కాంబినేషన్లో కోనేరు సత్యనారాయణ సమర్పణలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్ లీల’. లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి శ్రీపురం కిరణ్ దర్శకుడు. ఈ చిత్ర విజయోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘200 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలక్షన్స్‌తో విజయవంతంగా సాగుతోంది. హవీష్ ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతాడని నిరూపించిన చిత్రం ఇది. అభిజిత్, నందితల నటన కూడా ప్రధాన ఆకర్షణైంది’’ అన్నారు. మంచి సినిమా తీస్తే సక్సెస్ చేస్తారని మరోసారి ప్రేక్షకులు నిరూపించారని కోనేరు సత్యనారాయణ అన్నారు. హవీష్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని రామ్ పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడే ఎగ్జయిట్ అయ్యా. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చింది’’ అన్నారు. శ్రీపురం కిరణ్, విస్సు, లంకాల బుచ్చిరెడ్డి, ‘మల్టీ డైమన్షన్’ వాసు, నందిత తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ బెజవాడ అభ్యర్థిగా కోనేరు సత్యనారాయణ?
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్ రంగంలోకి దిగగానే తెలుగుదేశం నేతల వెన్నులో చలి పుడుతోంది. దీంతో ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న కేశినేని శ్రీనివాస్ (నాని)ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చాపకిందనీరులా పనిచేస్తున్న కేశినేని వ్యతిరేక వర్గం ఇప్పుడు తమ కార్యక్రమాల స్పీడు మరింత పెంచాయి. చంద్రబాబుతో సత్యనారాయణ భేటీ కేఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణను కేశినేని నాని వ్యతిరేక వర్గం రంగంలోకి దింపింది. ఆయన చంద్రబాబుతో ఇటీవల భేటీ అయ్యారు. ఇప్పటికే కోనేరు రాజేంద్ర ప్రసాద్ పలు సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లోకి దూసుకువెళుతున్న నేపథ్యంలో ఆయన్ను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ విజయం సాధించేందుకు అయ్యే ఖర్చును మీరు భరించగలరా? అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా, అందుకు సిద్ధంగా ఉన్నానని సత్యనారాయణ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడాలంటూ చంద్రబాబు సూచించినట్లు సమాచారం. కేశినేనిని అసెంబ్లీకి పరిమితం చేస్తారా? చంద్రబాబు పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు కేశినేని నాని ఆర్థికంగా ఉపయోగించుకున్న చంద్రబాబునాయుడు ఆయన్ను అసెంబ్లీకి పరిమితం చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇదే విషయాన్ని కేశినేని నాని వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అసెంబ్లీకి కేశినేని నాని అంగీకరించకపోతే, తరువాత మరో విధంగా ఆయనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.