రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది | Koneru Satyanarayana thanks everyone who supported Rakshasudu | Sakshi
Sakshi News home page

రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది

Published Mon, Aug 12 2019 12:35 AM | Last Updated on Mon, Aug 12 2019 12:35 AM

Koneru Satyanarayana thanks everyone who supported Rakshasudu - Sakshi

వాసు, అమలాపాల్, సాయి శ్రీనివాస్, రమేష్‌ వర్మ, కోనేరు సత్యనారాయణ, అభిషేక్‌ నామా, మారుతి

‘‘తెలుగు రాష్ట్రాల్లో ‘రాక్షసుడు’ సినిమా పేరు మార్మోగుతోంది. కొన్ని థియేటర్స్‌ కూడా పెంచాం. అనుకున్న ఫలితాన్ని సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’. రమేష్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించారు. అభిషేక్‌ నామా ఈ నెల 2న ఈ సినిమాని విడుదల చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ–‘‘రాక్షసుడు’ బాగుందని అందరూ అంటుంటే సంతోషంగా ఉంది.

మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. సాయిశ్రీనివాస్‌ ఇదివరకు హీరోయిజం ఉన్న సినిమాలు చేశారు. ‘రాక్షసుడు’ లో హీరో పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. రమేష్‌ వర్మ నా పేరును నిలబెట్టాడని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాను లెక్కలు వేసుకుని తీయలేదు. మంచి సినిమా తీశారని అందరూ ప్రశంసిస్తుంటే సంతృప్తిగా ఉంది. చేసే పనిలో మనం ఆనందం వెతుక్కుంటే డబ్బు దానంతటదే వస్తుంది’’ అన్నారు. ‘‘రాక్షసన్‌’కి ‘రాక్షసుడు’ పర్‌ఫెక్ట్‌ రీమేక్‌.

రమేష్‌వర్మ సిన్సియర్‌గా తీశారు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘రాక్షసన్‌’ లాంటి సినిమాను ధైర్యంగా తెలుగులో రీమేక్‌ చేశారు రమేష్‌గారు. సాయి ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలి. ఈ సినిమా వందరోజుల వేడుకలో పాల్గొనాలని ఉంది’’ అన్నారు నటి అమలా పాల్‌. ‘‘కొన్ని సినిమాలు కమర్షియల్‌గా హిట్‌ సాధిస్తాయి. మరికొన్ని విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంటాయి. మా సినిమాకు ఆ రెండూ వచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సాయి శ్రీనివాస్‌. ‘

‘తొలివారంలో ‘రాక్షసుడు’ చిత్రం దాదాపు 32కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. సెకండ్‌వీక్‌లోనూ మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి. బయ్యర్స్‌ హ్యాపీ’’ అన్నారు అభిషేక్‌ నామా. ‘‘సాయితో నేను బాగా నటింపజేశానని అందరూ అంటున్నారు.. కానీ సాయి అంత బాగా నటించాడు’’ అన్నారు రమేష్‌వర్మ. ‘‘సత్యనారాయణగారిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు నిర్మాత భరత్‌ చౌదరి. నిర్మాత మల్టీడైమెన్షన్‌ వాసు, కెమెరామేన్‌ వెంకట్‌  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement