టీడీపీ బెజవాడ అభ్యర్థిగా కోనేరు సత్యనారాయణ?
సాక్షి, విజయవాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్రప్రసాద్ రంగంలోకి దిగగానే తెలుగుదేశం నేతల వెన్నులో చలి పుడుతోంది. దీంతో ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న కేశినేని శ్రీనివాస్ (నాని)ని పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చాపకిందనీరులా పనిచేస్తున్న కేశినేని వ్యతిరేక వర్గం ఇప్పుడు తమ కార్యక్రమాల స్పీడు మరింత పెంచాయి.
చంద్రబాబుతో సత్యనారాయణ భేటీ
కేఎల్ యూనివర్సిటీ అధినేత కోనేరు సత్యనారాయణను కేశినేని నాని వ్యతిరేక వర్గం రంగంలోకి దింపింది. ఆయన చంద్రబాబుతో ఇటీవల భేటీ అయ్యారు. ఇప్పటికే కోనేరు రాజేంద్ర ప్రసాద్ పలు సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లోకి దూసుకువెళుతున్న నేపథ్యంలో ఆయన్ను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. పార్టీ విజయం సాధించేందుకు అయ్యే ఖర్చును మీరు భరించగలరా? అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా, అందుకు సిద్ధంగా ఉన్నానని సత్యనారాయణ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడాలంటూ చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
కేశినేనిని అసెంబ్లీకి పరిమితం చేస్తారా?
చంద్రబాబు పాదయాత్ర నుంచి ఇప్పటి వరకు కేశినేని నాని ఆర్థికంగా ఉపయోగించుకున్న చంద్రబాబునాయుడు ఆయన్ను అసెంబ్లీకి పరిమితం చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. ఇదే విషయాన్ని కేశినేని నాని వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం. అసెంబ్లీకి కేశినేని నాని అంగీకరించకపోతే, తరువాత మరో విధంగా ఆయనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.