![Ramesh verma talks about rakshasudu movie - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/08/22/Rakshasudu.jpg.webp?itok=Fd3VgCG2)
కోనేరు సత్యనారాయణ, అనుపమ , రమేష్ వర్మ
‘‘రాక్షసుడు’ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. ఆడపిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సందేశాత్మకంగా చూపించిన సినిమా ఇది’’ అన్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘రాక్షసుడు’. ఆగస్టు 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘పిల్లల నుంచి పెద్దల వరకు ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. మరో రెండు వారాల వరకూ వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మా ‘ఏ స్టూడియోస్ బ్యానర్’పై తొలి చిత్రంగా తెరకెక్కిన ‘రాక్షసుడు’ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు మా నమ్మకం నిజమైంది. ఒరిజినల్ కంటెంట్‌లోని అంశాలను మిస్ చేయకుండా మనకు తగ్గట్లు చేశాం’’ అన్నారు రమేష్ వర్మ. ‘‘ఆర్టిస్టులు, టెక్నీషియన్‌ల కెరీర్‌లకు మంచి సినిమా ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటుంది. అలాంటి సినిమానే ‘రాక్షసుడు’’ అన్నారు అనుపమా పరమేశ్వరన్.
Comments
Please login to add a commentAdd a comment