‘‘ఏ సినిమాని కూడా నేను నటునిగా చూడను.. ఒక ప్రేక్షకునిగా చూస్తాను. నేను కూడా మీలో(ఆడియన్స్) ఒక్కణ్ణే. ఓ ప్రేక్షకునిగా నాకు ‘ఖిలాడీ’ నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుందని నమ్ముతున్నాను’’ అని హీరో రవితేజ అన్నారు. రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘నేను జాతకాన్ని, అదృష్టాన్ని పెద్దగా నమ్మను. వందశాతం కష్టాన్నే నమ్ముతాను. అయితే ఒకటి లేదా రెండు శాతం నాకు లక్ ఉండి ఉంటుంది.. ఆ మాత్రం లక్ కూడా లేకపోతే ఇక్కడి వరకు రాలేను. రమేష్ వర్మకి జాతకం, అదృష్టం శాతాలను పెంచాలనిపిస్తోంది. ఆ జాతకానికి, అదృష్టానికి ఓ పేరు ఉంటే కోనేరు సత్యానారాయణగారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మీనాక్షి, డింపుల్ హయతి భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్ అవుతారనే నమ్మకం ఉంది. నేను ‘ఖిలాడీ’ ఒప్పుకోవడానికి ఒక కారణం రచయిత శ్రీకాంత్ విస్సా, మరోకారణం సత్యనారాయణగారు. ఈ సినిమాలో నేను బాగున్నాను అంటే ఆ క్రెడిట్ జీకే విష్ణుగారికి వెళ్తుంది’’ అన్నారు.
కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘ ఖిలాడీ’ ఈ నెల 18న విడుదల చేద్దామనుకున్నాం. కానీ 11న రిలీజ్ చేద్దామని ఐదు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నాం. ప్రీ రిలీజ్ వేడుకకి చిరంజీవి, బాలకృష్ణగార్లను ఆహ్వానించాం.. వారు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. ‘ఖిలాడీ’తో రవితేజ వందశాతం పాన్‌ఇండియా హీరో అయిపోయారు. ఈ మూవీ చూస్తే రాజమౌళిగారి సినిమాలా అనిపించింది. రమేశ్ వర్మతో ఈ చిత్రం చేసినందుకు గర్వపడుతున్నా’’ అన్నారు.
డైరెక్టర్ రమేష్ వర్మ మాట్లాడుతూ – ‘‘కథ చెప్పిన 15 నిమిషాలకే సినిమా చేద్దామని చెప్పిన రవితేజకు థ్యాంక్స్. అరగంటలో అన్ని సాంగ్స్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్. డింపుల్, మీనాక్షిలకు సమానమైన క్యారెక్టర్స్ ఉంటాయి. నాకు అవకాశం ఇచ్చిన సత్యనారాయణగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘చిన్నగ్యాప్ తర్వాత రవితేజగారితో వర్క్ చేశాను.‘ఖిలాడి’ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ఈ వేడుకలో నిర్మాత దాసరి కిరణ్ కుమార్, డైరెక్టర్స్ బాబీ, నక్కిన త్రినాథరావు, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, నటి అనసూయ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment