మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గత మూడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు నేడు తెర పడనుంది. ‘కొత్తగూడెం’ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల మధ్య నడుస్తున్న కేసులో మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ కొత్తగూడెం బీఆర్‌ఎస్ పార్టీలో నెలకొంది.
వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు..
సుప్రీం కోర్టును ఆశ్రయించిన వనమా
2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావులు పోటీ చేశారు. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావుపై వనమా వెంకటేశ్వరావు 4,139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత వనమా గెలుపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 2019లో జలగం కేసు దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వనమా తప్పుడు వివరాలు సమర్పించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగేళ్లపాటు విచారణ కొనసాగిన కేసులో 2023 జూలై 25న తీర్పు వచ్చింది. వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
రెబల్‌గా జలగం..
కొత్తగూడెం ఎమ్మెల్యే అనర్హత కేసులో ఇరువర్గాలు సుప్రీం కోర్టులో కౌంటర్లు దాఖలు చేశారయి. ఆగస్టు, సెప్టెంబర్‌లో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో తీర్పును అక్టోబరు 31కి న్యాయస్థానం రిజర్వ్ చేసి ఉంచింది. నేడు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు వనమా వెంకటేశ్వరావుకు ప్రతికూలంగా వస్తే, పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయనే చర్చ బీఆర్‌ఎస్ పార్టీలో జోరుగా కొనసాగుతోంది.
మరోవైపు జలగం వెంకట్రావు అభ్యంతరాలను న్యాయస్థానం తోసి పుచ్చితే, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జలగం మద్దతుదారులు బీఆర్‌ఎస్ రెబల్‌గా జలగం కొత్తగూడెం బరిలో ఉండటం ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ మీద కొత్తగూడెం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది.
వనమాకు అండగా కేసీఆర్
హైకోర్టు తీర్పు వెలువడ్డాక విపత్కర పరిస్థితుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ప్రగతి భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకుని పార్టీ తరఫున అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. దీంతో అప్పటివరకు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌లో కొనసాగుతూ వస్తోన్న గ్రూపు రాజకీయాలు సద్దుమణిగాయి.
ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రత్యేకంగా నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. సీఎం కేసీఆర్ తిరిగి వనమాకే టికెట్ కేటాయించడంతోపాటు బీ ఫామ్‌ను అందించారు. కేసీఆర్ ప్రోత్సాహంతో వనమా ఇప్పటికే ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ ‘ఇవే తనకు చివరి ఎన్నికలు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. అంటూ కోరుతున్నారు. 5న కొత్తగూడెంలో సీఎం హాజరయ్యే బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవి చదవండి: ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment