జిల్లా ఎన్నికల అధికారితో మాట్లాడుతున్న వ్యయ పరిశీలకులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేస్తున్నామని, వాహనాలను నిశిత పరిశీలన చేస్తూ నగదు, మద్యం, ఇతర వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వివరించారు. కలెక్టర్‌తో శనివారం ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్, అజయ్‌లాల్ చంద్‌లు కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
జిల్లాలోని పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలకు అజయ్‌లాల్ చంద్, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు సంజీబ్‌కుమార్ పాల్ వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ని కల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించినట్లు తెలిపారు.
సెన్సిటివ్ నియోజకవర్గాలైన ఇల్లెందు, కొత్తగూడెంలలో అదనపు సహా వ్యయ పరిశీలకులను, వీడియో వ్యూయింగ్ టీంలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫిర్యాదులకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లా సరిహద్దుగా ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, ఇతర వస్తువులు రాకుండా చర్యలు తీసుకున్నామని, చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఖర్చులు పక్కాగా నమోదు చేయాలి..
అభ్యర్థుల ఖర్చులు కచ్చితంగా నమోదు చేయాలని ఎన్నికల వ్యయపరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల వ్యయ, ఎంసీఎంసీ, ఆబ్కారీ, ఆదాయపన్ను శాఖ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో పాటించాల్ని విషయాలను సోదాహరణంగా వివరించారు.
పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలి!
నిరంతర పర్యవేక్షణతో పెయిడ్ న్యూస్‌ను గుర్తించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీబ్‌కుమార్ పాల్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజూ వివిధ దినపత్రికలు, శాటిలైట్ చానల్స్, కేబుల్, సిటీ కేబుల్, సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థుల ప్రచారాలను పరిశీలించాలని చెప్పారు. గుర్తించిన పెయిడ్ న్యూస్, ప్రకటనలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల ద్వారా అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలన్నారు.
జిల్లాలో చెక్‌పోస్టుల వద్ద కొనసాగుతున్న పర్యవేక్షణను, సీసీ కెమెరాల రికార్డింగ్ పనితీరును పరిశీలించారు. సీ విజిల్ వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారాలు, ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీి టీముల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పినపాక రిటర్నింగ్ అధికారి ప్రతీక్‌జైన్, వ్యయ నియంత్రణ నోడల్ అధికారులు వెంకటేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, లైజన్ అధికారులు సంజీవరావు, సీతారాంనాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, ఎంసీఎంసీ నోడల్ అధికారి, డీపీఆర్వో ఎస్.శ్రీనివాసరావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లెందులో..
ఎన్నికల వ్యయ పరిశీలకులు సంజీవ్‌కుమార్ పాల్, అజయ్ లాల్‌చంద్ సోనేజీ శనివారం ఇల్లెందులో పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంల అకౌంటింగ్ బృందాన్ని కలుసుకున్నారు.
ఇవి చదవండి: జంప్ జిలానీలు..! ఉన్న నేతలు ఎప్పుడో ఏ పార్టీలో చేరుతారో?
Comments
Please login to add a commentAdd a comment