‘మూడు’ ఎలా ఉంటుందో..? చివరి నిమిషం వరకు చిక్కుల్లో సీపీఐ.. | - | Sakshi
Sakshi News home page

‘మూడు’ ఎలా ఉంటుందో..? చివరి నిమిషం వరకు చిక్కుల్లో సీపీఐ..

Published Sun, Nov 5 2023 12:16 AM | Last Updated on Sun, Nov 5 2023 1:06 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ నేడు జాబితాను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. భద్రాద్రి జిల్లాలో ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కొత్తగూడెం సీపీఐకి..?
ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించి నెల రోజులు గడిచినా ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొత్తగూడెంతోపాటు మరో సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్‌తో కలిసి నడవబోమంటూ మరోవైపు సీపీఐ ప్రకటించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే సీపీఐ జాతీయ నాయకత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరినట్టు గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకే వదిలేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. అయితే సీపీఐ విధించిన ఇతర షరతులపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇల్లెందు, అశ్వారావుపేటలలో వీడని పీటముడి..
ఇల్లెందు, అశ్వారావుపేట సీట్లపై పీటముడి ఇంకా వీడటం లేదు. ఇల్లెందు నుంచి టికెట్‌ ఆశిస్తున్న జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. శనివారం నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. అయితే ఈ సీటును బంజరా సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్‌ బలంగా తెర మీదకు వచ్చింది.

కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌తోపాటు శంకర్‌నాయక్‌, డాక్టర్‌ రవి, ప్రవీణ్‌నాయక్‌, చీమల వెంకటేశ్వర్లు తదితర నేతలు ఈ టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రకటించబోయే మూడో జాబితాలో టికెట్‌ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు జారే ఆదినారాయణ, సున్నం నాగమణిలు టికెట్‌ ఆశిస్తున్నారు. తమకే టికెట్‌ దక్కుతుందనే అంచనాల్లో వీరంతా నమ్మకాలు పెట్టుకున్నారు.

అజ్ఞాతంలోకి సీపీఐ కౌన్సిలర్లు!
చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్‌, సీపీఐల మధ్య ఎన్నికల పొత్తు విషయంలో సయోధ్య కుదిరిందనేలోగా మరో సమస్య ఆ పార్టీకి ఎదురైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు ఇంకా పట్టు వీడలేదు. ఆ పార్టీకి మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఐదుగురు కౌన్సిలర్లు శనివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్లకు కూడా స్పందించడం లేదు.

వీరంతా ఆదివారం కొత్తగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు తప్పుడు ప్రచారమంటూ ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు ప్రచారంలోకి రాగానే మరోసారి కాంగ్రెస్‌ నేతలు పొత్తులపై ఆసక్తికర కామెంట్లను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ పార్టీనే బరిలో ఉంటుందంటూ వారు ఆ పోస్టుల్లో పేర్కొంటున్నారు.
ఇవి చదవండి: ఇల్లెందులో.. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement