ఆర్‌ ట్యాక్స్‌ నిజమైతే ఐటీ, ఈడీలను పంపించు | BRS chief KCR at Kothagudem roadshow | Sakshi
Sakshi News home page

ఆర్‌ ట్యాక్స్‌ నిజమైతే ఐటీ, ఈడీలను పంపించు

Published Wed, May 1 2024 5:03 AM | Last Updated on Wed, May 1 2024 5:03 AM

BRS chief KCR at Kothagudem roadshow

కొత్తగూడెం రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌  

ఉత్త ఆరోపణలు చేయడం ఎందుకని ఆగ్రహం... చోటేభాయ్, బడేభాయ్‌ ఇద్దరూ ఒక్కటే 

బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే నీళ్లు, నిధులు  

గోదావరి నీటిని తరలించుకుపోయేందుకు కుట్రలు 

కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గోదావరిలో వేసినట్టే 

కొత్త జిల్లాల రద్దుకు ప్రయత్నిస్తున్నారు 

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నేడు తెలంగాణలో ఆర్‌ ట్యాక్స్‌ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి వసూళ్లు మొదలెట్టాడని ప్రధాని మోదీ అన్నారని..అవినీతి జరిగిందని తెలిస్తే ఐటీ, ఈడీలను రంగంలోకి దించాలి కానీ ఉత్త ఆరోపణలు చేయడం ఎందుకని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కొత్తగూడెంలో జరిగిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు.

 చోటేభాయ్, బడేభాయ్‌ ఇద్దరూ ఒక్కటేనని, బయటకు మాత్రం వేర్వేరు అన్నట్టుగా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీరికి ఓటేస్తే గోదావరి నీళ్లు మనకు దక్కవని, మోటర్లకు మీటర్లు వస్తాయని హెచ్చరించారు. ఈ రెండు పార్టీ లకు ఓటేస్తే గోదావరిలో పడేసినట్టేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న గోదావరి నీటిని తమిళనాడుకు తరలించుకుపోయేందుకు ప్రధాని నరేంద్రమోదీ కుట్రలు చేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు.

 ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజీ కట్టి ఈ నీటిని ఎత్తుకుపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. మన బతుకుదెరువు, మన జీవన్మరణ సమస్య అయిన గోదావరి నీటిని తీసుకుపోతాం అంటుంటే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 

కొత్తగూడెం జిల్లా ఉండాలా? వద్దా?  
ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా.. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, ఆ తర్వాత రాష్ట్రాన్ని అంధకారం చేస్తోందని విమర్శించారు. కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఈ జిల్లా ఉండాలా? వద్దా ? అంటూ కేసీఆర్‌ ప్రశ్నించారు. 

తాము అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు రూ.10వేలు అందిస్తే కాంగ్రెస్‌ పార్టీ రూ.15,000 ఇస్తామని చెప్పిందని, కల్యాణలక్ష్మి ద్వారా తాము ఆర్థికసాయం అందిస్తే, దానికి అదనంగా తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేస్తే కాంగ్రెస్‌ ఎన్నికల హామీలో రూ. రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని, మరి ఈ రోజు ఎంతమందికి రైతుబంధు అందింది, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు, రుణమాఫీ ఎంత అమలు చేశారు.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ప్రాంతాల్లో త్రీఫేస్‌ కరెంట్‌ ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతున్నాయన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్‌ ఎక్కడ కాటకలిసిందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. కానీ కాంగ్రెస్‌ పాలనలో గురుకులాల్లో కలుíÙత ఆహారం తిని భువనగిరిలో ఓ విద్యార్థి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

సింగరేణిపై కుట్రలు చేస్తారు  
కేంద్రంలో అధికారంలో ఉన్న బడేభాయ్‌ ఆదేశాల మేరకు ఇక్కడి చోటే భాయ్‌ సింగరేణి మీద కుట్రలు చేసే ప్రమాదం ఉందని కేసీఆర్‌ హెచ్చరించారు. గతంలో ఆ్రస్టేలియా నుంచి అదాని దిగుమతి చేసుకున్న బొగ్గు కొనాలంటూ ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి చేసినా ‘మాకు సింగరేణి బొగ్గు ఉంది.

అదాని బొగ్గు అవసరం లేదు. ఒక్క టన్ను కూడా కొనను’అంటూ తెగేసి చెప్పానని కేసీఆర్‌ తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశిస్తే.. నా తలకాయ తెగిపడ్డా మోటార్లకు మీటర్లు పెట్టనంటూ రైతుల ప్రయోజనాలు కాపాడిన చరిత్ర తనకు ఉందన్నారు. 

మత విద్వేషాలు రేపుతున్నారు.. 
తెలంగాణలో మత సామరస్యానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని కేసీఆర్‌ చెప్పారు. తమ హయాంలో ఏ ఒక్కరోజూ మత కలహాలు జరగలేదని గుర్తు చేశారు. కానీ ఈ రోజు హిందూ, ముస్లిం అంటూ విద్వేషాలు రేపుతున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ అంత దరిద్రమైన పాల న చేసిన మరో నేత లేడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య పంచాయితీలు పెట్టి ఓట్లు దండుకోవడం తప్ప మరేం లేదన్నారు.  

బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే నిధులు.. 
గోదావరి నీళ్లు తెలంగాణకు దక్కాలన్నా, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావాలన్నా, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టొద్దన్నా రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీనే గెలిపించాలని కేసీఆర్‌ కోరారు.

ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్‌ నుంచి మాలోతు కవిత గెలిస్తేనే ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుంటామని చెప్పారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించానన్నారు. ‘జబ్‌తక్‌ తెలంగాణా మే కేసీఆర్‌ హై, తబ్‌తక్‌ సెక్యులర్‌ రియాసత్‌ రహేగా’అంటూ మైనారిటీలకు హామీ ఇచ్చారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement