నేను గేట్లు తెరిస్తే.. బీఆర్‌ఎస్‌ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Fires On BRS | Sakshi
Sakshi News home page

నేను గేట్లు తెరిస్తే.. బీఆర్‌ఎస్‌ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి

Published Tue, Mar 12 2024 12:51 AM | Last Updated on Tue, Mar 12 2024 4:45 AM

CM Revanth Reddy Fires On BRS - Sakshi

సోమవారం భద్రాచలంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, సీతక్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్, కొండా సురేఖ

మామాఅల్లుడు, తండ్రీకొడుకులే మిగులుతారు

మణుగూరు ప్రజాదీవెన సభలో సీఎం

మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలు 

ఈ తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఈసడించుకున్నారు 

అందుకే నాకు టచ్‌లోకి వస్తున్నారు.. అండగా ఉంటామంటున్నారు 

మీ పిల్లి శాపాలకు ప్రభుత్వం కూలిపోదు

6 గ్యారంటీల్లో  ఇప్పుడు ఐదో హామీ అమలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్‌ఎస్, బీజేపీ కలసి కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర చేస్తున్నాయని.. ఆ కుటిల ప్రయత్నాలను తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోకి వస్తున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను ఒక్కసారి గేట్లు ఎత్తానంటే బీఆర్‌ఎస్‌లో తండ్రీకొడుకులు, మామా అల్లుడు తప్ప ఎవరూ మిగలరని వ్యాఖ్యానించారు.

ఎక్కడ గుచ్చితే ఎక్కడ దిగుతుందో కూడా తెలుసని, తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్‌ నిర్వహించిన ప్రజాదీవెన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. సభలో రేవంత్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

 ‘‘పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేత లక్ష్మణ్‌ ఎలా అంటారు? కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? బీఆర్‌ఎస్, బీజేపీ కలసి కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నాయి. వారి కుటిల ప్రయత్నాలను తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నాకు టచ్‌లోకి వచ్చారు.

తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్‌ను కలవడం వీలుకాకపోయేదని.. మీరు సామాన్యులను కలుస్తూ ప్రజాపాలన తెచ్చారని నాకు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోకుండా తాము అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నాకు హామీ ఇచ్చారు. ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాకు మద్దతుగా నిలుస్తూ ఈ సభకు వచ్చారు. నేను ఒక్కసారి గేట్లు ఎత్తానంటే బీఆర్‌ఎస్‌లో తండ్రీకొడుకులు, మామా అల్లుడు తప్ప ఎవరూ మిగలరు. మాతో అనవసరంగా గోక్కోవద్దు, గోక్కున్నోళ్లు ఎవరూ బాగుపడలేదు. 

కుమ్మక్కు రాజకీయాలు.. 
బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ నాలుగు స్థానాలు, బీజేపీ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా.. అందులో ఒక పార్టీ అభ్యర్థిని ప్రకటించిన స్థానంలో ఇంకో పార్టీ ప్రకటించలేదు. ఆయా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసుకునేలా రెండు పారీ్టలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి.

సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌తోపాటు కవిత పోటీచేసిన నిజామాబాద్, కీలకమైన సికింద్రాబాద్‌ వంటి స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇంకా ఎందుకు ప్రకటించలేదో చెప్పాలి. మోదీ, కేడీ కలసి కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించిన వారు.. ఇప్పుడు ఈ బహిరంగ సభలో కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు వింటే గుండె ఆగి చస్తారు. 

అదే పనిగా విమర్శలు 
ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంటే.. అవేమీ చూడకుండా మా ప్రభుత్వంపై కేటీఆర్‌ సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నారు. ఉట్టి మీద పాల కోసం పిల్లి శాపాలు పెడితే ఉట్టి తెగదన్నట్టు.. అధికారం మీద యావతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద కేటీఆర్‌ అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన రెండో రోజునే రెండు హామీలు అమలు చేశాం. ఇప్పుడు భద్రాచలం సీతారాముల సాక్షిగా ఐదో హామీని అమలు చేస్తున్నాం. 

అందుకే భద్రాచలంలో ప్రారంభించాం.. 
తూర్పునే సూర్యుడు ఉదయిస్తాడు. అందుకే రాష్ట్రానికి తూర్పు దిక్కున ఉన్న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాం. గతంలో కేసీఆర్‌ ఇందిరమ్మ ఇళ్లు డబ్బా ఇళ్లంటూ విమర్శలు చేశారు. అన్ని హంగులతో డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మాటలు చెప్రారు. కానీ పేదలెవరికీ ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారు. పేదలు సొంతింటి ముందు దర్జాగా నిలబడాలన్నదే మా లక్ష్యం. అందుకే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించాం..’’ అని రేవంత్‌ వెల్లడించారు. 

గృహ నిర్మాణశాఖను పటిష్టం చేస్తున్నాం: మంత్రులు 
స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వం కట్టని విధంగా లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను గత కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టించిందని ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరు చెప్పి గృహ నిర్మాణ శాఖను పూర్తిగా నిరీ్వర్యం చేసిందన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం గృహ నిర్మాణశాఖను పటిష్టం చేస్తోందని చెప్పారు.

కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్‌ ప్లాంట్‌ను నిర్మించి ఈ ప్రాంతానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమన్నారు. ఇక రాబోయే 35 రోజులు కార్యకర్తలు కష్టపడితే కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు తథ్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సేవకులుగా ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement