కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి
అర్హులందరికీ అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా?.. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
ఆగస్టు 15కల్లా రైతుల రుణమాఫీ చేస్తా.. హరీశ్‌రావు
రాజీనామా లేఖ రెడీగా ఉంచుకో.. కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతల రాయుడిలా మాట్లాడుతున్నారు
తెలంగాణలో ఆయన పని అయిపోయినట్లే!
బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారింది
కాంగ్రెస్ గెలవకూడదంటూ ఆ రెండు పార్టీల ఉమ్మడి కుట్ర
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగంలో మార్పులు
కొత్తగూడెం, వనపర్తి జిల్లా కొత్తకోటలో సీఎం ప్రసంగం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఈ నెల 8వ తేదీలోగా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని.. లేకుంటే 9వ తేదీన అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పి, ముక్కు నేలకు రాస్తానని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. మరి అర్హులందరికీ రైతు భరోసా సొమ్ము అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు. ఆగస్టు 15 నాటికల్లా రైతుల రుణమాఫీ చేస్తామని.. హరీశ్‌రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ రెడీ పెట్టుకోవాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్ మధ్య ఫైనల్స్ జరగనున్నాయని.. తెలంగాణ చాంపియన్‌గా నిలవాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభ, వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లలో రేవంత్ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా మీద రూ.ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లారు. ఈరోజు ఆయన రైతు భరోసా ఇవ్వలేదంటూ విమర్శలు చేస్తున్నారు. మేం రైతు భరోసా స్కీంను డిసెంబర్‌లోనే మొదలుపెట్టాం. రాష్ట్రంలో మొత్తం 69లక్షల మంది రైతులు ఉండగా.. ఇప్పటికే 65 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ చేశాం. మిగతా 4 లక్షల మంది ఖాతాల్లో ఈనెల 8వ తేదీలోగా రైతుబంధు తప్పకుండా జమ చేస్తాం.
ఏ ఒక్క రైతు ఖాతాలోనైనా రైతుబంధు జమ కాలేదని నిరూపిస్తే.. అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతా. అర్హులందరికీ రైతుబంధు అందితే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సిద్ధమా? రాష్ట్రంలో కరెంటు కోతలంటూ కేసీఆర్ కోతలరాయుడిలా మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఆయన పని అయిపోయింది. దింపుడు కల్లం ఆశలు పెట్టుకోవడం కూడా వృథా.
మే 13న ఫైనల్స్
డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ లాంటివి. ప్రజలు బీఆర్‌ఎస్‌ను మట్టికరిపించి కాంగ్రెస్‌ను ఆదరించారు. మే 13న తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీమ్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచి తెలంగాణ చాంపియన్‌గా నిలవాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలి.
హరీశ్ రాజీనామాతో రెడీగా ఉండు..
బీఆర్‌ఎస్ పాలనలో 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడేళ్లయినా ఇవ్వలే. తునకలుగా ఇస్తే ఆ పైసలు మిత్తికి కూడా చాలలేదు. నేను అలా సోయి లేనోడిని కాదు. కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా.. ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేస్తా. హరీశ్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని సిద్ధంగా ఉండు. రైతులకు బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వాతంత్య్రం ఇప్పిస్తా.. సిద్దిపేటకు నీ నుంచి విముక్తి కల్పిస్తా.
బీజేపీకి వాత పెట్టాలి
రాష్ట్ర విభజనపై ప్రధాని హోదాలో మోదీ మాట్లాడుతూ.. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ తెలంగాణను అవమానించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఐటీఐఆర్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ట్రిపుల్ ఐటీ, గిరిజన వర్సిటీ.. ఇలా ఏమీ ఇవ్వకుండా గాడిద గుడ్డు చేతిలో పెట్టిన బీజేపీ ఓటేద్దామా..? లేక కర్రు కాల్చి వాతపెడదామా ప్రజలే చెప్పాలి. బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లుగా బీజేపీకి బీ టీమ్‌గా పనిచేస్తూనే ఉంది. అందుకే కాంగ్రెస్ గెలవొద్దని బీఆర్‌ఎస్, బీజేపీ కలసి కుట్రలు చేస్తున్నాయి.
ఎవరిని చెప్పుతో కొట్టాలి?
రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్లని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు అంటున్నారు. నిన్ననే బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగం ప్రియాంబుల్ (ప్రవేశిక)ను మార్చేస్తామన్నారు. మరి ఇప్పుడు దుష్యంత్™ కుమార్‌ను చెప్పుతో కొట్టాలా? అబద్ధాలు చెప్తున్న నేతలను చెప్పుతో కొట్టాలా? ఎవర్ని కొట్టాలో బీజేపీ నేతలే చెప్పాలి. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. ఆ పార్టీ దేశ ప్రజల నెత్తిపై వేలాడుతున్న కత్తి లాంటిది.
పాలమూరు బిడ్డపై కుట్ర..
‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, పాలమూరు బిడ్డను సీఎంగా ఎన్నుకుని 150 రోజులు కాలేదు. అప్పుడే దిగిపొమ్మని అంటున్నారు. ఢిల్లీ నుంచి పడగొడతామని బయలుదేరుతున్నారు. రేవంత్‌రెడ్డి నా మీద పగబట్టిండని డీకే అరుణమ్మ అంటోంది. నీకు, నాకు గెట్టు పంచాయతీ ఏముంది? ప్రజల దీవెన, సోనియమ్మ ఆశీర్వాదంతో నాకు సీఎం పదవి వచ్చింది. కానీ నన్ను దించేందుకు, ఢిల్లీ పోలీసులతో అరెస్ట్ చేసేందుకు అమిత్ షాతో మాట్లాడి స్కెచ్ వేస్తోంది. నేనేం తప్పు చేశా? బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్నదని చెప్పిన. ఆ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను లోపలేసి అయినా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అంటున్నారు.’’
ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదు
కొత్తగూడెం సభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ప్రసంగించారు.
– బ్రిటీషర్లకు ఎదురు నిలిచిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని, తెలంగాణ సీఎంపై బెదిరింపులకు పాల్పడుతున్న ఢిల్లీ సుల్తానులకు బెదిరేది లేదని భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ హయాంలో సింగరేణికి తీరని నష్టం వాటిల్లిందన్నారు.
– బీజేపీ రాముడిని రాజకీయాల్లోకి తెచ్చి నాలుగు అక్షింతలు చల్లి ఊరుకుందే తప్ప చేసిందేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సీఎంగా ఏనాడూ ఖమ్మం జిల్లాకు రాని కేసీఆర్.. ఇప్పుడు ఎన్నికల కోసం వచ్చి కల్లి»ొల్లి కబుర్లు చెప్తున్నారని విమర్శించారు.
– రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నవారికి ఈ ఎన్నికలు ఓ రెఫరెండం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దమ్ముంటే యోధుడైన రేవంత్‌ను టచ్ చేసి చూడాలని ప్రత్యర్థి పారీ్టలకు సవాల్ విసిరారు.
– పాలమూరు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్నికలు జరగబోతున్నాయని కొత్తకోట కార్నర్ మీటింగ్‌లో మహబూబ్‌నగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment