కరువుకు, కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటి?: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

కరువుకు, కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటి?: సీఎం రేవంత్‌రెడ్డి

Published Wed, Apr 3 2024 4:56 AM | Last Updated on Wed, Apr 3 2024 12:06 PM

CM Revanth Reddy Fires On KCR - Sakshi

కేసీఆర్‌ పాపాల వల్లే వరుణ దేవుడు పారిపోయాడు

చనిపోయిన ఆ 200 మంది వివరాలివ్వండి 

ఏ ఊరిలో ఏ రైతు చనిపోయాడో 48 గంటల్లో నివేదిక ఇవ్వండి 

నిజంగా రైతులైతే ఆదుకుంటాం... కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ 

6న జరిగే కాంగ్రెస్‌ జనజాతర సభ ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో చనిపోయిన రైతుల వివరాలు ఇవ్వాలని, చనిపోయిన వారు నిజంగా రైతులే అయితే వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు సవాల్‌ విసిరారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే.. ఏ ఊరిలో? ఏ రైతు చనిపోయాడో? 48 గంటల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు.

ఎన్నికల తర్వాత వారి కుటుంబాలను సచివాలయానికి పిలిపించి మాట్లాడటమే కాకుండా వారిని ఆదుకునేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. తుక్కుగూడ రాజీవ్‌ ప్రాంగణంలో ఈ నెల 6న తెలంగాణ జనజాతర పేరిట జరగనున్న కాంగ్రెస్‌ మహాసభ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వంద రోజుల కాంగ్రెస్‌ పాలనలో 200 మంది రైతులు చనిపోయినట్లుగా కేసీఆర్‌ చెబుతున్నారంటూ ఓ విలేకరి ప్రస్తావించగా సీఎం స్పందించారు.  

వర్షాకాలంలో వానలు పడకే కరువు 
‘80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు వానాకాలం ఎప్పుడొస్తుందో.. చలికాలం ఎప్పుడు వస్తుందో తెలియదా? కరువుకు, కాంగ్రెస్‌కు సంబంధం ఏమిటి? కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది చలికాలంలో. చలికాలంలో వర్షాలు కురుస్తాయా? వర్షాకాలంలో వానలు పడక పోవడం వల్ల ప్రస్తుతం కరువొచ్చింది. కేసీఆర్‌ పాపాల వల్లే వరుణ దేవుడు భయపడి పారిపోయాడు. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయడం సమంజసమా?..’అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

64 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు నగదు వేశాం 
‘వంద రోజులు కాలేదు. కానీ అప్పుడే అది చేయలేదు. ఇది చేయలేదని అంటున్నారు. వంద రోజుల్లోనే 64,75,000 మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు వేశాం. 69 లక్షల ఖాతాలు ఉండగా, ఇప్పటికే 64 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేశాం. అసెంబ్లీలోనే ఈ లెక్కలు బయట పెట్టా. నువ్వు వస్తావని ఆశించా. కానీ రాకుండా పారిపోయావు. లెక్కల్లో తప్పులు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమే..’అని సీఎం అన్నారు. 

30 సెకన్లు కూడా కరెంటు పోలేదు 
‘సూర్యాపేటలోని ఏ సబ్‌స్టేషన్‌లోనూ 30 సెకన్లు కూడా కరెంట్‌ పోలేదు. ఆయన పెట్టుకున్న మైకుకు జనరేటర్‌ ఉంది. దానిలో ఎవరు వేలు పెట్టారో ఎవరికి తెలుసు? పదేళ్లు ప్రతి పక్షంలో ఉన్నాం. ఏ ఒక్క రోజైనా మమ్మల్ని బయటికి వెళ్లనిచ్చావా? ప్రతిపక్షాల గొంతులు నొక్కి, గొర్రెలను ఈడ్చుకెళ్లినట్లుగా ఈడ్చుకెళ్లి జైళ్లలో పెట్టించావు. కానీ మేము ప్రతిపక్ష నేతకు పూర్తి రక్షణ కల్పించాం. ప్రజా సమస్యలపై తొలిసారిగా బయటికి వచ్చావు. కనీసం ఇలాగైనా పాపాలు కడుక్కుంటారని అనుమతి ఇచ్చాం..’అని రేవంత్‌ ఎద్దేవా చేశారు. 

రూ.100 కోట్లు పంచినా సానుభూతి వచ్చేది 
‘పలు రకాల కమీషన్ల రూపంలో వచ్చిన రూ.1,500 కోట్లు నీ ఖాతాల్లో ఉన్నాయి. ఆ పాపపు సొమ్ములో రూ.100 కోట్లు పంచినా..ప్రజలకు మేలు జరిగేది. రైతుల పట్ల నీకు సానుభూతి ఉందని ప్రజలు అనుకునేవారు. ప్రజల పంట ఎండిపోతే..దాన్నుంచి కూడా ఎన్నికల్లో లబ్ధి పొందాలని నక్కజిత్తుల వేషాలు వేశావు. పొగ పెడితే ఎలుకలు బయటికి వచ్చినట్లు..ఎన్నికలనే పొగ పెట్టడంతో కేసీఆర్‌ బయటికి వచ్చాడు. లేదంటే ఆయన ఫాం హౌస్‌ కూడా దాటి వచ్చేవాడు కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఆగమాగమవుతుండు..’అని సీఎం వ్యాఖ్యానించారు.  

కూలగొట్టిన సంసారాన్ని నిలబెడుతున్నాం 
‘వరికోతలు ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే 700కు పైగా ఐకేపీ కేంద్రాలు తెరిపించాం. నీలాగా క్వింటాల్‌కు 10 కేజీలు కోత కోసే అలవాటు లేదు. ఎవరైనా అలా చేస్తే వారి తిత్తి తీస్తాం. నీలాగా మేము కమీషన్ల దందా చేయం. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక అభివృద్ధి ప్రాజెక్టుకు క్లియరెన్స్, నిధులు తీసుకొచ్చామే కానీ నీలాగా కమీషన్ల కోసం పని చేయలేదు.

రాష్ట్రంలో కూలగొట్టిన సంసారాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రూ.22,500 కోట్లతో ఇళ్లులేని పేదలకు ఇళ్లు ఇచ్చాం. ఆడ బిడ్డల కళ్లల్లో సంతోషాన్ని చూసి ఆయన కడుపులో నిప్పులు పోసుకుంటున్నాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదన్నట్లు, కేసీఆర్‌ శాపనార్థాలు మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవు. కేసీఆర్‌ చెల్లని రూ.1,000 నోటు లాంటి వాడు. చెల్లని వెయ్యిని జేబులో పెట్టుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం..’అని రేవంత్‌ అన్నారు.  

తాగునీటి సరఫరాకు ప్రణాళికలు 
‘నేను ఫాం హౌస్‌లో పడుకోవట్లే.. సినిమా వాళ్ల గెస్ట్‌ హౌసుల్లో పడుకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా పునరుద్ధరించాలనే అంశంపై చర్చిస్తున్నాం. తాగు నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. హైదరాబాద్‌ నగరానికి సరిపడా తాగునీరు ఇస్తున్నాం. కృష్ణా జలాలు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజీకి వెళ్లాయి.

ఈ నేపథ్యంలో వచ్చే 90 రోజులకు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..’అని ముఖ్యమంత్రి తెలిపారు. తుక్కుగూడ వేదికగా జాతీయ స్థాయిలో ఐదు గ్యారంటీలను కాంగ్రెస్‌ ప్రకటించనుందని చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, జూన్‌ 9న రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతోందని అన్నారు. సభకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలని రేవంత్‌ పిలుపునిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement