నిజామాబాద్, ఆర్మూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
రాజ్యాంగంలో మార్పులు, రిజర్వేషన్ల రద్దుకు మోదీ ప్రభుత్వ కుట్ర
బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే!
బిడ్డ బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు
69 లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము వేశాం.. ఆగస్టు 15 నాటికి రైతుల రుణాల మాఫీ కూడా చేసి చూపిస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాజ్యాంగాన్ని మార్చి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్నది మోదీ ప్రభుత్వ కుట్ర అని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ గెలిచి రాజ్యాంగాన్ని మారిస్తే.. దేశం నియంత పాలనలోకి వెళుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేడీ ఒక్కటేనని.. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని పేర్కొన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత బెయిల్ కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు.
బుధవారం నిజామాబాద్, ఆర్మూర్‌లలో నిర్వహించిన రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘రైతు భరోసా ఇస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానన్న కేసీఆర్‌కు సిగ్గులేదు. 69 లక్షల మంది రైతుల ఖాతాలు చూస్తే డబ్బులు జమ అయిన విషయం తెలుస్తుంది. మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు? రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సవాల్ చేశారు. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి.. సిద్దిపేటకు పట్టిన శని హరీశ్‌రావును వదిలిస్తా. రాజీనామా రాసిపెట్టుకో హరీశ్‌రావు.. రైతులకు ధాన్యానికి రూ.500 బోనస్‌తోపాటు ఎర్రజొన్నలు, మొక్కజొన్న, సోయాకు గిట్టుబాటు ధరలు ఇస్తాం.
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాం. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఇప్పటికే ఉపసంఘం వేశాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చెరుకు రైతులకు రూ.47 కోట్ల బకాయిలు విడుదల చేస్తాం. ఎంపీ అర్వింద్ చెప్తున్న పసుపుబోర్డు కాగితాలకే పరిమితమైంది. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తానని మాటిచ్చి తప్పిన కవితను ప్రజలు ఓడించి అర్వింద్‌ను గెలిపించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన అర్వింద్ తేలేకపోయారు. పైగా షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రధాని మోదీ మళ్లీ అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి. మేం తప్పకుండా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం.
రాజ్యాంగాన్ని మార్చితే ప్రజలు ఊరుకోరు
2021లోనే చేయాల్సిన జనగణన చేపట్టకుండా ప్రధాని మోదీ కుట్ర చేశారు. బీసీల కులగణనకు మోదీ ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలి. రాజ్యాంగాన్ని మార్చి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ కుట్రలో భాగమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నచ్చినట్టు మార్చాలని చూస్తే జనం చూస్తూ ఊరుకోరు. రాజ్యాంగాన్ని మారిస్తే దేశం నియంత పాలనలోకి వెళుతుంది. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రమాదం మెడ మీద కత్తిలా వేలాడుతోంది. అందుకే దేశ ప్రజలు బీజేపీని గొయ్యి తీసి పాతిపెట్టాలి.
అభివృద్ధి అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు
రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, నల్లగొండలో ఐఐటీ, మెదక్‌లో ఐఐఎం ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చింది. కానీ మోదీ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. చక్కెర కర్మాగారం అడిగితే గాడిద గుడ్డు ఇచ్చారు.
దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి..
దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడి ఫొటోలు చూపించి ఓట్లడిగేవారిని బిచ్చగాళ్లు అంటారు. రామాలయం ప్రతిష్టకు 15 రోజుల ముందే అక్షింతలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్షింతలు ముందే పంపిణీ చేయడం హిందూ సంప్రదాయం కాదు. బీజేపీ నాయకులు దేవుడిని, ప్రజలను మోసం చేస్తున్నారు..’’ అని రేవంత్ ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment