
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుట్టు చంద్ర బాబు చేతిలో ఉంది.. చంద్రబాబు జుట్టు ప్రధాని మోదీ చేతిలో ఉందన్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమమంలో పసుపు బోర్డును ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..‘కవిత విషయంలో మాట్లాడవద్దని రేవంత్‌కు సుపప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా ఆయన మారలేదు. మరోసారి కోర్టు చీవాట్లు పెట్టాలేమో. ఇక, ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ భేటీ అయిన తర్వాతే ఆంధ్రకు నీటి తరలింపు జరుగుతోంది. రేవంత్ రెడ్డి జుట్టు చంద్రబాబు చేతిలోనే ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు జుట్టు ఢిల్లీలో ఉన్న ప్రధాని మోదీ చేతిలో ఉంది. చంద్రబాబు ప్రతిపాదనపై సీఎం రేవంత్.. కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు.
ఇదే సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుపై కవిత స్పందిస్తూ..‘పసుపు రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. పసుపు ధర రోజురోజుకూ పతనం అవుతోంది. 15వేల మద్దతు ధర ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. వ్యాపారులు సిండికేట్ అయి పసుపు రైతులను దగా చేస్తున్నారు. దీనిపై మార్చి ఒకటో తేదీ వరకు డెడ్‌లైన్ విధిస్తున్నాం. పసుపు క్వింటాలుకు పదిహేను వేల ధర ఇవ్వకుంటే రైతులతో కలిసి కలెక్టరేటును ముట్టడిస్తాం. పసుపు బోర్డు నామమాత్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. పసుపు క్వింటాల్‌కు 12వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నేతలు నిలబెట్టుకోవాలి. 12వేల కంటే ధర తక్కువగా వస్తే బోనస్ రూపంలో రైతులకు చెల్లించాలి’ అని డిమాండ్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment