సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇవ్వడం తప్పా?. మహిళలను ఆదుకోవడం తప్పా?. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం తప్పా?. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్‌ఎస్ ఏం చేసింది’’ అంటూ ప్రశ్నించారు.
రైతు భరోసాపై అఖిల పక్షం పెట్టబోతున్నాం. వందకు వంద శాతం రైతు భరోసా అమలు చేస్తాం. గతంలో బడ్జెట్‌పై నేను మాట్లాడితే అవహేళన చేశారు. వాస్తవానికి దూరంగా గత బడ్జెట్‌ను పెట్టారు. గత ప్రభుత్వం లాగా మేము బడ్జెట్ పెట్టాలనుకుంటే మూడున్నర లక్షల కోట్లు పెట్టేవాళ్లం. గత ప్రభుత్వం చివరి బడ్జెట్ రెండు లక్షల 90 వేలు పెట్టింది. వాస్తవానికి దగ్గరగా ఉండాలని మేము ఒక వెయ్యి మాత్రమే పెంచాము. గత ప్రభుత్వం లాగా మేము గాలి బడ్జెట్ పెట్టలేదు.’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.
‘‘ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నాం. వరుస సమీక్షలతో పాలన పరుగులు పెడుతోంది. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ పెట్టబోతున్నాం. 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశాం. రాబోయే 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం.’’ అని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
‘‘రుణమాఫీపై మమ్మల్ని రైతులు నమ్మారు. బడ్జెట్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇచ్చిన మాటను మేం నిలబెట్టుకుంటాం. పదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. రైతు రుణ మాఫీ చేస్తామంటే అభినందించడం పోయి విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. ఇరిగేషన్‌పై కూడా ఆరోపణలు చేస్తున్నారు’’ అంటూ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment