మూసీ నది గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి
బఫర్ జోన్‌లో ఉన్న వారి జోలికి వెళ్లడం లేదు...
మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జా... ఇప్పటికైనా చెరువులను
కాపాడకపోతే అవి కనిపించవు... మూసీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి
ప్రాజెక్టుకు టెండర్లే పిలవలేదు.. రూ. లక్షన్నర కోట్ల లెక్క ఎలా విచ్చింది?...
బాధితులకు ఎలా న్యాయం చేయాలో సలహాలు ఇవ్వండి.. రాజకీయాలు వద్దని హితవు
అవేమీ మా సొంత ఆస్తులు కాదు..
హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువులన్నీ సీఎం రేవంత్‌రెడ్డికో, నాకో చెందిన ఆస్తులు కాదు. అవి నగర ప్రజల ఆస్తులు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఎజెండా. కబ్జాలు ఇదే రీతిన కొనసాగితే భవిష్యత్తులో చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్న భయంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
లక్షన్నర కోట్ల లెక్క ఎక్కడిది?
మూసీ నది పునరుజ్జీవనం పనులపై స్టడీ కోసం మాత్రమే టెండర్లు పిలిచాం. నది ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది. అలాంటిది మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు వ్యయం అవుతుందని ఎలా నిర్ధారిస్తారు. అవాస్తవ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి, చెరువులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఎజెండా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించే పని చేయదు, చేయబోదని పేర్కొన్నారు. ప్రస్తుతం మూసీ నది గర్భం లోపలి ఆక్రమణలపైనే దృష్టి పెట్టామని.. బఫర్ జోన్ జోలికి వెళ్లడం లేదని వివరించారు.
మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయబోమని, బాధితులకు ఏ సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, గత పదేళ్లలో వాటి ఆక్రమణలు, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తదితర అంశాలపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువుల కబ్జాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ప్రదర్శించారు. పలు దేశాల్లోని ముఖ్య నగరాల్లో నదులను సుందరీకరించుకున్న తీరును వివరించారు. సమావేశంలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జా కొనసాగింది. పూర్తిగా 44 చెరువులు, పాక్షికంగా 127 చెరువులు కబ్జా అయ్యాయి. హైదరాబాద్ నగరం అంటేనే రాక్స్ (కొండలు), పార్క్స్, లేక్స్.. అవే భాగ్యనగరానికి చాలా శోభను తెచ్చాయి. కాలక్రమేణా కొండలు (రాక్స్) కనబడకుండా పోతున్నాయి. పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువులు కూడా కబ్జాలతో కనుమరుగు అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరానికి ముప్పు ఏర్పడే పరిస్థితి వచి్చంది.
కాపాడాల్సిన బాధ్యత మాది
ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని, మూసీని ప్రక్షాళన చేస్తామని గత ప్రభుత్వాలు ఘనంగా చెప్పి.. ఏమీ చేయలేకపోయాయి. ఎన్నో దేశాల్లోని ముఖ్య నగరాల్లో నదులను సుందరీకరించుకున్నారు. హైదరాబాద్‌ను కూడా తీర్చిదిద్ది ప్రపంచాన్ని ఆకర్షించేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అన్యాక్రాంతం అవుతున్న చెరువులను కాపాడాల్సిన బాధ్యత సీఎం రేవంత్, నాతోపాటు అందరిపైనా ఉంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పింది వాస్తవం కాదా?
బాధితులకు అండగా ఉంటాం
రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించే కార్యక్రమం చేయదు, చేయబోదు. ఎవరి ఇల్లూ కూల్చాలని ప్రభుత్వం అనుకోదు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయం. ఏ సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇళ్లు తొలగించిన బాధితులకు వేరేచోట ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే బాధితులకు అక్కడే ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారిని కూడా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. మూసీ బాధితుల ఆస్తులకు విలువ లెక్కకట్టి చెల్లిస్తాం. వారి కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు..’’అని భట్టి వెల్లడించారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా యి. పారదర్శకంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభు త్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై కొందరు ప్రతిపక్ష నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఆలోచన ప్రజ లకు మంచి చేయాలనే తప్ప మరొకటి లేదు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వారవుతారు.
నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి. అందుకు మా ద్వారాలు తెరిచే ఉంటాయని అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేమేమీ గడీలలో లేము. త్వరలోనే అన్ని పారీ్టల నాయకులకు నేనే స్వయంగా లేఖలు రాసి అభిప్రాయాలు తెలుసుకుంటా. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని ప్రతిపక్షాలకు ఉందా? లేదా? అన్నది బహిర్గతం చేయాలి. కొందరు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు.
Comments
Please login to add a commentAdd a comment