సాక్షి, హైదరాబాద్: హెడ్రా విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌పై మరోసారి మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. బఫర్ జొన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉండేవి మొత్తం ప్రభుత్వ భూములు కావని, పట్టా భూములు కూడా ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేస్తున్నవి అన్ని అక్రమ నిర్మాణాలు కావని, హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.
కాగా గతంలోనూ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొట్టి కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. కేవలం పేదలనే టార్గెట్ చేసి ప్రభుత్వం హీనంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు శని, ఆదివారాల్లో కోర్టులు అందుబాటులో ఉండవని కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ, ప్రయివేటు భూములు లెక్కించాలని డిమాండ్ చేశారు.
కూల్చివేతలతో రోడ్డున పడ్డ పేదలకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుమ్ములాటలు ఉన్నాయని, అవి బయటపడకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల భూములు లాక్కోవడానికి రేవంత్ రెడ్డి జాగీరు కాదన్నారు. చెరువులు, వాగుల రక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment