moose
-
పేదల ఇళ్లు కూల్చితే రణరంగమే...
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: ‘మూసీలో పేదల ఇళ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుంది. పేదలు ఆక్రోశంతో తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేం కూడా కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటాం. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసంవారి ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధం..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మూసీ, హైడ్రా కూల్చివేతలకు నిరసనగా ‘చేయి చేసిన కీడు...మూసీ బాధితులకు బీజేపీ తోడు’పేరిట నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయాలి ‘మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ సుందరీకరణ చేయాలి. మూసీకి రెండువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మించాక సుందరీకరణ చేపట్టాలి. అప్పుడు బీజేపీ కార్యకర్తలు కరసేవ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాకాకుండా పేదల ఇళ్లు కూల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటాం. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, వివరాలు సేకరించి రానున్న రోజుల్లో పేదల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.అనేక ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను ఎలా కూలుస్తారు ? మూసీ పరీవాహక ప్రాంతం చరిత్ర రేవంత్‌రెడ్డికి తెలుసా? మూసీలో అనేక ప్రాంతాల డ్రైనేజీ నీరు కలుస్తోంది. దాన్ని మళ్లించకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) నిర్మించకుండా మూసీ ప్రక్షాళన చేయలేరు..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లోని అనేకచోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాక మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, తమ మోసపూరిత వైఖరి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటోందని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్: బండి సంజయ్ ‘మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్. మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్లే. లండన్, సియోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ము సీఎంకు, మంత్రులకు ఉందా? మీ అల్లుడి (వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? మూసీ బాధితులకు మేం అండగా ఉంటాం..’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ ప్రాజెక్టుకు లక్షన్నరకోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ ప్రక్షాళనకు, ఇళ్ల కూలి్చవేతలకు సంబంధం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. సీఎం మాతో మూసీ పర్యటనకు రావాలి: ఏలేటి మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్ తమతోపాటు మూసీ పర్యటనకు రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల్లో ఒక్కరు ఒప్పుకున్నా తాము వెనక్కి తగ్గుతామని సవాల్ చేశారు. మీ కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా నిర్వహించిన ఈ ధర్నాలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని పలువురు మహిళలు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. -
మూసీ లెక్కలు చెప్పేందుకే ఢిల్లీకి రేవంత్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు మూ టల లెక్కలు చెప్పేందుకే సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన పర్యటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పేదల గూడు చెదరగొట్టేందుకు ఢిల్లీలో తన బాస్‌లతో మంతనాలు చేస్తున్నారని మండిపడ్డారు. పదినెలల పాలనలో 23మార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రాష్ట్రానికి తెచి్చన నిధులు, చేసిన మేలు ఏమిటో చెప్పాలన్నారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధిక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రికార్డు సృష్టిస్తున్నారని అన్నారు.సీటు కాపాడుకునేందుకే: అధిష్టానం మెప్పు కోసం తరచూ ఢిల్లీకి వెళుతున్న సీఎం రేవంత్ తన బాస్ లకు జై కొట్టి సీటును కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ పాలనపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తిగా లేనందునే పదేపదే ఢిల్లీకి పిలిచి ఆయనకు చివాట్లు పెడుతోందన్నారు. సీఎం ఢిల్లీ పర్యటన తీరు చూస్తే ఐదేళ్లలో ఆయన 125 మార్లు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఢిల్లీకి గులాంగిరీ తప్పదని గతంలో తాము చెప్పిందే వాస్తవమవుతోందన్నారు. నిధులు తెస్తానంటూ మోసగిస్తున్నాడు: కేంద్రంలోని పెద్దలను ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెస్తానంటూ నమ్మబలుకుతున్న రేవంత్ ఇప్పటి వరకు రాష్ట్రానికి తెచ్చిన నిధుల లెక్క తేల్చాలన్నారు. కేంద్ర బడ్జెట్‌తోపాటు ఇటీవల వరద సాయంలో తెలంగాణకు కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పారు. -
ఆ ఆక్రమణలపైనే ఫోకస్
అవేమీ మా సొంత ఆస్తులు కాదు..హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువులన్నీ సీఎం రేవంత్‌రెడ్డికో, నాకో చెందిన ఆస్తులు కాదు. అవి నగర ప్రజల ఆస్తులు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఎజెండా. కబ్జాలు ఇదే రీతిన కొనసాగితే భవిష్యత్తులో చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్న భయంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.లక్షన్నర కోట్ల లెక్క ఎక్కడిది? మూసీ నది పునరుజ్జీవనం పనులపై స్టడీ కోసం మాత్రమే టెండర్లు పిలిచాం. నది ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది. అలాంటిది మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు వ్యయం అవుతుందని ఎలా నిర్ధారిస్తారు. అవాస్తవ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి, చెరువులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఎజెండా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించే పని చేయదు, చేయబోదని పేర్కొన్నారు. ప్రస్తుతం మూసీ నది గర్భం లోపలి ఆక్రమణలపైనే దృష్టి పెట్టామని.. బఫర్ జోన్ జోలికి వెళ్లడం లేదని వివరించారు.మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయబోమని, బాధితులకు ఏ సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, గత పదేళ్లలో వాటి ఆక్రమణలు, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తదితర అంశాలపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువుల కబ్జాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ప్రదర్శించారు. పలు దేశాల్లోని ముఖ్య నగరాల్లో నదులను సుందరీకరించుకున్న తీరును వివరించారు. సమావేశంలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జా కొనసాగింది. పూర్తిగా 44 చెరువులు, పాక్షికంగా 127 చెరువులు కబ్జా అయ్యాయి. హైదరాబాద్ నగరం అంటేనే రాక్స్ (కొండలు), పార్క్స్, లేక్స్.. అవే భాగ్యనగరానికి చాలా శోభను తెచ్చాయి. కాలక్రమేణా కొండలు (రాక్స్) కనబడకుండా పోతున్నాయి. పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువులు కూడా కబ్జాలతో కనుమరుగు అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరానికి ముప్పు ఏర్పడే పరిస్థితి వచి్చంది. కాపాడాల్సిన బాధ్యత మాది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని, మూసీని ప్రక్షాళన చేస్తామని గత ప్రభుత్వాలు ఘనంగా చెప్పి.. ఏమీ చేయలేకపోయాయి. ఎన్నో దేశాల్లోని ముఖ్య నగరాల్లో నదులను సుందరీకరించుకున్నారు. హైదరాబాద్‌ను కూడా తీర్చిదిద్ది ప్రపంచాన్ని ఆకర్షించేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అన్యాక్రాంతం అవుతున్న చెరువులను కాపాడాల్సిన బాధ్యత సీఎం రేవంత్, నాతోపాటు అందరిపైనా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పింది వాస్తవం కాదా? బాధితులకు అండగా ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించే కార్యక్రమం చేయదు, చేయబోదు. ఎవరి ఇల్లూ కూల్చాలని ప్రభుత్వం అనుకోదు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయం. ఏ సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇళ్లు తొలగించిన బాధితులకు వేరేచోట ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే బాధితులకు అక్కడే ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారిని కూడా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. మూసీ బాధితుల ఆస్తులకు విలువ లెక్కకట్టి చెల్లిస్తాం. వారి కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు..’’అని భట్టి వెల్లడించారు.ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా యి. పారదర్శకంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభు త్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై కొందరు ప్రతిపక్ష నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఆలోచన ప్రజ లకు మంచి చేయాలనే తప్ప మరొకటి లేదు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వారవుతారు.నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి. అందుకు మా ద్వారాలు తెరిచే ఉంటాయని అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేమేమీ గడీలలో లేము. త్వరలోనే అన్ని పారీ్టల నాయకులకు నేనే స్వయంగా లేఖలు రాసి అభిప్రాయాలు తెలుసుకుంటా. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని ప్రతిపక్షాలకు ఉందా? లేదా? అన్నది బహిర్గతం చేయాలి. కొందరు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. -
‘మూసీ’ని మార్చేస్తాం
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని పునరుజ్జీవింపచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) 31వ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బీఏఐ సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ త్వరలోనే మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను ఆహ్వానిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన మూసీనది వెంట కనెక్టింగ్ కారిడార్లు, మెట్రో, ఆట, వినోద కేంద్రాలు, హోటళ్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. మూసీ అభివృద్ధికి లండన్‌లోని థేమ్స్ నది నుంచి గుజరాత్‌లోని సబర్మతి నది వరకు నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనేదిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కాంట్రాక్టర్లు, బిల్డర్లు భాగస్వాములేనని, రాష్ట్రంలోని మౌలిక వసతులే ఆ రాష్ట్ర అభివృద్ధికి కొలమానమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంట్రాక్టర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేశారని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వాములేనని, వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో 20 ఏళ్లుగా ఉన్న ఈపీసీ కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి క్లస్టర్ వద్ద పాఠశాల లు, ఆస్పత్రులు, సౌరవిద్యుత్ ప్లాంట్లు, సైకిల్ ట్రాక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని, అందుకు తగ్గ ప్రణాళిక ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు. -
దుప్పిని మింగిన కొండచిలువ
సాక్షి, ఎర్రావారి పాళెం: చిత్తూరు జిల్లా తలకోన అటవీ ప్రాంతంలోని మొదటి వంక సమీపంలో ఓ కొండచిలువ దుప్పిని మింగేసింది. తర్వాత కదల్లేని స్థితిలో అక్కడే ఉండిపోయింది. సోమవారం మధ్యాహ్నం అటుగా వెళుతున్న తలకోన పర్యాటకులు కొండచిలువను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. చదవండి: రిజర్వేషన్ లేకుండానే రైలు ప్రయాణం -
వీడియోలోని జీవి ఏంటో చెప్పగలరా?!
పాత వీడియో ఒకటి ప్రస్తుతం ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ఈ వీడియోను రెండు రోజుల క్రితం తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. అయితే వీడియోతో పాటు ఓ పజిల్‌ను కూడా ఇచ్చారు సుశాంత నంద. వీడియో చూసి రకరకాల సమాధానాలు చెప్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో నీలాకుపచ్చ వర్ణం నీటిలో ఓ జీవి తన తలను ముంచి ఈదుతుంది. ఓ 20 సెకన్ల తర్వాత బయటకు వస్తుంది. అయితే మొదటి పది సెకన్లలోనో ఆ జీవి ఏంటో గుర్తించగలరా అంటూ సుశాంత నందా ఓ చాలెంజ్ విసిరారు. ఇప్పటికి 10 వేల మంది ఈ వీడియోను చూశారు. అయితే చాలా కొద్ది మంది మాత్రమే సరైన సమాధానం చెప్పగలిగారు. మీరు ఓ సారి ప్రయత్నించండి. గెస్ చేయలేకపోతే.. సమాధానం కోసం వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడ నీటిలో ఈదుతున్న జీవి పేరు మూస్. దుప్పి జాతికి చెందిన ఈ జంతువు రష్యా, అమెరికా, కెనడాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏడేళ్ల క్రితం వేన్ ఎల్లెట్ అనే వ్యక్తి అమెరికా, మోంటానాలోని హిమానీనద జాతీయ ఉద్యానవనంలో ఈ వీడియోను తీశాడు. సుశాంత నంద మళ్లీ రీ పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్ అవుతోంది. -
దాహమే ప్రాణం తీస్తోంది!
సాక్షి, కాళేశ్వరం: అడవి నుంచి నీటి కోసం వచ్చి గ్రావిటీ కాల్వలో పడి దుప్పి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ నుంచి అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ వరకు 13.50 కిలోమీటర్ల దూరం నీటిని తరలించడానికి గ్రావిటీ కాల్వ ను ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యాన నిర్మించారు. కాగా, శనివారం తెల్లవారుజామున దాహం తీర్చుకునేందుకు నాలుగు దుప్పులు కాల్వలోకి దిగి పైకి ఎక్కడం రాక కొట్టుమిట్టాడాయి. లక్ష్మీపంపుహౌస్లో పంపులు నడుస్తుండడంతో నీటి ప్రవాహం ఉండగా.. స్థానికులు సమాచారాన్ని అటవీశాఖ డిప్యూటీ రేంజర్ సురేష్‌కుమార్‌కు తెలియజేశారు. దీంతో ఆయన సిబ్బందితో కాల్వ వద్దకు చేరుకున్నారు. అధికారులతో పాటు స్థానికులైన మోహన్‌రెడ్డి, దీన్‌మహ్మద్, సంతోష్ నీటిలోకి దిగి రెండు గంటల పాటు శ్రమించి దుప్పులకు పైకి తీసుకువచ్చారు. అప్పటికే ఒక దుప్పి మృత్యువాత పడగా.. మిగతా మూడింటిని అడవిలో వదిలి పెట్టారు. కాగా, రెండు నెలల్లో గ్రావిటీ కాల్వలో పడి మూడు దుప్పులు మృత్యువాత పడ్డాయి. నీటి కోసం వచ్చి దుప్పులు ప్రాణాలు కోల్పోతున్న ఇరిగేషన్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, గ్రావిటీ కాల్వకు ఇరువైపుల ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
మిమ్మల్నే మహారాజా!
మృగరాజు ముసలిదైపోయింది. చూపు తగ్గింది. వేటాడే ఓపిక సన్నగిల్లింది. దాంతో ఓ ఉపాయం ఆలోచించింది. తోడేలును పిలిచి, ‘‘నేను పెద్దవాడినయి పోయాను. వేటాడలేక పోతున్నాను. కాబట్టి ఏదో ఒక జంతువును నా దగ్గరకు తీసుకొస్తుండు. నీకూ వాటా ఇస్తాను. అన్నట్లు ఇప్పుడు నాకు దుప్పి మాంసం తినాలనుంది. బాగా బలిసిన దుప్పినొకదాన్ని తీసుకురా’’ అని ఆజ్ఞాపించింది. తోడేలు అందుకు ఒప్పుకుంది. వెంటనే బయల్దేరి ఒక దుప్పి దగ్గరకెళ్లి వినయంగా నమస్కరించి, ‘‘మహారాజా! కులాసానా?’’ అంటూ పలకరించింది. తనను కాదనుకుని అటూ ఇటూ చూడసాగింది దుప్పి. ఈ సారి ఇంకాస్త వినయంగా ‘‘మిమ్మల్నే మహారాజా’’ అంది నక్క. దాంతో అది పిలుస్తున్నది తననే అని నిర్ధారించుకుని, ‘‘ఊ! మేము బాగానే ఉన్నాం. ఏమిటి సంగతి?’’ అనడిగింది దుప్పి అప్పటికే తాను మహారాజయిపోయినట్లు! ‘‘మీకు తెలియందేముంది రాజా! మన మృగరాజుగారు పెద్దవారయ్యారు కదా. తన స్థానంలో మిమ్మల్ని రాజును చెయ్యాలని తీర్మానించుకున్నారు. మిమ్మల్ని సగౌరవంగా పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆయన మనసు మార్చుకోకముందే బయల్దేరండి’’ అంటూ తొందర చేసింది. దుప్పికి తన బలంమీద, తెలివి తేటలమీద బాగా నమ్మకం. తోడేలు మాటలు నిజమేనని నమ్మింది. ముందు వెనకలు ఆలోచించకుండా కొమ్ములు దువ్వుకుంటూ వెంటనే బయల్దేరింది. తోడేలు దాన్ని సింహం ఉన్న గుహదాకా తీసుకొచ్చింది. తటపటాయిస్తున్న దుప్పితో, ‘‘మృగరాజు దగ్గరకు వెళ్లండి. మీకు కిరీటం తొడిగి, మీరు ఏమేం పనులు చేయాలో చెబుతారు’’ అంది తోడేలు. దుప్పి సింహం దగ్గరకు వెళ్లి తలవంచి నిలబడింది. సింహం ఒక్కసారిగా తన పంజా విసిరి దాని మెడ చీల్చి చంపేసింది. అది తినగా మిగిలిన మాంసంతో తోడేలు విందు చేసుకుంది. నక్క వినయాలు నిజమేననుకోవడం, అవతలివారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరం. –డి.వి.ఆర్. -
జనారణ్యంలోకి దుప్పి
జూపాడుబంగ్లా: రోళ్లపాడు అభయారణ్యంలోంచి నీటికోసం దారితప్పిన దుప్పి జూపాడుబంగ్లాకు చేరుకొంది. తెల్లవారిన తర్వాత జనారణ్యంలో ఎటువెళ్లాలో దిక్కుతోచక గ్రామంలోని నాగేశ్వరమ్మ ఇంట్లోకి చొరబడింది. ఆమె భయంతో కంగారుపడిపోయి విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. స్థానిక పోలీసులు Ððవెంటనే దుప్పిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాలికి తీవ్ర రక్తగాయాలు కావటంతో దుప్పి అస్వస్థతకు గురైంది. విషయాన్ని ఎస్ఐ అశోక్.. ఆత్మకూరు అటవిశాఖ డీఆర్వో రంగన్నకు తెలియజేయటంతో ఆయన తన సిబ్బందితో జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. గాయపడిన దుప్పికి చికిత్సలు నిర్వహించి వెంటతెచ్చిన బోనులో ఆత్మకూరు అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దుప్పి కోలుకున్న తర్వాత అటవిలో వదిలి పెడతామని డీఆర్వో రంగన్న తెలిపారు.