బీజేపీ మహాధర్నాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
వాళ్లు తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరు
కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు
మూసీ ప్రాంత ప్రజల ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధం
కిషన్‌రెడ్డి, బండి, ఈటలకు గోడు వెళ్లబోసుకుంటున్న మూసీ బాధితురాలు
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: ‘మూసీలో పేదల ఇళ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుంది. పేదలు ఆక్రోశంతో తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేం కూడా కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటాం. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసం
వారి ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధం..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మూసీ, హైడ్రా కూల్చివేతలకు నిరసనగా ‘చేయి చేసిన కీడు...మూసీ బాధితులకు బీజేపీ తోడు’పేరిట నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు.
ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయాలి
‘మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ సుందరీకరణ చేయాలి. మూసీకి రెండువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మించాక సుందరీకరణ చేపట్టాలి. అప్పుడు బీజేపీ కార్యకర్తలు కరసేవ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాకాకుండా పేదల ఇళ్లు కూల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటాం. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, వివరాలు సేకరించి రానున్న రోజుల్లో పేదల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
అనేక ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను ఎలా కూలుస్తారు ? మూసీ పరీవాహక ప్రాంతం చరిత్ర రేవంత్‌రెడ్డికి తెలుసా? మూసీలో అనేక ప్రాంతాల డ్రైనేజీ నీరు కలుస్తోంది. దాన్ని మళ్లించకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) నిర్మించకుండా మూసీ ప్రక్షాళన చేయలేరు..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లోని అనేకచోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాక మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, తమ మోసపూరిత వైఖరి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటోందని ధ్వజమెత్తారు.
మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్: బండి సంజయ్
‘మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్. మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లే. లండన్, సియోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ము సీఎంకు, మంత్రులకు ఉందా? మీ అల్లుడి (వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? మూసీ బాధితులకు మేం అండగా ఉంటాం..’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ ప్రాజెక్టుకు లక్షన్నరకోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ ప్రక్షాళనకు, ఇళ్ల కూలి్చవేతలకు సంబంధం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు.
సీఎం మాతో మూసీ పర్యటనకు రావాలి: ఏలేటి మహేశ్వరరెడ్డి
సీఎం రేవంత్ తమతోపాటు మూసీ పర్యటనకు రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల్లో ఒక్కరు ఒప్పుకున్నా తాము వెనక్కి తగ్గుతామని సవాల్ చేశారు. మీ కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా నిర్వహించిన ఈ ధర్నాలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ధన్‌పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని పలువురు మహిళలు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment