జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం రేవంత్, చిత్రంలో మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని పునరుజ్జీవింపచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) 31వ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బీఏఐ సావనీర్‌ను విడుదల చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ త్వరలోనే మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)ను ఆహ్వానిస్తామన్నారు. 55 కిలోమీటర్ల పొడవైన మూసీనది వెంట కనెక్టింగ్ కారిడార్లు, మెట్రో, ఆట, వినోద కేంద్రాలు, హోటళ్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు.
మూసీ అభివృద్ధికి లండన్‌లోని థేమ్స్ నది నుంచి గుజరాత్‌లోని సబర్మతి నది వరకు నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలనేదిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కాంట్రాక్టర్లు, బిల్డర్లు భాగస్వాములేనని, రాష్ట్రంలోని మౌలిక వసతులే ఆ రాష్ట్ర అభివృద్ధికి కొలమానమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాంట్రాక్టర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం చేశారని గుర్తు చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వాములేనని, వారి సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్, నిర్మాణ రంగంలో 20 ఏళ్లుగా ఉన్న ఈపీసీ కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతామని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి క్లస్టర్ వద్ద పాఠశాల లు, ఆస్పత్రులు, సౌరవిద్యుత్ ప్లాంట్లు, సైకిల్ ట్రాక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించామని, అందుకు తగ్గ ప్రణాళిక ప్రభుత్వం రూపొందిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment