ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకే విజయావకాశాలు
పార్టీ ముఖ్యనేతలతో జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి
ఇంచార్జి హోదాలో తొలిసారి సమావేశానికి హాజరైన మీనాక్షి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి యువతకు వివరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థి వి.నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాత్రి కాంగ్రెస్ ముఖ్యనేతల జూమ్ మీటింగ్ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు రాష్ట్రంలో స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలను మంజూరు చేసి పనులు ప్రారంభించామని, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఈ విషయాలను యువతకు వివరించడం ద్వారా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ అంటే అభిమానం: మీనాక్షి
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నటరాజన్ తొలిసారి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పారు. రాష్ట్రంలోని చాలామంది పార్టీ నాయకులతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని అన్నారు.
తెలంగాణను దేశానికి ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, రాష్ట్రంలోని పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు. ఎన్నికలను పార్టీ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మీనాక్షి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment