
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో పాలక పక్షంపై ఉన్న ప్రజా వ్యతిరేకత బయటపడిందని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని అన్నారాయన.
సాక్షితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సాధారణ విషయమేమీ కాదు. ఇది బీజేపీ సాధించిన సమిష్టి విజయం. తెలంగాణలో పాలకులు మారినా.. మార్పు రాలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 37 శాతం మంది బీజేపీని ఆదరించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా నిలిచారు.
.. కాంగ్రెస్‌కు, రేవంత్‌కు చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. రేవంత్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత అర్థమైంది. తెలంగాణ ప్రజలు బీజేపీ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం పక్కా’’ అని అన్నారాయన.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన అంజిరెడ్డి సాక్షితో మాట్లాడుతూ.. ఈ విజయం బీజేపీ కార్యకర్తలందరిదని అన్నారు. కిషన్ రెడ్డి, సంజయ్ తో పాటు, అందరి సహకారంతో ఈ విజయం సాధించాం. మేము ఊహించినట్టే విజయం దక్కింది. మండలిలో ఉద్యోగుల సమస్యలపై గళం విప్పుతా’’ అని అన్నారు.
సాక్షి టీవీతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇది బీజేపీ కార్యకర్తల విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెంపపెట్టు ఈ విజయం. తెలంగాణాలో బీజేపీ బలపడుతుందనేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయాలు నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ విజయం ప్రభావం తప్పకుండా ఉంటుంది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment