మృగరాజు ముసలిదైపోయింది. చూపు తగ్గింది. వేటాడే ఓపిక సన్నగిల్లింది. దాంతో ఓ ఉపాయం ఆలోచించింది. తోడేలును పిలిచి, ‘‘నేను పెద్దవాడినయి పోయాను. వేటాడలేక పోతున్నాను. కాబట్టి ఏదో ఒక జంతువును నా దగ్గరకు తీసుకొస్తుండు. నీకూ వాటా ఇస్తాను. అన్నట్లు ఇప్పుడు నాకు దుప్పి మాంసం తినాలనుంది. బాగా బలిసిన దుప్పినొకదాన్ని తీసుకురా’’ అని ఆజ్ఞాపించింది. తోడేలు అందుకు ఒప్పుకుంది. వెంటనే బయల్దేరి ఒక దుప్పి దగ్గరకెళ్లి వినయంగా నమస్కరించి, ‘‘మహారాజా! కులాసానా?’’ అంటూ పలకరించింది. తనను కాదనుకుని అటూ ఇటూ చూడసాగింది దుప్పి. ఈ సారి ఇంకాస్త వినయంగా ‘‘మిమ్మల్నే మహారాజా’’ అంది నక్క. దాంతో అది పిలుస్తున్నది తననే అని నిర్ధారించుకుని, ‘‘ఊ! మేము బాగానే ఉన్నాం. ఏమిటి సంగతి?’’ అనడిగింది దుప్పి అప్పటికే తాను మహారాజయిపోయినట్లు! ‘‘మీకు తెలియందేముంది రాజా! మన మృగరాజుగారు పెద్దవారయ్యారు కదా.
తన స్థానంలో మిమ్మల్ని రాజును చెయ్యాలని తీర్మానించుకున్నారు. మిమ్మల్ని సగౌరవంగా పిలుచుకుని రమ్మని చెప్పారు. ఆయన మనసు మార్చుకోకముందే బయల్దేరండి’’ అంటూ తొందర చేసింది. దుప్పికి తన బలంమీద, తెలివి తేటలమీద బాగా నమ్మకం. తోడేలు మాటలు నిజమేనని నమ్మింది. ముందు వెనకలు ఆలోచించకుండా కొమ్ములు దువ్వుకుంటూ వెంటనే బయల్దేరింది. తోడేలు దాన్ని సింహం ఉన్న గుహదాకా తీసుకొచ్చింది. తటపటాయిస్తున్న దుప్పితో, ‘‘మృగరాజు దగ్గరకు వెళ్లండి. మీకు కిరీటం తొడిగి, మీరు ఏమేం పనులు చేయాలో చెబుతారు’’ అంది తోడేలు. దుప్పి సింహం దగ్గరకు వెళ్లి తలవంచి నిలబడింది. సింహం ఒక్కసారిగా తన పంజా విసిరి దాని మెడ చీల్చి చంపేసింది. అది తినగా మిగిలిన మాంసంతో తోడేలు విందు చేసుకుంది. నక్క వినయాలు నిజమేననుకోవడం, అవతలివారు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మటం ఎవరికైనా, ఎప్పటికైనా ప్రమాదకరం.
–డి.వి.ఆర్.
Comments
Please login to add a commentAdd a comment