Christian Religion
-
అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య
సిరియా మహా సైన్యాధిపతి, ధీరుడు, యోధుడు, ధనికుడైన నయమానుకు కుష్టురోగం సోకింది. ఆ రోజుల్లో కుష్టువ్యాధి సోకితే ఎంతటివారైనా సమాజ బహిష్కరణకు గురై జీవచ్ఛవాలవాల్సిందే!! అయితే నయమాను ఇంట్లోనే విశ్వాసి అయిన ఒక యూదుబాలిక బానిసగా ఉంది. ఆమె నయమానుకు ఎడారిలో సెలయేటి వంటి చల్లటి కబురు చెప్పింది. తన ఇశ్రాయేలు దేశంలోని ఎలీషా ప్రవక్త ఎంతటి కుష్టువ్యాధినైనా దేవుని పేరిట బాగుచేస్తాడని ఆమె చెబితే, నయమాను ఎలీషా వద్దకు వెళ్ళాడు. ఎలీషా చెప్పినట్టు అక్కడి యొర్దాను నదిలో ఏడుసార్లు మునిగి ఆమె చెప్పినట్టే నయమాను క్షణాల్లో బాగయ్యాడు. నయమాను అత్యానందపడి బోలెడు కానుకలివ్వబోతే ‘నేను నీ వద్ద ఏమీ తీసుకోను’ అని ఎలీషా అతనికి కరాఖండిగా చెప్పి వెనక్కి పంపేశాడు. సిరియా దేశంలో ఎన్నో గొప్ప నదులుంటే, నేను యొర్దాను లాంటి చిన్న నదిలో మునగాలా? అంటూ ఆరంభంలో నయమాను మొండికేస్తే, ఆ బాలికే అతనికి నచ్చజెప్పి యొర్దానులో మునిగేలా చేసింది. కుష్ఠునే కాదు, అంతకన్నా భయంకరమైన అహంకారమనే అతని మరో రోగాన్ని కూడా అలా ఎలీషా అతని కానుకలు నిరాకరించి బాగుచేశాడు. దేవుడు ప్రలోభాలకు లొంగడని, ఆయన తన కృపను, ఈవులను మానవాళికి ఉచితంగా ప్రసాదించే ‘మహాదాత’ అని, తాను కేవలం దేవుని కృపతోనే బాగయ్యానని గ్రహించి, నయమాను వినమ్రుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు (2రాజులు 5: 1–27). ఎన్నేళ్లు బతికి, ఎంత సేవ చేశామని కాదు, చేసిన కొంచెమైనా ఎంత అద్భుతంగా చేశామన్నదే ప్రాముఖ్యం. అందుకే దేవుని సంకల్పాలు నెరవేర్చే వెయ్యేళ్ళ జీవితం కూడా చాలా చిన్నదిగా కనిపించాలన్నాడు ఒక మహాభక్తుడు. అద్భుతమైన ఈ నయమాను ఉదంతంలో ముఖ్యపాత్ర అనామకురాలైన యూదుబానిస యువతిదే!! నేనొక బానిసను, ఇది నా పని కాదు, పైగా నాకేం లాభం? అని ఆమె అనుకుంటే అసలీ అద్భుతమే లేదు. ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్నాడు, అతని దాహం తీర్చే నీళ్లెక్కడున్నాయో ఆమెకు తెలుసు. పైగా అది దేవుని శక్తిని రుజువుచేసే అపూర్వమైన అవకాశం. వెంటనే ఆమె తనవంతు పరిచర్య చేసి పక్కకు తప్పుకుంది, అజ్ఞాతంగానే ఉండిపోయింది. వేల మైళ్ళ పొడవుండే హైవే తో పోల్చితే ఒక చిన్న మైలురాయి ఎంత? కానీ దాని ప్రత్యేకత దానిదే!! ఇందులో నాకెంత లాభం? అని ఆలోచించకుండా మైలు రాయి తనపని తాను చేసుకొంటుంది. దాహంతో అలమటించే బాటసారికి, ప్రతిఫలాపేక్షలేకుండా నీళ్లిచ్చే పనే నిజమైన సువార్త పని. యేసుప్రభువు తన శిష్యులకు, పరిచారకులకు తన పేరిట అద్భుతాలు చేయమని ఆదేశించాడు. కానీ మీరు అదంతా ‘ఉచితంగా మాత్రమే చెయ్యండి’ అని కూడా అదే వచనంలో ఆదేశించాడు (మత్తయి 10:8). మరి మేమెలా బతకాలి? అంటారా, బతకడానికే అయితే కూలిపని చెయ్యొచ్చు, కలెక్టర్ పనైనా చెయ్యొచ్చు. ‘నేను మీకు అదనంగా సంచిని, జాలెను, చెప్పుల్ని ఇవ్వకుండా పరిచర్య కు పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా?’ అని యేసు ఒకసారి తన శిష్యుల్ని అడిగితే, లేదని వాళ్ళు జవాబిచ్చారు(లూకా 22:35). అంటే, ఏమీ తక్కువకాని జీవితాన్ని దేవుడిస్తాడు. కాని అన్నీ ఎక్కువగా ఉండే జీవితం కావాలనుకునే పరిచారకులే గేహాజీ లాగా (ఈ ఉదంతంలో మరో పాత్ర) ప్రలోభాలకు గురై భ్రష్టులవుతారు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
15 గిరిజన కుటుంబాల వెలి
బొడ్రాయికి డబ్బులు ఇవ్వకపోవడమే కారణం మాట్లాడినా.. నీళ్లిచ్చినా 10 వేలు జరిమానా పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెం పంచాయతీ పరిధిలోని తుమ్మలగూడెం లో 15 గిరిజన కుటుంబాలను కులపెద్దలు వెలి వేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం ఆయా కుటుంబాలు డబ్బు లివ్వకపోవడంతో కుల పెద్దలు ఈ మేరకు నెల క్రితం నిర్ణయం తీసుకోగా... అప్పటి నుంచి ఆ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మండలంలోని తుమ్మలగూడెంలో సుమారు 40 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. గతనెల 23న గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన కోసం గ్రామంలోని గిరిజన కుటుంబాలు ఒక్కో ఇంటికి రూ. ఆరు వేల చొప్పున చందాగా ఇవ్వాలని కుల పెద్దలు నిర్ణయించారు. అయితే, క్రైస్తవమతం స్వీకరించిన 15 గిరిజన కుటుంబాలు చందాలివ్వలేమని చెప్పారుు. దీంతో ఆ కుటుంబాలకు చెందిన కుంజా రాందాసు, కుంజా లక్ష్మి, ఈసం రాజేశ్వరి, కుంజా రాములమ్మ, కుంజా పద్మ, జబ్బా యశోద, కుంజా నాగలక్ష్మి, ఎనుగు గురవమ్మ, ఈసం శివకృష్ణలతో పాటు మరికొందరిని గ్రామ పెద్దలు వెలి వేశారు. వారితో ఎవరు మాట్లాడినా, వారిని శుభకార్యాలకు పిలిచినా, వాళ్ల ఇళ్లకు వెళ్లినా, వారికి నీళ్లు ఇచ్చినా, పనిలోకి పిలిచినా రూ. 10 వేల జరిమానా విధిస్తామని పెద్దలు తేల్చిచెప్పారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తాం గ్రామస్తుల్లో కొందరిని వెలి వేయడం అత్యంత హేయమైన చర్య. గురువారం తుమ్మల గూడేన్ని సందర్శిస్తాం. గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటాం. - వి.రాఘవరెడ్డి, తహసీల్దార్ చంటి బిడ్డనూ ఎత్తుకోవడం లేదు బొడ్రాయికి చందాలివ్వలేదని.. అభం శుభం తెలియని చిన్నారిని చుట్టుపక్కల ఇళ్లవారు కూడా ఎత్తుకోవడం లేదు. ఎత్తుకుంటే జరిమానా విధిస్తారని అందరూ భయపడుతున్నారు. - యశోద నీళ్లకు కూడా రానివ్వడం లేదు బొడ్రాయికి చందాలివ్వలేదని క్రిస్టియన్ మతం తీసుకున్న మమ్మల్ని వెలి వేశారు. నీళ్ల కోసం వెళితే రావొద్దంటున్నారు. బంధువుల ఇంటి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. - ఈసం రాజేశ్వరి -
అదే క్రిస్మస్కు నిజమైన అర్థం!
‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు’... ప్రతి క్షణం నేను గుర్తుంచుకునే వాక్యమిది. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈర్ష్యాద్వేషాలకు చోటుండదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. నా దృష్టిలో క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించిన పండగ. కానీ సెలబ్రేషన్స్తో పాటు షేరింగ్ కూడా ఉండాలని నా ఉద్దేశం. అందుకే యేటా ఈ రోజున కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూంటా. మనకున్న దానిలో కొంత పేదలకు ఇస్తే అందులో ఉండే తృప్తి, ఆనందం వేరు. అదే క్రిస్మస్కి నిజమైన అర్థం. మాది బ్రహ్మసమాజం కమ్యూనిటీకి చెందిన కుటుంబం. నేను 2001లో క్రైస్తవ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టాక ఎవరూ అడ్డు చెప్పలేదు. యూకేజీ వయసులోనే నేను చర్చకు వెళ్లేదాన్ని. అప్పటి నుంచే జీసస్తో కొంత అనుబంధం ఏర్పడింది. అప్పట్లో అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ 1985లో జరిగిన ఓ ప్రమాదం నన్ను పూర్తిగా మార్చేసింది. మరణం అంచుల దాకా వె ళ్తున్న నన్ను జీసస్ రక్షించాడని నా నమ్మకం. అందుకే ఆయన మార్గంలో వెళ్లడం మొదలుపెట్టా. క్రైస్తవ మార్గంలో వెళ్లడమంటే జీసస్లా అందరితో ప్రేమగా ఉండటమే! - జయసుధ