అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య | Christian Spiritual Suvartha by Doctor TA prabhu | Sakshi
Sakshi News home page

అజ్ఞాత బానిస అపూర్వ పరిచర్య

Published Sun, May 9 2021 7:51 AM | Last Updated on Sun, May 9 2021 7:51 AM

Christian Spiritual Suvartha by Doctor TA prabhu - Sakshi

సిరియా మహా సైన్యాధిపతి, ధీరుడు, యోధుడు, ధనికుడైన నయమానుకు కుష్టురోగం సోకింది. ఆ రోజుల్లో కుష్టువ్యాధి సోకితే ఎంతటివారైనా సమాజ బహిష్కరణకు గురై జీవచ్ఛవాలవాల్సిందే!! అయితే నయమాను ఇంట్లోనే విశ్వాసి అయిన ఒక యూదుబాలిక బానిసగా ఉంది. ఆమె నయమానుకు ఎడారిలో సెలయేటి వంటి చల్లటి కబురు చెప్పింది. తన ఇశ్రాయేలు దేశంలోని ఎలీషా ప్రవక్త ఎంతటి కుష్టువ్యాధినైనా దేవుని పేరిట బాగుచేస్తాడని ఆమె చెబితే, నయమాను ఎలీషా వద్దకు వెళ్ళాడు. ఎలీషా చెప్పినట్టు అక్కడి యొర్దాను నదిలో ఏడుసార్లు మునిగి ఆమె చెప్పినట్టే నయమాను క్షణాల్లో బాగయ్యాడు.

నయమాను అత్యానందపడి బోలెడు కానుకలివ్వబోతే ‘నేను నీ వద్ద ఏమీ తీసుకోను’ అని ఎలీషా అతనికి కరాఖండిగా చెప్పి వెనక్కి పంపేశాడు. సిరియా దేశంలో ఎన్నో గొప్ప నదులుంటే, నేను యొర్దాను లాంటి చిన్న నదిలో మునగాలా? అంటూ ఆరంభంలో నయమాను మొండికేస్తే, ఆ బాలికే అతనికి నచ్చజెప్పి యొర్దానులో మునిగేలా చేసింది.

కుష్ఠునే కాదు, అంతకన్నా భయంకరమైన అహంకారమనే అతని మరో రోగాన్ని కూడా అలా ఎలీషా అతని కానుకలు నిరాకరించి బాగుచేశాడు. దేవుడు ప్రలోభాలకు లొంగడని, ఆయన తన కృపను, ఈవులను మానవాళికి ఉచితంగా ప్రసాదించే ‘మహాదాత’ అని, తాను కేవలం దేవుని కృపతోనే బాగయ్యానని గ్రహించి, నయమాను వినమ్రుడై తన దేశానికి తిరిగి వెళ్ళాడు (2రాజులు 5: 1–27).

ఎన్నేళ్లు బతికి, ఎంత సేవ చేశామని కాదు, చేసిన కొంచెమైనా ఎంత అద్భుతంగా చేశామన్నదే ప్రాముఖ్యం. అందుకే దేవుని సంకల్పాలు  నెరవేర్చే వెయ్యేళ్ళ జీవితం కూడా చాలా చిన్నదిగా కనిపించాలన్నాడు ఒక మహాభక్తుడు. అద్భుతమైన ఈ నయమాను ఉదంతంలో ముఖ్యపాత్ర అనామకురాలైన యూదుబానిస యువతిదే!! నేనొక బానిసను, ఇది నా పని కాదు, పైగా నాకేం లాభం? అని ఆమె అనుకుంటే అసలీ అద్భుతమే లేదు.

ఒక వ్యక్తి దాహంతో అలమటిస్తున్నాడు, అతని దాహం తీర్చే నీళ్లెక్కడున్నాయో ఆమెకు తెలుసు. పైగా అది దేవుని శక్తిని రుజువుచేసే అపూర్వమైన అవకాశం. వెంటనే ఆమె తనవంతు పరిచర్య చేసి పక్కకు తప్పుకుంది, అజ్ఞాతంగానే ఉండిపోయింది. వేల మైళ్ళ పొడవుండే హైవే తో పోల్చితే ఒక చిన్న మైలురాయి ఎంత? కానీ దాని ప్రత్యేకత దానిదే!! ఇందులో నాకెంత లాభం? అని ఆలోచించకుండా మైలు రాయి తనపని తాను చేసుకొంటుంది. దాహంతో అలమటించే బాటసారికి, ప్రతిఫలాపేక్షలేకుండా నీళ్లిచ్చే పనే నిజమైన సువార్త పని. యేసుప్రభువు తన శిష్యులకు, పరిచారకులకు తన పేరిట అద్భుతాలు చేయమని ఆదేశించాడు.

కానీ మీరు అదంతా ‘ఉచితంగా మాత్రమే చెయ్యండి’ అని కూడా అదే వచనంలో ఆదేశించాడు (మత్తయి 10:8). మరి మేమెలా బతకాలి? అంటారా, బతకడానికే అయితే కూలిపని చెయ్యొచ్చు, కలెక్టర్‌ పనైనా చెయ్యొచ్చు. ‘నేను మీకు అదనంగా సంచిని, జాలెను, చెప్పుల్ని ఇవ్వకుండా పరిచర్య కు పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా?’ అని యేసు ఒకసారి తన శిష్యుల్ని అడిగితే, లేదని వాళ్ళు జవాబిచ్చారు(లూకా 22:35). అంటే, ఏమీ తక్కువకాని జీవితాన్ని దేవుడిస్తాడు. కాని అన్నీ ఎక్కువగా ఉండే జీవితం కావాలనుకునే పరిచారకులే గేహాజీ లాగా (ఈ ఉదంతంలో మరో పాత్ర)  ప్రలోభాలకు గురై భ్రష్టులవుతారు.
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement