తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది.
ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం
ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు.
అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు.
నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి
నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల
తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు.
వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు
ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు.
అతి పెద్ద పాఠశాల ఇక్కడే
టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
అందరి ఆశీస్సులు
జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్‌పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment