veda education
-
కల్యాణ వెంకన్న వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వేద పాఠశాలకు టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. తుమ్మలగుంటలోని ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల మొదటి స్నాతకోత్సవం గురువారం వైభవంగా సాగింది. ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, వెండి డాలరు, యోగ్యతాపత్రం ఈ వేడుకకు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 8 సంవత్సరాల పాటు శుక్ల, యజుర్వేదం విద్యను అభ్యసించిన విద్యార్థులకు యోగ్యతా పత్రాలను అందజేశారు. చెవిరెడ్డి సొంత నిధులతో ఒక్కొక్క విద్యార్థికి రూ.3 లక్షల నగదు, 10 గ్రాములు వెండి డాలరును బహూకరించారు. అవకాశం దేవుడిచ్చాడు, సంకల్పం చెవిరెడ్డి తీసుకున్నారు ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ వేదవిద్య పరిరక్షణ బాధ్యత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు తీసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. వేద పాఠశాల నిర్వహణ చాలా కష్టతరమైనదని, అయినా చెవిరెడ్డి దంపతులు వేద పాఠశాల నిర్వహణకు సంకల్పించడం అభినందనీయమని కొనియాడారు. నేటి కాలంలో చెవిరెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారన్నారు. ఏ పని అయినా ముందుండి కష్టపడి ఇలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగే వ్యక్తులను తన 58 ఏళ్ల కాలంలో ఎక్కడా చూడలేదన్నారు. నాడు నలుగురు.. నేడు ప్రపంచ స్థాయి నలుగురు విద్యార్థులతో ప్రారంభమైన వేద పాఠశాలను నేడు 200 మంది విద్యార్థులతో 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సంకల్పించడం శుభ పరిణామమన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామిపై చెవిరెడ్డికి ఉన్న అపారమైన నమ్మకంతో వేద పాఠశాల విజయవంతంగా అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. టీటీడీ తరఫున తుమ్మలగుంట వేద పాఠశాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి కటాక్షంతోనే వేద పాఠశాల తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వర వేద పాఠశాల నిర్వహణ దైవ సంకల్పమని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ గ్రామంలో అయితే భగవంతుడికి మూడు పూటలా నైవేద్యం పెడతారో.. ఆ గ్రామంలో ప్రజలకు ఆహార కొరత ఉండదన్న టీటీడీ మాజీ ఈఓ అజయ్‌కల్లాం మాటలతోనే శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పునాది పడిందని గుర్తుచేశారు. వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఆ తరువాత అనేక నిర్మాణాలు వాకింగ్ ట్రాక్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాయామం చేసి, వ్యాయామశాలను ప్రారంభించారని వెల్లడించారు. ఈ క్రమంలోనే వేద పాఠశాల నిర్వహణకు అడుగులు పడ్డాయన్నారు. నేడు దాదాపు 200 మంది విద్యార్థులకు చేరడం దైవ సంకల్పమేనన్నారు. పాఠశాలకు టీటీడీ వేదిక్ యూనివర్సిటీ గుర్తింపు ఇచ్చిందని చెప్పారు. అతి పెద్ద పాఠశాల ఇక్కడే టీటీడీ వేద పారాయణ పథకం కింద అధ్యాపకుల నియామకానికి సహకారం అందించేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదం లభించిందని తెలిపారు. దేశంలోనే కాక, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 25 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద వేద పాఠశాలను తుమ్మలగుంటలో నిర్మించనున్నట్లు తెలిపారు. వేద పాఠశాల అభున్నతికి సంపూర్ణ సహకారం అందించాలని ధర్మారెడ్డిని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం వేద పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఆశీస్సులు జయేంద్ర సరస్వతి, చిన్నజీయర్ స్వామి తుమ్మలగుంట వేదపాఠశాలకు విచ్చేసి వేద విద్య ఆవశ్యకతను తెలియజేశారని గుర్తుచేశారు. తుమ్మలగుంట వేద పాఠశాల చైర్పర్సన్ చెవిరెడ్డి లక్ష్మి, ప్రిన్సిపల్ బ్రహ్మాజీ శర్మ, వేదిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యామ్, టీటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ శర్మ, వేదిక్ యూనివర్సిటీ అధికారులు ముష్టి పవన్, ఫణియాజుల, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం ప్రొఫెసర్ రాఘవన్, తుడా సెక్రటరీ లక్ష్మి తదితరులు ప్రసంగించారు. -
వేములవాడలో వేదపాఠాలు
వేములవాడ(రాజన్న జిల్లా) : వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో ఇకనుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటివరకు సంస్కృత భాషాభివృద్ధికి సంస్కృత పాఠశాల, డిగ్రీ, పీజీ కళాశాలలను కొనసాగిస్తున్న ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వేదపాఠశాల ప్రారంభానికి మోక్షం లభించింది. గతంలో ఆలయానికి సంబం«ధించిన ఆసుపత్రి కొనసాగిన భవనంలో వేదపాఠశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఆలయ అధికారులు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు అడ్మిషన్ల ప్రక్రియకు దరఖాస్తులు అందుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం వేకువజామున బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య వేదపాఠశాల లాంఛనంగా ప్రారంభించేందుకు ఆలయ అధికారులు బుధవారం ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. చిన్నారి విద్యార్థులకు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమఃశివాయః అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్న వేములవాడ పట్టణంలో ఇక నుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం సంస్క ృత విద్యను కొనసాగించిన ఆలయ అధికారులు ఇకనుంచి వేదపాఠశాలను కొనసాగించనున్నారు. దీంతో వేదాలు నేర్చుకున్న ఘనాపాఠీలు నిత్యం వేదమంత్రోచ్ఛారణలను వినిపించగా, ఇకనుంచి చిన్నారి విద్యార్థులకు వేదపాఠాలు బోధించనున్నారు. 20రోజులు ఆలస్యంగా.. వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం ఎదుట ఉన్న ఓ భవనంలో వేదపాఠశాల ప్రారంభించేందుకు ఆలయ అధికారులు, దేవాదాయశాఖ, ప్రభుత్వ యంత్రాంగం పనులు చేపట్టింది. ఈమేరకు గతనెల 20న ప్రారంభించనున్నట్లు ముందస్తుగానే ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ పర్యటనలో ఉండడంతోపాటు.. ఇతర కారణాల వల్ల వేదపాఠశాలను ప్రారంభించలేకపోయామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. నిర్వహణ.. నియామకాలకు కమిటీ వేదపాఠశాలలో అడ్మిషన్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు ఐదుగురు సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో వేదపారాయణదారులు, ఈవో, ఏఈవో, ట్రస్టుబోర్డు చైర్మన్ ఇలా ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి నిర్ణయమై ఫైనల్. ఇందుకు అయ్యే ఖర్చును రాజన్న ఆలయం భరిస్తుండగా.. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు యాభై శాతం ఆలయం, మరో యాభై శాతం కామన్ గుడ్ ఫండ్ నుంచి వేతనాలు చెల్లించనున్నారు. అడ్మిషన్లు వస్తున్నాయి వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేదపాఠశాలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వేదపాఠశాలతోపాటు సంగీత, నృత్యకళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదపాఠశాలకు సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వేదపారాయణదారులు రాధాకిషన్‌ను నియమించాం. - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో -
రెక్కలు తెగిన పక్షులు!
అగ్నికి ఆహుతైన తల్లి.. జీవచ్ఛవంలా తండ్రి పిల్లల పరిస్థితి అగమ్యగోచరం అమ్మానాన్నలే వారికి లోకం.. నిన్నటి వరకూ అమ్మే అల్లారుముద్దుగా చూసుకుంది.. పేదరికం వెంటాడుతున్నా ఏ లోటూ తెలియకుండా చేసింది.. కదలలేని స్థితిలో ఉన్నా.. నాన్న అంతులేని ప్రేమను పంచాడు. కానీ.. ఒక్క ఘటన ఈ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. అన్నీ తానై చూసుకుని గోరుముద్దలు తినిపించిన అమ్మ విగతజీవిగా మారింది. ఆదరించాల్సిన నాన్న రెండు కిడ్నీలు చెడిపోయి జీవచ్ఛవంలా పడివున్నాడు. అమ్మానాన్న తరపు బంధువులు ఆలనాపాలనా చూసే పరిస్థితి లేకపోవడంతో ఆ చిన్నారులిద్దరూ రెక్కలు తెగిన పక్షులయ్యారు. సోమవారం రాంనగర్లో ఆత్మహత్య చేసుకున్న శ్రీలక్ష్మి, వినోద్ దంపతుల కుమారుడు, కుమార్తెల దీనస్థితి ఇదీ. - హైదరాబాద్ రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన భర్త వినోద్ కళ్లెదుటే భార్య లక్ష్మి అగ్నికి ఆహుతి కావడంతో వారి ఇద్దరు పిల్లలూ ఇప్పుడు దిక్కులేని పక్షులయ్యారు. వీరి కుమారుడు సుశీల్ సూర్య(9) రంగారెడ్డి జిల్లాలోని చీకటి మామిడి వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్నాడు. కుమార్తె సాయినిఖిత(6) రాంనగర్‌లోని జేవీ హైస్కూల్లో 1వ తరగతి చదువుతోంది. ఇంటి అవసరాలు మొదలుకుని భర్తకు వైద్య ఖర్చులు, పిల్లల చదువులు ఇలా అన్నింటికీ శ్రీలక్ష్మి రెక్కల కష్టమే ఆధారం. ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో ఇప్పుడు ఆ కుటుంబం చుక్కాని లేని నావలా మారింది. శ్రీలక్ష్మి స్వస్థలం రాజమండ్రి. తండ్రి లేడు. తల్లి ఉన్నా ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. వినోద్‌కు తల్లిదండ్రులు లేరు. బంధువులు పిల్లలను అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం వేద విద్యను అభ్యసిస్తున్న సుశీల్‌కు అతని ఖర్చులు, దుస్తులు, ఇతరత్రా వ్యవహారాలు చూడాల్సి ఉంది. నిన్నటివరకూ అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న సాయినిఖిత తల్లిలేని జీవితాన్ని ఊహించడం కష్టమే. ఇప్పుడు ఆమె ఆలనాపాలనా ఎవరు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వినోద్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నిన్నటివరకు భోజనం, స్నానం, ఆస్పత్రికి తీసుకెళ్లడం.. ఇలా అన్నీ తానై చూసుకున్న భార్య అనంత లోకాలకు వెళ్లిపోవడంతో అతని పరిస్థితి దయనీయంగా తయారైంది. తాను మరణించి భార్య బతికి ఉండాల్సిందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితం చివరి దశలో ఉందని తన పిల్లలను ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని అతను వేడుకున్నాడు. కాగా, వీరి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని పలువురు సాయం చేయడానికి ముందుకొచ్చారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకుడు ద్రోణంరాజు రవికుమార్ రూ. 5 వేలు, కొండపల్లి మాధవ్ రూ. 2 వేలు పిల్లలకు అందించారు. వీరికి సాయం చేయాలనుకునే దాతలు 9705347212 నంబర్లో సంప్రదించాలి. అంత్యక్రియలకూ వెళ్లలేకపోయిన భర్త.. కళ్లెదుటే భార్య అగ్నికి ఆహుతవుతున్నా కాపాడలేని దయనీయ స్థితిలో ఉన్న వినోద్ మంగళవారం జరిగిన భార్య అంత్యక్రియలకు సైతం వెళ్లలేకపోవడం దురదృష్టకరం. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం లక్ష్మి భౌతికకాయాన్ని బంధువులు నేరుగా అంబర్‌పేట శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వినోద్‌ను ఎవరూ శ్మశాన వాటికకు తీసుకెళ్లకపోవడంతో అతను కడసారి చూపునకు కూడా నోచుకోలేదు. -
నలుదిశలా వేదనాదం!
సనాతన భారతీయ సంప్రదాయాన్ని దశదిశలా చాటి చెప్పే ఉద్దేశంతో కీసర మండలంలో నెలకొల్పిన వేద పాఠశాల దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. విద్యార్థులను వేదాల్లో నిష్ణాతులుగా మలచి పురాతన హిందూ సంస్కతీ సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు కానుకగా అందజేస్తోంది. ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ పాఠశాల ప్రస్తుతం వేదాల బోధనకు దేశంలోనే ప్రసిద్ధిగాంచింది. టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పాఠశాల శనివారంతో 34వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. కీసర: దక్షిణ భారతదేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన వేదవిద్యను అందిస్తున్న కీసరగుట్ట టీటీడీ వేదపాఠశాల నేటితో 33 వసంతాలు పూర్తిచేసుకుంటోంది. 1981లో ముగ్గురు విద్యార్థులతో ప్రారంభమైన ఈ విద్యాలయం దినదిన ప్రవర్థమానం చెందుతూ దక్షణ భారతవనిలోనే వేదాల బోధనకు పేరుగాంచింది. ప్రాచీన గురుకుల సంప్రదాయన్ని అనుసరిస్తూ క్రమశిక్షణతో కూడిన వేద విద్యను ఇక్కడ నిష్ణాతులైన ఆచార్యులు బోధిస్తున్నారు. వేద పండితులైన ఆచార్యుల సంరక్షణలో విద్యార్థులు వేదాన్ని, శైవాగమాన్ని, స్మార్తాన్ని నేర్చుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ విద్యాలయంలో ఇటీవలే పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించారు. విశాలమైన స్థలంలో ప్రార్థనా మందిరం, విశ్రాంతి గదులు, తరగతి గదులు తదితర సౌకర్యాలతో ఈ పాఠశాల కొనసాగుతోంది. వేద విద్యాలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న టీటీడీ ఆశయాలకు అనుగుణంగా కీసరగుట్ట వేదపాఠశాల ఇప్పటి వరకు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది. ఇక్కడ విద్యను అభ్యసించిన వారు దేశంలోని వివిధప్రాంతాల్లో ఆచార్యులుగా, ఆలయ పూజారులుగా, పురోహితులుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కృష్ణ యజుర్వేదం (12 సంవత్సరాలు), శైవాగమం, స్మార్తం (8 సంవత్సరాలు) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాల్లో 125 విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. నేడు స్నాతకోత్సవం కీసర గుట్ట వేదపాఠశాల స్నాతకోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు జరగనుంది. టీటీడీ ఈఓ జి. గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో వేదవిద్యను పూర్తిచేసుకున్న 16 మంది విద్యార్థులకు (కృష్ణయజుర్వేదం-1, శైవాగమం-6 , స్మార్తం-9 ) పట్టాలతోపాటు, నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తారు. పెద్దమొత్తంలో విద్యార్థులకు గౌరవభృతి కీసరగుట్ట వేదపాఠశాలలో వివిధ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు టీటీడీ ఇచ్చే గౌరవభృతి పెద్ద మొత్తంలో ఉంటుంది. విద్యార్థులు ఈ పాఠశాలలో చేరిన రోజే ఈ మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్లో జమ చేస్తుండటం విశేషం. వేదవిద్య కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థికి రూ 4.64 లక్షలు, శైవాగమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు 1.91 లక్షల నగదుపాటు సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు.