వేదపాఠశాల తాత్కాలిక భవనం
వేములవాడ(రాజన్న జిల్లా) : వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో ఇకనుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటివరకు సంస్కృత భాషాభివృద్ధికి సంస్కృత పాఠశాల, డిగ్రీ, పీజీ కళాశాలలను కొనసాగిస్తున్న ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వేదపాఠశాల ప్రారంభానికి మోక్షం లభించింది. గతంలో ఆలయానికి సంబం«ధించిన ఆసుపత్రి కొనసాగిన భవనంలో వేదపాఠశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నారు.
ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఆలయ అధికారులు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు అడ్మిషన్ల ప్రక్రియకు దరఖాస్తులు అందుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం వేకువజామున బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య వేదపాఠశాల లాంఛనంగా ప్రారంభించేందుకు ఆలయ అధికారులు బుధవారం ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
చిన్నారి విద్యార్థులకు..
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమఃశివాయః అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్న వేములవాడ పట్టణంలో ఇక నుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం సంస్క ృత విద్యను కొనసాగించిన ఆలయ అధికారులు ఇకనుంచి వేదపాఠశాలను కొనసాగించనున్నారు. దీంతో వేదాలు నేర్చుకున్న ఘనాపాఠీలు నిత్యం వేదమంత్రోచ్ఛారణలను వినిపించగా, ఇకనుంచి చిన్నారి విద్యార్థులకు వేదపాఠాలు బోధించనున్నారు.
20రోజులు ఆలస్యంగా..
వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం ఎదుట ఉన్న ఓ భవనంలో వేదపాఠశాల ప్రారంభించేందుకు ఆలయ అధికారులు, దేవాదాయశాఖ, ప్రభుత్వ యంత్రాంగం పనులు చేపట్టింది. ఈమేరకు గతనెల 20న ప్రారంభించనున్నట్లు ముందస్తుగానే ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ పర్యటనలో ఉండడంతోపాటు.. ఇతర కారణాల వల్ల వేదపాఠశాలను ప్రారంభించలేకపోయామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
నిర్వహణ.. నియామకాలకు కమిటీ
వేదపాఠశాలలో అడ్మిషన్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు ఐదుగురు సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో వేదపారాయణదారులు, ఈవో, ఏఈవో, ట్రస్టుబోర్డు చైర్మన్ ఇలా ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి నిర్ణయమై ఫైనల్. ఇందుకు అయ్యే ఖర్చును రాజన్న ఆలయం భరిస్తుండగా.. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు యాభై శాతం ఆలయం, మరో యాభై శాతం కామన్ గుడ్ ఫండ్ నుంచి వేతనాలు చెల్లించనున్నారు.
అడ్మిషన్లు వస్తున్నాయి
వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేదపాఠశాలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వేదపాఠశాలతోపాటు సంగీత, నృత్యకళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదపాఠశాలకు సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వేదపారాయణదారులు రాధాకిషన్‌ను నియమించాం.
- దూస రాజేశ్వర్, ఆలయ ఈవో
Comments
Please login to add a commentAdd a comment