vemulawada rajanna temple
-
తెలంగాణ గుళ్లకు ఐటీ శాఖ నోటీసులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట: తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆదాయపు పన్ను కట్టాలంటూ కొమురవెల్లి, రాజన్న, బాసర ఆలయాలకు నోటీసులు పంపించింది. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయం తొలి స్థానంలో ఉంది. రూ. 8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ. 3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఐటీ రిటర్న్‌లు, 12ఏ రిజిస్ట్రేషన్ గడువు గత నెల 30వ తేదీతో ముగిసింది. రిటర్న్స్, 12ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో ఈ నోటీసులను జారీ చేశారు. అదే విధంగా వేములలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలనికి కూడా ఐటీశాఖ నోటీసులు జారీచేసింది. లెక్క ప్రకారం ఆదాయ పన్నును చెల్లించాలంటూ నోటీసులు పంపించింది. ఇక బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు ఇంకా పలు దేవాలయాలకు కూడా నోటీసులు అందాయి. మరోవైపు ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంబించడం సరైన విధానం కాదని అంటున్నారు. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన దేవాలయాకు పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. చదవండి: ఈనెల రెండో వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ -
వేములవాడ రాజన్న సన్నిధిలో హిజ్రాను మనువాడిన యువకుడు
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. అయితే వాళ్లిద్దరూ అమ్మాయి, అబ్బాయి కాదు.. అమ్మాయి, అమ్మాయి కాదు.. అబ్బాయి, అబ్బాయి అంతకన్నా కాదు.. కానీ, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. వేములవాడ రాజన్న సన్నిధిలో కోడెమొక్కులు చెల్లించుకుని ఆ నందీశ్వరుడి సాక్షిగా.. మనసున మనసై అని పాడుకుంటూ పెళ్లి కూడా చేసేసుకున్నారు. వారిలో ఒకరు హిజ్రా అయితే.. ఇంకొకరు ఓ యువకుడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పింకీ అనే 22 ఏళ్ల హిజ్రాను.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వేములవాడ రాజన్న సన్నిధిలో మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటైంది. డిగ్రీ పూర్తి చేసిన శ్రీనివాస్ ప్రస్తుతం ఆటో నడుపుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా పింకీ, శీనుల వివాహ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఇలాంటి వివాహమే మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ బానోత్ రాధిక(28) డోర్నకల్ మండలం సిగ్నల్ తండాకు చెందిన ధారావత్ వీరూ(30) కి రైలులో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త ప్రేమగా మారింది. రెండు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరూ శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేదమంత్రాల సాక్షిగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. -
నీలకంథరా దేవా..
వేములవాడ/వరంగల్/నాగర్‌కర్నూలు: ఉదయమంతా శివయ్య దర్శనాలు.. రాత్రి జాగరణలు.. ‘ఓం నమఃశివాయ’నామస్మరణతో మంగళవారం రోజంతా శివాలయాలు మార్మోగాయి. పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. ఇటు వేములవాడ రాజన్న.. అటు వేయిస్తంభాల ఆలయం లోని రుద్రేశ్వరుడు.. మరోపక్క చెంచుల మల్లికార్జునుడు.. భక్తజన దర్శనాలతో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో లయకారుడు లింగాకారుడై ఉద్భవించిన పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం స్వామికి మహాలింగార్చనను స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల బృందం ఘనంగా నిర్వహించింది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వపక్షాన స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుమల తిరుపతి వెంకన్న తరఫున టీటీడీ ఏఈవో మోహన్‌రాజు, వేదమూర్తులు సూర్యనారాయణశాస్త్రి, జితేశ్‌ల బృందం రాజన్నకు పట్టువస్త్రాలను సమర్పించారు. ‘కొడుకునియ్యి రాజన్నా..నీకు కోడెను గడుతాం రాజన్నా..’ అని గీతాలాపన చేస్తూ 2 లక్షలమంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. శివదీక్షాపరులతో ఆలయ ప్రాంగణమంతా మంచిగంధం వర్ణమైంది. సాయంత్రం 6 గంటలకు వేదమూర్తులతో మహాలింగార్చన వైభవోపేతంగా సాగింది. అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు ఆలయాన్ని తెరిచే ఉంచుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. దర్శనానికి 6 గంటలు సోమవారం అర్ధరాత్రి 12 నుంచి మంగళవారం వేకువజామున 3.30 వరకు స్థానికుల దర్శనాల అనంతరం లఘుదర్శనాలను కొనసాగించారు. దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది. దీంతో క్యూలైన్లలో పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరోగ్యసిబ్బంది సేవలందించారు. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన షవర్ల వద్ద స్నానాలు చేసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. గుడిచెరువులో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కాగా, రాజన్న దర్శనంలో మంగళవారం దాదాపు ఆరుసార్లు బ్రేక్ విధించారు. దీంతో భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వేయిస్తంభాల గుడికి పోటెత్తిన భక్తులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. నగరంలోని వేయిస్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. ప్రధాన దారినుంచి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులుదీరారు. రాత్రి శ్రీ రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరదేవీ కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో పెద్దపట్నం వేశారు. రాత్రి స్వామి కల్యాణం జరిగింది. కురవి వీరన్న ఆలయంలో కల్యాణం వైభవంగా జరిగింది. పిల్లలమర్రి కిటకిట... సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని శివాలయం మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే దర్శనాలు, అభిషేకాలు నిర్వహించేందుకు భక్తులు బారులుదీరారు. అనంతరం రాత్రి స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
వేములవాడ: రాజన్న కోడెకు ఎంత కష్టం..!!
-
హంగామా సృష్టించిన రాజన్న కోడె.. మేడ, రేకుల షెడ్డు, తడకలపైకి ఎక్కి
సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న కోడె బుధవారం హంగామా సృష్టించింది. స్వామి వారి అభిషేక మంటపంలోని గేటు తీసి ఉండటంతో ఓ కోడె మేడపైకి ఎక్కింది. గమనించిన సిబ్బంది దాన్ని కిందకు దించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో జనాల్ని చూసి బెదిరిపోయింది. కోటిలింగాల ప్రాకారమంతా కలియ తిరిగింది. కోటిలింగాల ప్రాకారం పక్కనే హైటెన్షన్ వైర్లు ఉండడంతో ఆలయ సిబ్బంది భయపడిపోయారు. మెల్లిగా కోడెను ఉత్తర ద్వారం వైపు వచ్చేలా చేయడంతో శీఘ్రదర్శనం క్యూలైన్లపై వేసిన రేకులషెడ్డుపై దూకింది. అక్కడి నుంచి జారి చలవపందిళ్లపైకి వచ్చి పడింది. ఇటీవల వేసిన చలవ పందిళ్లు కాస్త బలంగా ఉండటంతో కర్రలపై ఆగిపోయింది. గమనించిన ఆలయ సిబ్బంది ట్రాక్టర్‌ను చలవ పందిళ్ల కిందకు తీసుకొచ్చి కర్రలకున్న తాళ్లను తెంపేశారు. దీంతో ఆ కోడె సురక్షితంగా ట్రాక్టర్లోకి దిగింది. అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
‘రాజన్న’ భక్తులకు హెలికాఫ్టర్ సదుపాయం
సాక్షి, హైదరాబాద్ : శివరాత్రి సందర్భంగా వేములవాడకు వెళ్లే భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లడానికి హెలికాప్టర్ సదుపాయాన్ని కల్పించింది. హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్లి తిరిగి రావడానికి టికెట్ ధర రూ.30వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు గురువారం బేగంపేట విమానాశ్రయంలో మంత్రి శ్రీనివాస గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ సూచన మేరకే వేములవాడకు హెలికాఫ్టర్ సదుపాయాన్ని కల్పించామన్నారు. రూ.100 కోట్లు పెట్టి వేములవాడలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఒక్క టూరిజం ప్రాంతాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి వెల్లడించారు. -
కాళేశ్వర గంగకు సీఎం జలహారతి
సిరిసిల్ల/మేడ్చల్‌రూరల్/బోయినపల్లి(చొప్పదండి)/వేములవాడ: కాళేశ్వర గంగమ్మను చూసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పులకించిపోయారు. సోమవారం కుటుంబసభ్యులతో కలసి హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్ల మానేరు వంతెన వరకు చేరిన గోదావరి జలాలకు వేదమూర్తుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. సిరిసిల్లను తాకిన జలాలను చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం మానువాడ వద్ద రూ.690.18 కోట్లతో నిర్మించిన మిడ్ మానేరు జలాశయాన్ని సందర్శించారు. 25.873 టీఎంసీల నీటి నిల్వతో నిండుకుండలా ఉన్న జలాశయం వద్ద జలహారతి పట్టారు. మిడ్ మానేరు జలాశయం 2006లో ప్రారంభం కాగా, పలు కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. అయితే 2016 తర్వాత సీఎం ప్రత్యేక చొరవతో మిడ్ మానేరు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి జలాశయం నుంచి గోదావరి నీటిని మిడ్ మానేరులో నింపేందుకు చర్యలు తీసుకున్నారు. నవంబర్ 8 నుంచి ఎల్లంపల్లి నీటిని గాయత్రి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోయడంతో మిడ్ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. జలకళతో ఉట్టిపడుతున్న జలాశయానికి సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మెట్ట ప్రాంతానికి కాళేశ్వరం జలాలు చేరడంతో సీఎం కేసీఆర్ పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, జెడ్పీ చైర్పర్సన్లు న్యాలకొండ అరుణ, కనుమల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్గే తదితరులు పాల్గొన్నారు. సోమవారం సిరిసిల్ల వంతెనపై గోదావరి జలాలకు పూజలు చేస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో సీఎం కేసీఆర్ దంపతులు, వినోద్‌కుమార్ సీఎం వెంట ఈటల కుటుంబీకులు సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబీకులను వెంట తీసుకుని వెళ్లారు. తన పర్యటన సందర్భంగా కుటుంబంతో సహా రావాలని కేసీఆర్ కోరారు. దీంతో మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలో ఉండే మంత్రి ఈటల రాజేందర్.. శామీర్‌పేటలో ఈటల భార్య జమున, కూతురు నీత, అల్లుడు అనూప్‌తో కలసి కేసీఆర్ బస్సు ఎక్కారు. సరిగ్గా పదేళ్లలో.. తెలంగాణ ఉద్యమ నేతగా కేసీఆర్ 2009 నవంబర్ 8న సిరిసిల్ల మానేరు వంతెనపై బట్టలు మార్చుకుంటూ.. పని ఒత్తిడితో కనిపించారు. మళ్లీ అదే వంతెనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, మంత్రులు.. అధికారులతో మిడ్ మానేరు బ్యాక్ వాటర్‌కు పూజలు చేశారు. పదేళ్ల కిందట రాష్ట్ర సాధన ఉద్యమంలో బిజీగా ఉన్న సమయంలో కేసీఆర్ సిరిసిల్లలో బస చేసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో సిరిసిల్ల మీదుగా హైదరాబాద్ వెళ్తూ.. ఢిల్లీకి విమానంలో వెళ్లే హడావుడిలో మానేరు వంతెనపై బట్టలు మార్చుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను సిరిసిల్ల ప్రజలు సోమవారం గుర్తు చేసుకున్నారు. సీఎంకు నిరసన సెగ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని నీలోజిపల్లి గ్రామానికి చెందిన మహిళలు నిరసన తెలిపారు. ఆర్అండ్ఆర్ కాలనీ నుంచి రోడ్డుపైకి ఊరేగింపుగా వస్తున్న మహిళలను, యువకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసన కారులకు తోపులాట జరిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణ గ్రామమైన మాన్వాడ వాసులు సీఎం పర్యటనకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గ్రామంలో పలువురికి ప్యాకేజీ డబ్బులు అందాల్సి ఉన్న నేపథ్యంలో తమ సమస్యలు సీఎంకు విన్నవించుకుందామని అనుకున్న వారికి నిరాశ ఎదురైంది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సీఎం పర్యటనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రాజన్నను దర్శించుకునేందుకు వేములవాడకు వెళ్తున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ నేతలు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అడ్డుకునేందుకు యత్నించారు. పరిస్థితి గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలకు గాయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ దర్శనానికి సీఎం బస్సులో వెళ్తుండగా, ఆయనను చూసేందుకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ చోట పేర్చిన విద్యుత్ స్తంభాలపై 20 మంది మహిళలు కూర్చున్నారు. సీఎం బస్సు రావడంతో ఒక్కసారిగా అందరూ లేచి నిల్చోవడంతో స్తంభాలు అదుపుతప్పి పక్కకు కూలాయి. దీంతో నక్షత్ర(19), వెంకాయమ్మ(35)లకు తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్నను దర్శించుకున్న సీఎం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలసి సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, వీటీడీఏ వైస్‌చైర్మన్ పురుషోత్తంరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆలయ అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కోడె మొక్కు చెల్లించుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అనంతరం రాజన్నగుడి చెరువులో చేపట్టే అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వీటీడీఏ అధికారులకు పలు సూచనలు చేశారు. -
రేపు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(సోమవారం) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం ప్రగతి భవన్ నుంచి బయలుదేరి నేరుగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. అక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఉత్తర తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. -
దొంగెవరు రాజన్నా..?
సాక్షి, కరీంనగర్ : ఫలానా చోట దొంగతనం చేసినట్లు దొంగ ఒప్పుకుంటున్నా... అబ్బే మా దగ్గర దొంగతనమే జరగలేదని వాదించడం వెనుక బలమైన కారణమే ఉంటుంది. వేములవాడ రాజన్న దేవాలయంలోని హుండీ నుంచి ఫిరోజ్ అనే వ్యక్తి దొంగిలించిన ఆభరణాల సంచి విషయంలో అధికారులు చెబుతున్న కథలకు... వాస్తవ అంచనాలకు పొంతన కుదరడం లేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి బంగారు, వెండి, రాగి, అల్యూమినియం ఆభరణాలతో కూడిన సంచిని చోరీ చేసినట్లు స్థానికంగా దేవుడికి ఇచ్చిన బియ్యం అమ్ముకొని బతికే ఫిరోజ్ అనే వ్యక్తి చెబుతుండగా... మా దేవాలయం నుంచి ఎలాంటి సంచి చోరీకి గురి కాలేదని సాక్షాత్తూ దేవాలయ అధికారులే స్పష్టం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దేవాలయంలోని హుండీని లెక్కించేటప్పుడే ఆభరణాలతో కూడిన సంచిని పక్కనపెట్టిన ‘ఇంటిదొంగ’ల గుట్టు వెలుగులోకి రాకుండా ‘మా దగ్గర దొంగతనమే జరగలేదు’ అని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీసీటీవీల పర్యవేక్షణలో కూడా హుండీ లెక్కింపుల్లో అక్రమాలు జరుగుతాయనే విషయం వెలుగులోకి రావచ్చనే ఆందోళన అధికారుల్లో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 23న వేములవాడ హుండీ లెక్కింపు గత అక్టోబర్ 23న దేవాదాయ శాఖ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల మధ్య లెక్కింపు జరిగింది. 600 మంది సభ్యులు గల శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. రూ.1.78 కోట్ల ఆదాయం వేములవాడ దేవస్థానానికి సమకూరింది. ఇందులో 456 గ్రాముల బంగారం, 17.3 కిలోల వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. కాగా సరిగ్గా నెలరోజులకు ఈ నెల 21న హుండీలోని ఆభరణాలు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ సీసీఎస్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా... తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ గోల్డ్‌స్మిత్ వద్ద వేములవాడ నుంచి వచ్చిన ఫిరోజ్ అనే వ్యక్తి ఒకసారి 120 గ్రాములు, మరో రెండు సార్లు 30 గ్రాముల చొప్పున ఆభరణాలు విక్రయించినట్లు తేలింది. అరతుల బంగారాన్ని కూడా కరిగించి తన భార్యకు ఆభరణం చేయించాడు. ఈ వెండి, బంగారం, ఇతర ఆభరణాలు గల సంచిని వేములవాడ దేవాలయం నుంచి అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో దొంగిలించినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు వద్ద ఫిరోజ్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కేసును వేములవాడ పోలీసులకు బదిలీ చేశారు. రాజన్న హుండీ సొమ్ము కాదన్న ఈవో కాగా, రాజన్న హుండీలో లెక్కించిన ఆభరణాలకు సంబంధించి కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో తనిఖీ చేస్తే 20 కిలోల బరువైన సంచి లభించింది. ఆ సంచిని బియ్యం సేకరించే క్రమంలో ఓపెన్‌స్లాబ్‌లో ఓ మూలన పడి ఉంటే తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. అందులోని వస్తువులను మూడుసార్లు తిమ్మాపూర్‌లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని వేములవాడ సీఐ దేవాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తమ గుడిలో ఎలాంటి దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు. 22వ తేదీన మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రాగా, అదేరోజు ఈవో పేరిట రిజాండర్ వచ్చింది. తెల్లకాగితం మీద కార్యనిర్వాహణాధికారి పేరుతో ఎవరి సంతకం లేకుండా వచ్చిన ఈ రిజాయిండర్లో దేవాలయంలో కానుకల చోరీ వార్తకు దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపునకు ఎలాంటి సంబంధం లేదని ఏకవాఖ్య ‘ఖండన’ పంపించారు. వివరాలేవీ అందులో పొందు పరచలేదు. కాగా హుండీ లెక్కింపు సమయంలో నగదు, బంగారం, వెండితోపాటు వెండి పూత రాగి, అల్యూమినియం ఇతర స్క్రాప్‌కు సంబంధించిన లెక్కలు చూసి, అవన్నీ సక్రమంగానే ఉన్నందున దేవాలయం ఆవరణలో చోరీ కాలేదని చెప్పినట్లు తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలోనే ఇంటి దొంగలే ఓ ఆభరణాల సంచిని బియ్యంతోపాటు పడేశారనే లాజిక్కును అధికారులు ఉద్దేశ్య పూర్వకంగానే మరిచిపోతున్నారు. అందుబాటులో లేని సీసీటీవీ ఫుటేజ్ సీసీ టీవీ కెమెరాల నిఘాలోనే హుండీ లెక్కింపు జరిగినా... ఇప్పుడు ఆ టీవీల ఫుటేజీ అందుబాటులో లేదు. కేవలం 16 రోజుల బ్యాకప్ మాత్రమే అందుబాటులో ఉండే విధంగా సీసీ కెమెరాలను కంప్యూటర్లకు అనుసంధానం చేయడంతో ఉన్న ఒక్క ఆధారమూ లేకుండా పోయింది. దొరికిన ఆభరణాల సంచి విలువ తక్కువే అయినా... దేవాలయం హుండీ సొమ్ము చోరీకి గురయిన సంఘటన తేలిగ్గా తీసుకునే అంశం కాదు. ఇది తెలిసే ‘ఆ చోరీకి హుండీకి ఏం సంబంధం లేదు’ అని ఆలయ అధికారులు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది. విచారణ జరుపుతున్నాం: సీఐ శ్రీధర్ వేములవాడ హుండీ లెక్కించిన ఓపెన్ స్లాబ్ ప్రాంతం నుంచే ఆభరణాల సంచిని ఎత్తుకెళ్లినట్లు ఫిరోజ్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో దేవాలయం నుంచి మాకెలాంటి ఫిర్యాదు రాలేదు. కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మేమే సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నాం. ఫిరోజ్‌ను రిమాండ్‌కు తరలించడం జరిగింది.చోరీ వార్తలకు హుండీ ఆభరణాలకు -
వేములవాడలో వేదపాఠాలు
వేములవాడ(రాజన్న జిల్లా) : వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో ఇకనుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటివరకు సంస్కృత భాషాభివృద్ధికి సంస్కృత పాఠశాల, డిగ్రీ, పీజీ కళాశాలలను కొనసాగిస్తున్న ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో వేదపాఠశాల ప్రారంభానికి మోక్షం లభించింది. గతంలో ఆలయానికి సంబం«ధించిన ఆసుపత్రి కొనసాగిన భవనంలో వేదపాఠశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో ఆలయ అధికారులు అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈమేరకు అడ్మిషన్ల ప్రక్రియకు దరఖాస్తులు అందుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గురువారం వేకువజామున బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛారణల మధ్య వేదపాఠశాల లాంఛనంగా ప్రారంభించేందుకు ఆలయ అధికారులు బుధవారం ఏర్పాట్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. చిన్నారి విద్యార్థులకు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓం నమఃశివాయః అనే పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్న వేములవాడ పట్టణంలో ఇక నుంచి వేదపాఠాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం సంస్క ృత విద్యను కొనసాగించిన ఆలయ అధికారులు ఇకనుంచి వేదపాఠశాలను కొనసాగించనున్నారు. దీంతో వేదాలు నేర్చుకున్న ఘనాపాఠీలు నిత్యం వేదమంత్రోచ్ఛారణలను వినిపించగా, ఇకనుంచి చిన్నారి విద్యార్థులకు వేదపాఠాలు బోధించనున్నారు. 20రోజులు ఆలస్యంగా.. వేములవాడ పట్టణంలోని భీమేశ్వరాలయం ఎదుట ఉన్న ఓ భవనంలో వేదపాఠశాల ప్రారంభించేందుకు ఆలయ అధికారులు, దేవాదాయశాఖ, ప్రభుత్వ యంత్రాంగం పనులు చేపట్టింది. ఈమేరకు గతనెల 20న ప్రారంభించనున్నట్లు ముందస్తుగానే ప్రకటించారు. కాగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు జర్మనీ పర్యటనలో ఉండడంతోపాటు.. ఇతర కారణాల వల్ల వేదపాఠశాలను ప్రారంభించలేకపోయామని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. నిర్వహణ.. నియామకాలకు కమిటీ వేదపాఠశాలలో అడ్మిషన్లు, టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను నియమించుకునేందుకు ఐదుగురు సభ్యులు గల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో వేదపారాయణదారులు, ఈవో, ఏఈవో, ట్రస్టుబోర్డు చైర్మన్ ఇలా ఐదుగురు సభ్యులు ఉంటారు. వీరి నిర్ణయమై ఫైనల్. ఇందుకు అయ్యే ఖర్చును రాజన్న ఆలయం భరిస్తుండగా.. టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు యాభై శాతం ఆలయం, మరో యాభై శాతం కామన్ గుడ్ ఫండ్ నుంచి వేతనాలు చెల్లించనున్నారు. అడ్మిషన్లు వస్తున్నాయి వేములవాడ రాజన్న ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించబోయే వేదపాఠశాలకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వేదపాఠశాలతోపాటు సంగీత, నృత్యకళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదపాఠశాలకు సొంత భవనం నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ప్రస్తుతం ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వేదపారాయణదారులు రాధాకిషన్‌ను నియమించాం. - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో -
వేములవాడలో లక్ష దీపోత్సవం
వేములవాడ : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న క్షేత్రంలో గురువారం రాత్రి లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహిం చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ధర్మప్రచార యాత్రలో భాగంగా బళ్లారి పంపా సంస్థాన్ భగవాన్ గోవిందానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి, అర్చకుల వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజలు నిర్వహించిన అనంతరం లక్ష దీపాలను వెలిగించారు. ముందుగా గోవిందానంద సరస్వతి స్వామీజీ దీపాలు వెలిగించిన అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఆ తర్వాత ఆలయ ఆవరణలో మహిళలంతా దీపాలు వెలి గించారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారుు. -
రాజన్నకు అమావాస్య ఎఫెక్టు
ప్రతి రోజూ రద్దీగా కనిపించే ఎములాడ రాజన్న ఆలయం అమావాస్య కారణంగా సోమవారం బోసిపోయింది. దీనికి తోడు ఆషాఢమాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా తగ్గింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అధికారులు, అర్చకులు ఖాళీగా కనిపించారు. - వేములవాడ -
శివశివా..! ఏమిటీ అపచారం !
మద్యం మత్తులో రాజన్న ఆలయంలోకి ప్రవేశించిన ఉద్యోగులు ఇద్దరిని సస్పెండ్ చేసిన ఈవో వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్, వాచ్మెన్ కం హెల్పర్‌గా పనిచేస్తున్న డి.శ్రీనివాస్ ఈనెల 19న మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులను దుర్భాషలాడారు. ఏఈవో గౌరీనాథ్, సూపరింటెండెంట్ విచారణ జరిపి ఈవోకు నివేదిక సమర్పించారు. దీంతో సదరు ఉద్యోగులను ఆలయ ఈవో దూస రాజేశ్వర్ సస్పెండ్ చేశారు. వీరు గతంలోనూ పలుమార్లు మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించారని, క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ మార్పు రాలేదని అధికారులు తెలిపారు. ఉద్యోగులు మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అర్చకులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఆలయ ప్రవేశమార్గంలో బ్రీత్ అనలైజర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని భక్తులు అభిప్రాయపడ్డారు. కాగా.. గతంలో ఒకరిద్దరు అర్చకులు సైతం మద్యం మత్తులో ఆలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశించినా, మద్యం మత్తులో విధులు నిర్వహించినా అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసముంది. -
‘రాజన్నే’ నంబర్ వన్!
వేములవాడకు రూ.84.92 కోట్ల ఆదాయం వేములవాడ: రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన వేములవాడ రాజన్న ఆలయం ఆదాయార్జనలో మాత్రం ముందంజలో నిలిచింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.84.92 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు యాదాద్రి నర్సింహస్వామి రూ.73 కోట్లతో మొదటిస్థానంలో, రాజన్న రూ.70 కోట్లతో రెండోస్థానంలో నిలిచారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున వేములవాడకు తరలివచ్చారు. ఆనవాయితీ ప్రకారం శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా ఆలయానికి ఆదాయం పెరిగి రూ.84.92 కోట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. యాదాద్రికి రూ.75 కోట్లతో రెండోస్థానం దక్కింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు అందుకనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. -
వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించడానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. రాజన్న దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో.. ఆర్జిత సేవలు, లఘు దర్శనాలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు.