‘రాజన్నే’ నంబర్ వన్!
వేములవాడకు రూ.84.92 కోట్ల ఆదాయం
వేములవాడ: రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండో అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు పొందిన వేములవాడ రాజన్న ఆలయం ఆదాయార్జనలో మాత్రం ముందంజలో నిలిచింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.84.92 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు యాదాద్రి నర్సింహస్వామి రూ.73 కోట్లతో మొదటిస్థానంలో, రాజన్న రూ.70 కోట్లతో రెండోస్థానంలో నిలిచారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతర నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున వేములవాడకు తరలివచ్చారు.
ఆనవాయితీ ప్రకారం శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తద్వారా ఆలయానికి ఆదాయం పెరిగి రూ.84.92 కోట్లతో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. యాదాద్రికి రూ.75 కోట్లతో రెండోస్థానం దక్కింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈవో దూస రాజేశ్వర్ తెలిపారు. భక్తుల సంఖ్య మరింత పెరిగే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు అందుకనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.