ఎలాంటి సంబంధం లేదని ఈవో సంతకం లేకుండా పంపిన ‘రిజాయిండర్’
సాక్షి, కరీంనగర్ : ఫలానా చోట దొంగతనం చేసినట్లు దొంగ ఒప్పుకుంటున్నా... అబ్బే మా దగ్గర దొంగతనమే జరగలేదని వాదించడం వెనుక బలమైన కారణమే ఉంటుంది. వేములవాడ రాజన్న దేవాలయంలోని హుండీ నుంచి ఫిరోజ్ అనే వ్యక్తి దొంగిలించిన ఆభరణాల సంచి విషయంలో అధికారులు చెబుతున్న కథలకు... వాస్తవ అంచనాలకు పొంతన కుదరడం లేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి బంగారు, వెండి, రాగి, అల్యూమినియం ఆభరణాలతో కూడిన సంచిని చోరీ చేసినట్లు స్థానికంగా దేవుడికి ఇచ్చిన బియ్యం అమ్ముకొని బతికే ఫిరోజ్ అనే వ్యక్తి చెబుతుండగా... మా దేవాలయం నుంచి ఎలాంటి సంచి చోరీకి గురి కాలేదని సాక్షాత్తూ దేవాలయ అధికారులే స్పష్టం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దేవాలయంలోని హుండీని లెక్కించేటప్పుడే ఆభరణాలతో కూడిన సంచిని పక్కనపెట్టిన ‘ఇంటిదొంగ’ల గుట్టు వెలుగులోకి రాకుండా ‘మా దగ్గర దొంగతనమే జరగలేదు’ అని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీసీటీవీల పర్యవేక్షణలో కూడా హుండీ లెక్కింపుల్లో అక్రమాలు జరుగుతాయనే విషయం వెలుగులోకి రావచ్చనే ఆందోళన అధికారుల్లో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అక్టోబర్ 23న వేములవాడ హుండీ లెక్కింపు
గత అక్టోబర్ 23న దేవాదాయ శాఖ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల మధ్య లెక్కింపు జరిగింది. 600 మంది సభ్యులు గల శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. రూ.1.78 కోట్ల ఆదాయం వేములవాడ దేవస్థానానికి సమకూరింది. ఇందులో 456 గ్రాముల బంగారం, 17.3 కిలోల వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. కాగా సరిగ్గా నెలరోజులకు ఈ నెల 21న హుండీలోని ఆభరణాలు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ సీసీఎస్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా... తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ గోల్డ్‌స్మిత్ వద్ద వేములవాడ నుంచి వచ్చిన ఫిరోజ్ అనే వ్యక్తి ఒకసారి 120 గ్రాములు, మరో రెండు సార్లు 30 గ్రాముల చొప్పున ఆభరణాలు విక్రయించినట్లు తేలింది. అరతుల బంగారాన్ని కూడా కరిగించి తన భార్యకు ఆభరణం చేయించాడు. ఈ వెండి, బంగారం, ఇతర ఆభరణాలు గల సంచిని వేములవాడ దేవాలయం నుంచి అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో దొంగిలించినట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్‌రావు వద్ద ఫిరోజ్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కేసును వేములవాడ పోలీసులకు బదిలీ చేశారు.
రాజన్న హుండీ సొమ్ము కాదన్న ఈవో
కాగా, రాజన్న హుండీలో లెక్కించిన ఆభరణాలకు సంబంధించి కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో తనిఖీ చేస్తే 20 కిలోల బరువైన సంచి లభించింది. ఆ సంచిని బియ్యం సేకరించే క్రమంలో ఓపెన్‌స్లాబ్‌లో ఓ మూలన పడి ఉంటే తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. అందులోని వస్తువులను మూడుసార్లు తిమ్మాపూర్‌లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని వేములవాడ సీఐ దేవాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తమ గుడిలో ఎలాంటి దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు. 22వ తేదీన మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రాగా, అదేరోజు ఈవో పేరిట రిజాండర్ వచ్చింది. తెల్లకాగితం మీద కార్యనిర్వాహణాధికారి పేరుతో ఎవరి సంతకం లేకుండా వచ్చిన ఈ రిజాయిండర్‌లో దేవాలయంలో కానుకల చోరీ వార్తకు దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపునకు ఎలాంటి సంబంధం లేదని ఏకవాఖ్య ‘ఖండన’ పంపించారు. వివరాలేవీ అందులో పొందు పరచలేదు. కాగా హుండీ లెక్కింపు సమయంలో నగదు, బంగారం, వెండితోపాటు వెండి పూత రాగి, అల్యూమినియం ఇతర స్క్రాప్‌కు సంబంధించిన లెక్కలు చూసి, అవన్నీ సక్రమంగానే ఉన్నందున దేవాలయం ఆవరణలో చోరీ కాలేదని చెప్పినట్లు తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలోనే ఇంటి దొంగలే ఓ ఆభరణాల సంచిని బియ్యంతోపాటు పడేశారనే లాజిక్కును అధికారులు ఉద్దేశ్య పూర్వకంగానే మరిచిపోతున్నారు.
అందుబాటులో లేని సీసీటీవీ ఫుటేజ్
సీసీ టీవీ కెమెరాల నిఘాలోనే హుండీ లెక్కింపు జరిగినా... ఇప్పుడు ఆ టీవీల ఫుటేజీ అందుబాటులో లేదు. కేవలం 16 రోజుల బ్యాకప్ మాత్రమే అందుబాటులో ఉండే విధంగా సీసీ కెమెరాలను కంప్యూటర్‌లకు అనుసంధానం చేయడంతో ఉన్న ఒక్క ఆధారమూ లేకుండా పోయింది. దొరికిన ఆభరణాల సంచి విలువ తక్కువే అయినా... దేవాలయం హుండీ సొమ్ము చోరీకి గురయిన సంఘటన తేలిగ్గా తీసుకునే అంశం కాదు. ఇది తెలిసే ‘ఆ చోరీకి హుండీకి ఏం సంబంధం లేదు’ అని ఆలయ అధికారులు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది.
విచారణ జరుపుతున్నాం: సీఐ శ్రీధర్
వేములవాడ హుండీ లెక్కించిన ఓపెన్ స్లాబ్ ప్రాంతం నుంచే ఆభరణాల సంచిని ఎత్తుకెళ్లినట్లు ఫిరోజ్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో దేవాలయం నుంచి మాకెలాంటి ఫిర్యాదు రాలేదు. కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మేమే సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నాం. ఫిరోజ్‌ను రిమాండ్‌కు తరలించడం జరిగింది.చోరీ వార్తలకు హుండీ ఆభరణాలకు
Comments
Please login to add a commentAdd a comment